శని త్రయోదశి రోజు ఇలా చేయండి..మీ కష్టాలన్నీ తొలగి పోతాయి

  • Published By: chvmurthy ,Published On : March 6, 2020 / 06:45 PM IST
శని త్రయోదశి రోజు ఇలా చేయండి..మీ కష్టాలన్నీ తొలగి పోతాయి

Updated On : March 6, 2020 / 6:45 PM IST

నవగ్రహాలలో ఏడవ వాడైన శనైశ్చరుడు సూర్యభగవానునికి ఛాయాదేవికి కలిగిన కుమారుడని శాస్త్రాలు చెబుతున్నాయి.  సోదరుడు యమధర్మరాజు, సోదరి యమున, స్నేహితులు హనుమాన్, కాలభైరవుడు, ఇతర పేర్లు  శౌరి, బభ్రు, రోద్రాంతక, సూర్యపుత్ర, కాశ్యపన గోత్రం. నిజానికి శని భగవానుడిని మనసారా పూజించి ఆరాధించే భక్తులను కష్టాలనుంచి గట్టెక్కించే కళంకములేని కరుణామూర్తి శనీశ్వరుడని పండితులు అంటున్నారు.

ఏ త్రయోదశి అయితే శనివారము తో కూడి ఉంటుందో ఆ రోజు శని గ్రహాన్ని ‘ శనైశ్చరుడు ‘గా సంబోదించి పరమశివుడు వరము ఇచ్చాడు . శని త్రయోదశి అనగా శనికి చాలా ఇష్టం. మూడు దోషాలను పోగొట్టి మానవులు కోరుకున్న యోగాన్ని అందించేవాడు శనేశ్వరుడు. ఈ ఏడాది 2020లో,  మార్చి 7, మరియు మార్చి 21 శనిత్రయోదశి వచ్చిందని పండితులు చెపుతున్నారు. 

సృష్టి స్థితి లయ కారకుడైన ఈశ్వరుడునే ఆ శని ప్రభావమునకు లోనయ్యాను. సామాన్యులైన మానవులు శని ప్రభావం వల్ల ఎంత ఇక్కట్లు పడుతున్నారో కదా అని ఆలోచించి ఈశ్వరుడు , శని… ” నేను ఇక్కడ తపస్సు చేసినందువల్ల నీవు నా పేరు కలుపుకుని శనేశ్వరుడని పేరు పొందగలవు. ఈ రోజు శని త్రయోదశి కావున ఈ శని త్రయోదశి నాడు నీ వల్ల ఇబ్బందులు పడుతున్నవారు నీ కిష్టమైన నువ్వుల నూనె, నల్ల నువ్వులు, నీలపు శంఖు పుష్పములు, నల్లని వస్త్రంతో నిన్ను ఎవరైతే అర్పించి ఆరాధిస్తారో .. వారికి నీ వల్ల ఏర్పడిన అనారోగ్యం మృత్యుభయం పోయి ఆరోగ్యం చేకూరగలదు అని వరము ఇస్తున్నానని తెలిపాడు. 

ఆ తదుపరి త్రేతాయుగంలో రాముడు, ద్వాపర యుగంలో కృష్ణుడు, పాండవులు, మహామునులు అందరూ కూడా ఈశ్వరునికి అర్చించి తమ దోషాలు పోగొట్టుకున్నారు. శనివారం త్రయోదశి తిథి వచ్చినరోజున శనికి నువ్వులనూనెతో అభిషేకం చేసినా ఆస్వామికి ఇష్టమైన నువ్వులు, నల్లటి వస్త్రం వంటివి దానం చేసినా శని ప్రసన్నుడవుతాడనీ ఏలినాటిశని, అర్ధాష్టమ శని బాధల నుంచి ఉపశమనం లభిస్తుందనీ భక్తుల ప్రగాఢ విశ్వాసం.

శనికి ఇష్టమైన ఆ నక్షత్రాల వారు ఇలా చేయండి 

శని త్రయోదశి చాలా విశిష్టమైనది. శనికి ఇష్టమైన నక్షత్రాలు పుష్యమి, అనూరాధ, ఉత్తరాభాద్ర నక్షత్రాలు. ఈ నక్షత్రాలను శని నక్షత్రాలు అంటారు. శనివారం శని త్రయోదశినాడు శనికి తైలాభిషేకం చేయించి శనిని పూజించి, ఆరాధించినట్లయితే శనిదోషం కొంతవరకు నివారణ జరుగుతుంది. 

బ్రాహ్మణుడికి నల్ల నువ్వులు, చెప్పులు, నల్లగొడుగు, నల్ల వస్త్రము ఇచ్చినట్లయితే దోషాలు తొలగిపోతాయి. ఆరోగ్యము బాగుగా లేనివారు చిటికెడు కళ్లుఉప్పును, నల్లనువ్వులను, శని పాదాల యందు ఉంచి నమస్కరించినా దోషాలు తొలగిపోయి శుభం కలుగుతుందని జ్యోతిష్య పండింతులు, హిందూ ధర్మ చక్రం వెబ్ సైట్ అధినేత  శ్రీకాంత్ శర్మ చెపుతున్నారు. 

శని గాయత్రి…” ఓం రవి సుతాయ విద్మహే మందగ్రహాయ ధీమహి తన్నః శని ప్రచోదయాత్” 

శని శ్లోకం…. ”నీలాంజనసమాభాసం, రవిపుత్రం యమాగ్రజం, ఛాయామార్తాండ సంభూతం, తం నమామి శనైశ్చరం”