టిక్ టాక్ బ్యాన్ చేయండి : హైకోర్టు ఆదేశం

  • Published By: vamsi ,Published On : April 4, 2019 / 04:30 AM IST
టిక్ టాక్ బ్యాన్ చేయండి : హైకోర్టు ఆదేశం

Updated On : April 4, 2019 / 4:30 AM IST

ఇప్పుడు యువత అంతా చాలావరకు ఆన్‌లైన్‌లోనే గడిపేస్తుంది. ఉదయం లేచింది మొదలు.. పడుకునేవరకు యువతకు ఆన్‌లైన్‌లోనే ఉండిపోతుంది. డబ్‌శ్మాష్‌లు, సెల్ఫీ వీడియోలు, పబ్‌జీ గేమ్‌ల చుట్టూనే యువత తిరుగుతుంది. ఇప్పటికే పబ్‌జీ గేమ్ సమాజానికి హానికరంగా మారిపోయి ఉంటే.. మరోవైపు టిక్ టాక్ యాప్ రోజురోజుకీ తలనొప్పిగా మారుతోంది. టిక్ టాక్ మాయలోపడి యువత టైమ్ వేస్ట్ చేస్తుందనే ఆందోళన మొదలైంది.

టిక్ టాక్ యాప్‌కు బానిసలై పిచ్చి, పిచ్చి వీడియోలతో పిల్లలు, యువత పెడదారి పడుతుంటే గృహినులు కూడా ఈ టిక్‌టాక్‌కు బానిసలుగా మారిపోయారు. ఈ క్రమంలో టిక్ టాక్ దూకుడుకు మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ బ్రేకులు వేసింది. తమిళనాడులో టిక్ టాక్ యాప్‌ను నిషేధించాలంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

టిక్ టాక్ యాప్‌పై నిషేధం విధించాలంటూ దాఖలైన పిటిషన్‌పై విచారణ చేపట్టిన మద్రాసు హైకోర్టులోని మధురై బెంచ్.. తమిళనాడులో చిన్నారులు టిక్ టాక్ యాప్‌కు బానిసలుగా మారుతున్నారని అభిప్రాయపడింది. ఈ యాప్ పిల్లల ఆలోచనా విధానం, మానసిక స్థితిపై ప్రభావం చూపుతోందని, అందువల్ల వెంటనే టిక్‌టాక్‌ను బ్యాన్ చేయాలంటూ సూచించింది.

ఇదే క్రమంలో టిక్ టాక్ వీడియోలను మీడియాలో కూడా ప్రసారం చేయొద్దంటూ మధురై బెంచ్ జస్టిస్ సుందరం, కిరుబాకరన్ మీడియా సంస్థలకు సూచించారు. ఆన్‌లైన్ ప్రైవసీ ప్రొటెక్షన్ యాక్ట్‌ తీసుకొచ్చే అంశంపై స్పందించాలని కేంద్రానికి చెప్పారు. ఈ పిటిషన్‌పై తదుపరి విచారణ ఏప్రిల్ 16కు వాయిదా వేసింది హైకోర్టు. ఫిబ్రవరిలో ఇదే విషయమై టిక్‌టాక్‌పై నిషేధం విధించాలంటూ తమిళనాడు ఐటీ మంత్రి మణికందన్ కూడా కేంద్రాన్ని కోరారు.