జైలు అధికారులకు శశికళ లేఖ… విడుదల తేదీ బయటకు చెప్పొద్దు

  • Published By: venkaiahnaidu ,Published On : September 24, 2020 / 09:59 PM IST
జైలు అధికారులకు శశికళ లేఖ… విడుదల తేదీ బయటకు చెప్పొద్దు

Updated On : September 24, 2020 / 10:31 PM IST

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న శశికళ… తాను జైలు నుంచి ఎప్పుడు విడుదలవుతాననే వివరాలను బయటకు వెల్లడించొద్దని అధికారుల్ని కోరారు. ఈ మేరకు ఆమె బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలు అధికారులకు ఓ లేఖ రాశారు. కొద్దిరోజులుగా శశికళ జైలు విడుదలకు సంబంధించి ఊహాగానాలు వస్తున్న వేళ అధికారులకు ఆమె ఈ లేఖ రాశారు.

సమాచార హక్కు చట్టం కింద కూడా తన జైలు శిక్ష, విడుదల తదితర అంశాలను వెల్లడించొద్దని శశికళ కోరారు. వ్యక్తిగత గోప్యత హక్కు కూడా ప్రాథమిక హక్కేనంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఈ సందర్భంగా ఉటంకించారు. తన వివరాలను సమాచార హక్కు చట్టం కింద వెల్లడించడం కూడా వ్యక్తిగత గోప్యత హక్కును ఉల్లంఘించడమే అవుతుందని శశికళ తెలిపారు. కొందరు వ్యక్తులు ప్రచారం కోసమో, రాజకీయ దుష్ప్రచారం కోసమో ఇలాంటి దరఖాస్తులు చేస్తారని తెలిపారు.


కాగా, 2017 ఫిబ్రవరిలో ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళను దోషిగా తేలుస్తూ సుప్రీం కోర్టుశశికళకు నాలుగేళ్ల జైలు శిక్ష, రూ.10కోట్ల జరిమానా విధించిన విషయం తెలిసిందే.

అయితే, బెంగళూరుకు చెందిన ఓ న్యాయవాది ఇటీవల సమాచార హక్కు చట్టం కింద దాఖలు చేసిన దరఖాస్తుకు స్పందించారు జైలు అధికారులు. న్యాయస్థానం విధించిన రూ.10 కోట్ల జరిమానా కడితే జనవరి 27న విడుదలయ్యే అవకాశం ఉందని.. లేకపోతే మాత్రం 2022 ఫిబ్రవరి 27 వరకు జైలులోనే ఉండక తప్పదని తెలిపారు. ఈ నేపథ్యంలో తాజాగా శశికళ తరఫున ఆమె న్యాయవాది జైలు చీఫ్‌ సూపరింటిండెంట్‌కు లేఖ రాశారు.


మరోవైపు, సత్ప్రవర్తనను దృష్టిలో ఉంచుకొని జైలు అధికారులు శశికళను ముందే విడుదల చేసే అవకాశం ఉందంటూ ఆమె న్యాయవాది తెలిపారు. వచ్చే ఏడాదిలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ శశికళ విడుదలతో ఆ రాష్ట్రంలో కొత్త రాజకీయ పరిణామాలు చోటుచేసుకొనే అవకాశం ఉంది.