పారిపోయేందుకు ప్రయత్నించి కిటీకీలో ఇర్కుకుపోయిన కరోనా బాధితురాలు, బయటకు వెళ్లలేక లోనికి రాలేక నరకం

కొవిడ్ కేర్ సెంటర్ లో ఉండలేక తప్పించుకుని పారిపోవడానికి ప్రయత్నించి కరోనా సోకిన ఓ యువతి చిక్కుల్లో పడింది. నరకం చూసింది.

పారిపోయేందుకు ప్రయత్నించి కిటీకీలో ఇర్కుకుపోయిన కరోనా బాధితురాలు, బయటకు వెళ్లలేక లోనికి రాలేక నరకం

Pune Woman

Updated On : March 17, 2021 / 1:28 PM IST

pune woman tries to escape covid quarantine centre: కొవిడ్ కేర్ సెంటర్ లో ఉండలేక తప్పించుకుని పారిపోవడానికి ప్రయత్నించి కరోనా సోకిన ఓ యువతి చిక్కుల్లో పడింది. కిటికీలో ఇరుక్కుపోయింది. బయటక రాలేక లోపలికి వెళ్లలేక గ్రిల్స్ మధ్య నరకం చూసింది. చివరికి అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి హైడ్రాలిక్ కట్టర్ సాయంతో కిటికీ గ్రిల్స్ తొలగించి యువతిని కాపాడారు. పుణేలోని ఎరండ్వేన్ ప్రాంతంలోని కొవిడ్ కేర్ సెంటర్‌లో సోమవారం (మార్చి 15,2021) రాత్రి ఈ ఘటన జరిగింది.

రాత్రి 11.30 గంటల సమయంలో 18 ఏళ్ల యువతి చడీచప్పుడు కాకుండా నిద్ర లేచింది. రెండో అంతస్తులోని కిటికీ దగ్గరికి వచ్చింది. ఆ కిటికీలో నుంచి బయటకు వెళ్లి పారిపోదామనుకుంది. అయితే.. ఆ కిటికీ గ్రిల్స్ చాలా చిన్నగా ఉన్నాయి. అందులోంచి పిల్లి దూరడమే కష్టం. అలాంటి కిటికీ బయటకు రావడానికి ఆ యువతి సాహసం చేసింది. కానీ, ఆమె ప్రయత్నం వికటించి కిటికీలో ఇరుక్కుపోయింది. చాలాసేపు ప్రయత్నించింది. గింజుకుంది. అయినా లాభం లేకపోయింది. గ్రిల్ నుంచి రాలేకపోయింది.

బయటకు రాలేక, లోపలికి వెళ్లలేక యువతి నరకయాతన అనుభవించింది. నొప్పితో విలవిలలాడింది. భయంతో, తీవ్రమైన బాధతో బిల్డింగ్ దద్దరిల్లేలా కేకలు వేసింది. యువతి ఆర్తనాదాలు విని ఆ భవనంలో ఉన్న వాళ్లు పరుగున వచ్చారు. అక్కడ ఏం జరిగిందో చూసి షాక్ అయ్యారు. కిటికీలోంచి ఆమెను బయటకు లాగడానికి ప్రయత్నించారు. కానీ, లాభం లేకపోయింది. విండో గ్రిల్‌ను కట్ చేసి ఆమెను రక్షిద్దామనుకున్నా.. వారి వల్ల కాలేదు. మరోదారి లేక అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి వచ్చారు. హైడ్రాలిక్ కట్టర్ సాయంతో కిటికీ గ్రిల్స్ తొలగించి యువతిని కాపాడారు. దీంతో అక్కడున్న వారందరూ ఊపిరి పీల్చుకున్నారు.