Prithviraj Chavan: ట్రంప్ మన ప్రధానిని కూడా కిడ్నాప్ చేస్తారా? కాంగ్రెస్ సీనియర్ నేత వివాదాస్పద వ్యాఖ్యలు..
వెనిజులాలో జరిగిన అలాంటి ఘటన భారతదేశంలో కూడా జరుగుతుందా? మిస్టర్ ట్రంప్ మన ప్రధానమంత్రిని కిడ్నాప్ చేస్తారా? Prithviraj Chavan
Prithviraj Chavan Representative Image (Image Credit To Original Source)
- దేశ ప్రధానిపై వివాదాస్పద వ్యాఖ్యలు
- భారత ప్రధానిని ట్రంప్ కిడ్నాప్ చేస్తారా?
- అమెరికా సుంకాలతో భారత వ్యాపారులకు నష్టం
- ఆ లాభాలు ఇకపై సంపాదించలేరు
Prithviraj Chavan: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలతో అమెరికా దళాలు వెనెజులాపై దాడి చేయడమే కాకుండా ఆ దేశ అధ్యక్షుడినే అపహరించడం ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపింది. వెనెజులా అధ్యక్షుడు నికోలస్ మదురోని బందీగా ఉంచుకుంది అమెరికా. ఇప్పుడీ వ్యవహారం ప్రపంచవ్యాప్తంగా దుమారం రేపుతోంది. కొందరు ట్రంప్ వైఖరిని తప్పుపట్టారు. ఇది కరెక్ట్ కాదని అన్నారు. ఇలాంటి చర్యలు అమెరికా కూడా మంచిది కాదని సొంత దేశానికి చెందిన రాజకీయ నేయకులు ట్రంప్ ని హెచ్చరించారు.
భారత ప్రధానిని ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు..
ఇదిలా ఉంటే.. కాంగ్రెస్ కు చెందిన సీనియర్ నాయకుడు దేశ ప్రధానిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. భారతీయ వస్తువులపై అమెరికా భారీ సుంకాలు విధించడంపై స్పందిస్తూ మహారాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పృథ్వీరాజ్ చవాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇటీవల వెనిజులాలో జరిగిన సంఘటనను కూడా ప్రస్తావించారు. అందులో అధ్యక్షుడు నికోలస్ మదురో, అతని భార్యను బందీ చేసి విచారణ కోసం అమెరికాకు తీసుకెళ్లడం తెలిసిందే.
దీన్ని ప్రస్తావిస్తూ..భారత్ లోనూ కూడా ఇలాంటి పరిస్థితి తలెత్తవచ్చా అని ప్రశ్నించారు. “వెనిజులాలో జరిగిన అలాంటి ఘటన భారతదేశంలో కూడా జరుగుతుందా? మిస్టర్ ట్రంప్ మన ప్రధానమంత్రిని కిడ్నాప్ చేస్తారా?” అని చవాన్ అడిగారు.
ఇది భారతీయ వ్యాపారులకు తీవ్ర నష్టం కలిగిస్తుంది..
అమెరికా విధించిన 50 శాతం సుంకం ప్రభావం గురించి చవాన్ మాట్లాడారు. ఇది భారతీయ వ్యాపారులకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తుందని ఆయన వాపోయారు. “50 శాతం సుంకంతో వ్యాపారం చేయడం అస్సలు సాధ్యం కాదు. నిజానికి ఇది భారత్-అమెరికా వాణిజ్యాన్ని, ముఖ్యంగా భారత్ నుండి అమెరికాకు జరిగే ఎగుమతులను అడ్డుకోవడమే అవుతుంది. ప్రత్యక్ష నిషేధం విధించలేరు కాబట్టి, వాణిజ్యాన్ని ఆపడానికి సుంకాలను ఒక సాధనంగా ఉపయోగించారు. దీన్ని భారత్ భరించక తప్పదు. గతంలో అమెరికాకు ఎగుమతుల ద్వారా మన ప్రజలు సంపాదించిన లాభాలు ఇకపై లభించవు. మనం ప్రత్యామ్నాయ మార్కెట్ల కోసం చూడాల్సి ఉంటుంది. ఆ దిశగా ప్రయత్నాలు ఇప్పటికే జరుగుతున్నాయి” అని చవాన్ అన్నారు.

Nicolas Maduro Representative Image (Image Credit To Original Source)
సుంకాల గురించి, భారతీయ వ్యాపారులకు జరగబోయే నష్టం గురించి చవాన్ మాట్లాడిన దాంట్లో తప్పు లేదు. కానీ, ట్రంప్ మన దేశ ప్రధానిని కూడా కిడ్నాప్ చేస్తారా అంటూ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. ఆయన వ్యాఖ్యలను అధికార పార్టీ నేతలు తీవ్రంగా తప్పుపడుతున్నారు. దేశ ప్రధాని గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలని హితవు పలికారు.
