Railway : రైల్వేశాఖ బంపర్ ఆఫర్.. టికెట్ కొనుగోలుపై 3శాతం డిస్కౌట్..కానీ, ఈ రూల్స్ పాటించాలి..
Indian Railways : భారతీయ రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. ‘రైల్‌వన్’ (RailOne) యాప్ ద్వారా అన్ రిజర్వుడు (జనరల్) టికెట్లు బుక్ చేసుకునే వారికి 3శాతం రాయితీ ఇవ్వనుంది.
RailOne App
Railway : భారతీయ రైల్వే శాఖ (Indian Railway Department) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. డిజిటల్ బుకింగ్‌లను ప్రోత్సహించేందుకు ‘రైల్‌వన్’ (RailOne) యాప్ ద్వారా అన్ రిజర్వుడు (జనరల్) టికెట్లు బుక్ చేసుకునే వారికి 3శాతం రాయితీ ఇవ్వనుంది. ఈ ఆఫర్ ఏ డిజిటల్ చెల్లింపు మోడ్ (యూపీఐ, డెబిట్/క్రెడిట్ కార్డులు మొదలైనవి) ఉపయోగించినా వర్తిస్తుంది.
ప్రస్తుతం రైల్ వన్ యాప్‌లో R- వాలెట్ ద్వారా చెల్లింపు చేస్తేనే 3శాతం క్యాష్ బ్యాక్ లభిస్తోంది. ఇప్పుడు దీనిని అన్ని డిజిటల్ చెల్లింపులకూ విస్తరించింది. ఈ కొత్త 3శాతం రాయితీ జనవరి 14వ తేదీ నుంచి జులై 14వ తేదీ వరకు అంటే ఆర్నెళ్ల పాటు అమల్లో ఉంటుంది. రైల్‌వన్ యాప్ ద్వారా రిజర్వుడు, అన్‌రిజర్వుడ్‌తో పాటు ప్లాట్‌ఫాం టికెట్లు కూడా సులభంగా పొందవచ్చనని రైల్వేశాఖ అధికారులు తెలిపారు.
రైల్ వన్ యాప్ అంటే ఏమిటంటే..?
రైల్వే ప్రయాణికులకోసం ఒకే వేదికపై అన్ని సేవలను అందించాలనే ఉద్దేశంతో రైల్వేశాఖ ‘సూపర్ యాప్’ను రూపొందించింది. ఇంతకుముందు రిజర్వేషన్ కోసం IRCTC, జనరల్ టిక్కెట్ల కోసం UTS, రైలు సమాచారం కోసం NTES ఇలా రకరకాల యాప్‌లు వాడాల్సి వచ్చేది. ఇప్పుడు వాటన్నింటినీ కలిపి ‘రైల్‌వన్’ పేరుతో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ యాప్ ద్వారా టిక్కెట్లు బుక్ చేయడంతో పాటు లైవ్ ట్రైన్ స్టేటస్, ప్లాట్‌ఫామ్ వివరాలు, ఆహార ఆర్డర్లు కూడా చేసుకోవచ్చు. రైల్వే స్టేషన్లలో రద్దీని తగ్గించడానికి, సామాన్యులను డిజిటల్ బాట పట్టించడానికి ఈ నిర్ణయం దోహదపడుతుంది.
