ఎంబీబీఎస్ పూర్తి చేయాలన్న లక్ష్యం.. 64 ఏళ్ల వయసులో నీట్‌లో అర్హత సాధించి కాలేజీలో సీటు
ఆయన ఎస్‌బీఐలో డిప్యూటీ మేనేజర్‌గా పదవీ విరమణ చేశారు. వైద్య రంగంలోకి ప్రవేశించాలనే తన చిరకాల కోరికను ఉద్యోగం నుంచి రిటైర్ అయ్యాక తీర్చుకోవాలని భావించారు.

పుస్తకాలు చదవాలంటేనే చాలా మంది బద్ధకిస్తుంటారు. ఒక్కసారి ఉద్యోగ జీవితంలోకి దిగామంటే మళ్లీ చదవడం అసాధ్యమేనని చాలా మంది అంటుంటారు. చదువుకు దూరంగా ఉండడానికి, పుస్తకం పట్టకపోవడానికి తమ బద్ధకమే ప్రధాన కారణమని తెలిసినా అది ఒప్పుకోకుండా ఎన్నో సాకులు చెబుతుంటారు.
కొందరు మాత్రం ఉద్యోగం చేస్తూనే చదువుకుంటూ ఉన్నత శిఖరాలకు ఎదుగుతారు. మరికొందరు ఉద్యోగం నుంచి రిటైర్ అయిన తర్వాత చదువును కొనసాగిస్తారు. అటువంటి వ్యక్తే ఎస్‌బీఐ మాజీ ఉద్యోగి జై కిశోర్ ప్రధాన్. ఉద్యోగం నుంచి రిటైర్ అయ్యాక 64 ఏళ్ల వయసులో నీట్-2020లో అర్హత సాధించారు.
ఒడిశాకు చెందిన ఆయన ఎస్‌బీఐలో డిప్యూటీ మేనేజర్‌గా పదవీ విరమణ చేశారు. వైద్య రంగంలోకి ప్రవేశించాలనే తన చిరకాల కోరికను ఉద్యోగం నుంచి రిటైర్ అయ్యాక తీర్చుకోవాలని భావించారు. ఈ వయసులో తన కలలను సాధించడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. ఓ పక్క కుటుంబపర బాధ్యతలు మోస్తూనే విద్యాపరమైన లక్ష్యాలను చేరుకుంటున్నారు.
ప్రధాన్ నీట్ కోసం ప్రిపేర్ కావడానికి ఆన్‌లైన్ కోచింగ్ ప్రోగ్రామ్‌లో చేరారు. ప్రిపరేషన్ సమయంలో ఎంతో నిబద్ధత కనబర్చారు. 2020లో నీట్ పరీక్షలో అర్హత సాధించాక ఆయనకు వీర్ సురేంద్ర సాయి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ లో సీటు దక్కింది. నేషనల్ మెడికల్ కమిషన్ చట్టం 2019 సెక్షన్ 14లో నిర్దేశించిన వివరాల ప్రకారం నీట్ (యూజీ) తీసుకునే అభ్యర్థులకు గరిష్ఠ వయోపరిమితి లేదు.
Honey Bee Farming : తేనెటీగల పెంపకాన్ని ఉపాధిగా మల్చుకున్న మహిళ