పశ్చిమ బెంగాల్ లో తెరుచుకున్న ప్రార్ధనాలయాలు

కరోనా వైరస్ కట్టడిలో భాగంగా విధించిన లాక్ డౌన్-5లో కొన్ని సడలింపులు ఇస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. అందులో భాగంగా బడులు సినిమా హాళ్లు, పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ కు అనుమతి ఇవ్వలేదు. జూన్ 8 నుంచి ప్రార్ధనాలయాలు తెరుచుకోవచ్చని అనుమతి ఇచ్చింది. ఇప్పటికే కర్ణాటక ప్రభుత్వం దేవాలయాలు తెరిచేందుకు సమ్మతించగా, సీఎం మమతా బెనర్జీ మే 29 న చెప్పిన విధంగా వెస్ట్ బెంగాల్ లో ఈరోజు నుంచే ఆలయాలను తెరిచారు.
కానీ అతి పురాతనమైన కాళీఘాట్ ఆలయంతో పాటు కాథడ్రల్ చర్చిని తెరిచేందుకు మాత్రం అక్కడి ప్రభుత్వం ఒప్పుకోలేదు. కాళీ ఘాట్ ఆలయం తెరుస్తారనే ఉద్దేశ్యంతో చాలా మంది భక్తులు ఈరోజు ఉదయం ఆలయం వద్దకు వచ్చారు. ఆలయం తెరవకపోవటంతో బయటనుంచే దేవుడికి దండం పెట్టుకుని వెళ్లిపోవటం కనిపించింది.
అలాగే కొల్ కత్తా లోని ప్రసిధ్ధ కేథడ్రల్ చర్చిని కూడా ప్రభుత్వం తెరవలేదు. భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉండటంతో ఈ చర్చిని కూడా అందుబాటులోకి తేవటంలేదని ప్రభుత్వం తెలిపింది. కొన్ని చర్చిల్లో మాత్రం 10 మంది చొప్పున లోపలికి వెళ్లి ప్రార్ధనలు చేసుకుని వచ్చేందుకు అనుమతించారు. మసీదుల్లో 5గురుకి మించి నమాజు చేయకుండా చూసుకుంటున్నారు. సాధ్యమైనంతవరకు ఇళ్లలోనే నమాజుచేసుకోవాలని బెంగాల్ ఇమాం అసోసియేషన్ ముస్లింలకు సూచించింది.