మందుబాబులు లబలబ:మద్యం బాటిళ్లను బుల్ డోజర్లతో తొక్కించేశారు
1,06,324 మద్యం బాటిళ్లను అధికారులు దగ్గర ఉండి మరీ తొక్కించేశారు.

1,06,324 మద్యం బాటిళ్లను అధికారులు దగ్గర ఉండి మరీ తొక్కించేశారు.
గాంధీనగర్: మందుబాబులు గుండెలు బాదుకునే ఘటన చోటుచేసుకుంది. అదేమిటంటే వేలకొద్దీ మద్యం బాటిళ్లను బుల్ డోజర్ తో తొక్కించేశారు. అయ్యో..ఎంతపని జరిగింది ఎందుకలా మాకిచ్చేస్తే చక్కగా ఎంజాయ్ చేసేవాళ్లంకదా అనుకోకుండా ఉండదు మందుబాబులు. 1,06,324 మద్యం బాటిళ్లను అధికారులు దగ్గర ఉండి మరీ తొక్కించేశారు. దీనికి కారణం తెలుసుకోవాలికదా మరి..
భారతదేశంలో పలు రాష్ట్రాలలో మద్య నిషేధం అమలులో ఉందనే విషయం తెలిసిందే. వాటిలో గుజరాత్ కూడా ఒకటి. అక్కడ మద్య నిషేధం ఉన్నా తరచూ మద్యం బాటిళ్లు పట్టుబడుతునే ఉన్నాయి. వాటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు వాటిని భారీగా ఓ ప్రాంతంలో జమ చేశారు. కానీ వాటిని ఏం చేయాలనే విషయం పోలీసులకు పెద్ద తలనొప్పిగా తయారయ్యింది. ఈ క్రమంలో గుజరాత్ ప్రభుత్వానికి ఓ ఐడియా వచ్చింది. వాటిని ఎక్కడ స్టోర్ చేసినా సమస్యగా మారుతందని భావించిన ప్రభుత్వం.. ఏకంగా రూ. 3 కోట్ల 33 లక్షల విలువైన మద్యం బాటిళ్లను బుల్డోజర్ తో తొక్కించి పడేసింది. గత కొన్ని నెలల్లో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పోలీసులకు పట్టుబడిన మొత్తం 1,06,324 బాటిళ్లను బుల్డోజర్ తో తొక్కించారు. కాగా..గుజరాత్‌లో మద్య నిషేధం కఠినంగా అమలవుతున్నప్పటికీ భారీ స్థాయిలో మద్యం బాటిళ్లు పట్టుబడటం విశేషం.