Robert Vadra: కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కూతురి ఫొటోను పోస్ట్ చేస్తూ ప్రియాంక గాంధీ భర్త సంచలన కామెంట్స్

ఒకవేళ వీటికి సమాధానం చెప్పకపోతే నిజాలను దాచి పెడుతున్నట్లేనని, ఆమె సిగ్గుపడాలని వాద్రా పేర్కొన్నారు.

Robert Vadra: కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కూతురి ఫొటోను పోస్ట్ చేస్తూ ప్రియాంక గాంధీ భర్త సంచలన కామెంట్స్

Robert Vadra - Smriti Irani

Robert Vadra – Smriti Irani: కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ వాద్రా (Priyanka Gandhi Vadra) భర్త, వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రా ఇవాళ ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌లో ఓ పోస్టు చేసి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ(Smriti Irani)పై మండిపడ్డారు. తనపైనే దృష్టి పెడుతున్న తీరును, తన పేరును పార్లమెంటులో స్వార్థ ప్రయోజనాలకు వాడుకోవడాన్ని మానాలని అన్నారు.

పారిశ్రామికవేత్త గౌతం అదానీకి అనుకూలంగా ప్రధాని మోదీ నిర్ణయాలు తీసుకుంటున్నారని ప్రతిపక్ష పార్టీలు విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా, లోక్‌సభలో అవిశ్వాస తీర్మానం సమయంలో స్మృతి ఇరానీ మాట్లాడుతూ… ” నా వద్ద ఓ ఫొటో ఉంది. ఒకవేళ ఆయన (అదానీ) మంచి వ్యక్తి కాకపోతే, మరి ఆయనతో మీ బావ (రాబర్ట్ వాద్రా)కు ఏం పని? ” అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ప్రశ్నించారు.

దీనిపైనే రాబర్ట్ వాద్రా స్పందిస్తూ.. స్మృతి ఇరానీ చేసిన ఆరోపణలకు సంబంధించిన ఆధారాలు ఇవ్వాలని ఛాలెంజ్ చేశారు. తనను వేలెత్తి చూపడం వల్ల స్మృతి ఇరానీ.. ఆమె అసమర్థతలను దాచిపెట్టుకోవచ్చని అనుకుంటే అది కుదరదని చెప్పారు. మిగతా వేళ్లు ఆమెవైపే చూపిస్తాయని అన్నారు. స్మృతి ఇరానీ, ఆమె కుటుంబ సభ్యులు ఎన్నో వివాదాల్లో ఉన్నారని తెలిపారు. ఇందుకు సంబంధించిన వార్తలను వాద్రా పోస్ట్ చేశారు.

గోవాలో స్మృతి ఇరానీ కుటుంబానికి ఉన్న రెస్టారెంట్లు, దేశంలోని పలు ప్రాంతాల్లో మూడో వ్యక్తి పేరుతో వారికి ఉన్న రెస్టారెంట్ల గురించి దేశ తెలుసుకోవాలనుకుంటుందని చెప్పారు. అలాగే, స్మృతి ఇరానీ డిగ్రీ/విద్యార్హతలు, వాటి వెనుక ఉన్న వివాదాలపై వివరాలను దేశ తెలుసుకోవాలనుకుంటుందని పేర్కొన్నారు.

మొదట వాటిపై స్పష్టత ఇచ్చి, ఆ తర్వాతే ఇతరుల వైపు వేలెత్తి చూపాలని వాద్రా విమర్శించారు. వాటిన్నింటికీ స్మృతి ఇరానీ ఇవ్వాల్సిన సమాధానం కోసం ఎదురుచూస్తున్నానని చెప్పారు. ఒకవేళ వీటికి సమాధానం చెప్పకపోతే నిజాలను దాచి పెడుతున్నట్లేనని, ఆమె సిగ్గుపడాలని వాద్రా పేర్కొన్నారు.

Azharuddin: అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అజారుద్దీన్ పోటీకి సై.. అంజ‌న్‌కుమార్ సలహాతో కంగుతిన్న అజ్జూ భాయ్!