Ram Gopal Varma: రామ్ గోపాల్ వర్మకు బిగ్ షాక్.. మూడు నెలల జైలు శిక్ష.. జడ్జి ఫుల్ సీరియస్

సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు బిగ్ షాక్ తగిలింది. ఓ కేసుకు సంబంధించి మూడు నెలలు జైలు శిక్ష విధిస్తూ ముంబై కోర్టు సంచలన తీర్పునిచ్చింది.

Ram Gopal Varma: రామ్ గోపాల్ వర్మకు బిగ్ షాక్.. మూడు నెలల జైలు శిక్ష.. జడ్జి ఫుల్ సీరియస్

Ram Gopal Varma

Updated On : January 23, 2025 / 12:48 PM IST

Ram Gopal Varma: సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు బిగ్ షాక్ తగిలింది. ఓ కేసుకు సంబంధించి మూడు నెలలు జైలు శిక్ష విధిస్తూ ముంబై కోర్టు సంచలన తీర్పునిచ్చింది. చెక్ బౌన్స్ కు సంబంధించి ఏడేళ్ల కిందటి కేసులో విచారణ సందర్భంగా ముంబైలోని అంధేరీ మెజిస్ట్రేట్ కోర్టు ఈ తీర్పును ఇచ్చింది. మూడు నెలల్లో ఫిర్యాదుదారుడికి రూ.3,72,219 పరిహారం చెల్లించాలని వర్మను కోర్టు ఆదేశించింది. పరిహారం చెల్లించని పక్షంలో మరో మూడు నెలలు సాధారణ జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది.

Also Read: Ram Gopal Varma : సంధ్య థియేటర్ ఘటనపై ఆర్జీవీ షాకింగ్ పోస్ట్.. దానికి కారణం అల్లు అర్జున్ ఎలా అవుతారని ఫైర్..

2018లో రామ్ గోపాల్ వర్మపై ఈ చెక్ బౌన్స్ కేసు నమోదైంది. మహేశ్ చంద్ర మిశ్రా అనే వ్యక్తి శ్రీ అనే కంపెనీ పేరుతో రాంగోపాల్ వర్మపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే, ఈ కేసులో పలు సార్లు ఆర్టీవీకి కోర్టు నోటీసులు ఇచ్చింది. అయినా ఆయన ఒక్కసారి కూడా కోర్టుకు హాజరుకాలేదు. దీంతో తాజాగా కోర్టు ఆయనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఈ కేసులో పరిహారం చెల్లించని పక్షంలో రాంగోపాల్ వర్మకు మూడు నెలల పాటు సాధారణ జైలులో పంపించాలని కోర్టు ఆదేశించింది.

Also Read: Ram Gopal Varma : నేను హైద‌రాబాద్‌లోనే ఉన్నా.. ఎక్క‌డికి పారిపోలా : రామ్‌గోపాల్ వ‌ర్మ‌

రాంగోపాల్ వర్మ మంగళవారం తన కొత్త సినిమా ‘సిండికేట్’ ను ప్రకటించిన విషయం తెలిసిందే. సత్య చిత్రంపై నా కన్సెషన్ నోట్ కు కొనసాగింపుగా, నేను ఎప్పటికైనా అతిపెద్ద చిత్రాన్ని రూపొందించాలని నిర్ణయించుకున్నాను.. ఆ సినిమా పేరు సిండికేట్ అంటూ ఆయన పేర్కొన్నారు. అయితే, ఆయన తీయబోయే కొత్త సినిమాలో ఎవరు నటించబోతున్నారు.. కథ ఎలా ఉంటుందనేది ప్రస్తుతం హాట్ టాపిక్ మారింది.

ఇదిలాఉంటే.. రాంగోపాల్ వర్మపై గతేడాది ఏపీలో పలు కేసులు నమోదయిన విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేశ్ ఫొటోలను మార్ఫింగ్ చేసి పోస్టు చేశాడంటూ కేసులు నమోదయ్యాయి. ఈ కేసులకు సంబంధించి విచారణకు హాజరుకావాలని రాంగోపాల్ వర్మకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. కానీ, విచారణకు హాజరుకాలేదు. తనపై నమోదైన కేసులకు సంబంధించి ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. పలు దఫాలుగా విచారణ అనంతరం హైకోర్టులో రాంగోపాల్ వర్మకు ఊరట లభించింది. పలు కేసుల్లో ఆయనకు షరతులతో కూడిన బెయిల్ ను కోర్టు మంజూరు చేసింది.