Prashant Kishor: పీకే సంచలన నిర్ణయం.. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరం..
ఒక వేళ జన సూరజ్ పార్టీ 150 స్థానాలు గెలవకుంటే తాను వ్యక్తిగతంగా ఓటమి అంగీకరిస్తానని ఆయన తెలిపారు.

Prashant Kishor
Prashant Kishor: బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తున్న వేళ కీలక పరిణామం చోట చేసుకుంది. జన్ సూరజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిశోర్ ఎన్నికల్లో పోటీ చేయనని ప్రకటించారు. అయితే పార్టీ కోసం ఎన్నికల్లో పని చేస్తానని ఆయన చెప్పారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జన్ సూరజ్ పార్టీ 150 స్థానాల్లో విజయం సాధిస్తుందని పీకే ధీమా వ్యక్తం చేశారు.
ఒక వేళ జన సూరజ్ పార్టీ 150 స్థానాలు గెలవకుంటే తాను వ్యక్తిగతంగా ఓటమి అంగీకరిస్తానని ఆయన తెలిపారు. పార్టీ తీసుకున్న నిర్ణయం మేరకు తాను ఎన్నికల్లో పోటీ చేయడం లేదన్నారు ప్రశాంత్ కిశోర్. పార్టీ ప్రయోజనాల మేరకే తాను పోటీకి దూరంగా ఉంటున్నానని చెప్పారు. తాను పోటీలో ఉంటే పార్టీ సంస్థాగత కార్యకలాపాల నుంచి దృష్టి మళ్లే అవకాశం ఉందన్నారు పీకే.
రఘోపూర్ అసెంబ్లీ స్థానానికి చంచల్ సింగ్‌ను అభ్యర్థిగా జన్ సురాజ్ ప్రకటించడంతో.. ప్రశాంత్ కిషోర్ ఎన్నికల్లో పోటీ చేయరని నిన్న రాత్రే స్పష్టమైంది. తాను ఎన్నికల్లో పోటీ అంటూ చేస్తే తన సొంత నియోజకవర్గం కర్గహర్ లేదా ఆర్జేడీ కంచు కోట రఘోపూర్ నుండి పోటీ చేస్తానని కిషోర్ గతంలో చెప్పారు. తన మొదటి జాబితాలో రితేష్ రంజన్ (పాండే)ను కర్గహర్ నుండి తమ అభ్యర్థిగా ప్రకటించారు. రఘోపూర్‌కు చంచల్ సింగ్ ఎంపిక చేయడంతో కిషోర్ ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నట్లు ధృవీకరించబడింది. తేజస్వి యాదవ్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఆర్జేడీ కంచుకోట రాఘోపూర్.. అక్కడ నుంచి ప్రశాంత్ కిషోర్ పోటీ చేయాలని అనుకుని ఉంటే తీవ్ర పోటీని ఎదుర్కొనేవాడు. ప్రశాంత్ కిశోర్ పార్టీకి అత్యంత ముఖ్యం. అలాంటి వ్యక్తి ఎన్నికల్లో పోటీ చేయడం వల్ల జన్ సురాజ్ వ్యవస్థాపకుడిని ఒక నియోజకవర్గానికి పరిమితం చేస్తుంది, పార్టీ ప్రచారాన్ని దెబ్బతీస్తుంది.
బిహార్‌లో అధికార ఎన్డీఏ ఓటమి ఖాయమని ప్రశాంత్ కిషోర్ జోస్యం చెప్పారు. నితీశ్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ 25 సీట్లు కూడా గెలవడానికి ఇబ్బంది పడుతుందన్నారు.