Jammu Kashmir: జమ్మూకాశ్మీర్‌లో కాల్పుల కలకలం.. ఏడుగురు సైనికులకు గాయాలు

జనవరి 7, 13 తేదీలలో కథువా జిల్లాలోని బిల్లావర్ ప్రాంతంలోని కహోగ్, నజోట్ అడవుల్లో ఎన్‌కౌంటర్లు జరిగాయి.

Jammu Kashmir: జమ్మూకాశ్మీర్‌లో కాల్పుల కలకలం.. ఏడుగురు సైనికులకు గాయాలు

Indian Army Representative Image (Image Credit To Original Source)

Updated On : January 18, 2026 / 11:00 PM IST
  • సెర్చ్ ఆపరేషన్ చేస్తుండగా ఎదురుపడ్డ టెర్రరిస్టులు
  • కాల్పులకు దిగిన ఉగ్రవాదులు
  • అలర్ట్ అయిన ఆర్మీ.. రంగంలోకి అదనపు బలగాలు

Jammu Kashmir: జమ్మూకాశ్మీర్‌లో కాల్పుల కలకలం రేగింది. కిష్త్వార్‌లో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఏడుగురు సైనికులు గాయపడినట్లు ఆర్మీ వర్గాలు తెలిపాయి. సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తుండగా ఛత్రూ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

జమ్మూకు చెందిన వైట్ నైట్ కార్ప్స్ (భారత ఆర్మీ) ఆపరేషన్ ట్రాషి-I పేరుతో ఈ ఆపరేషన్ చేపట్టింది. జమ్మూకాశ్మీర్ పోలీసులతో కలిసి సెర్చ్ ఆపరేషన్ చేస్తున్న సమయంలో సోనార్ జనరల్ ప్రాంతంలో ఉగ్రవాదులు తారసపడ్డారు. వెంటనే అలర్ట్ అయిన ఆర్మీ అదనపు బలగాలను రంగంలోకి దింపింది.

పాకిస్తాన్‌కు చెందిన జైష్-ఎ-మొహమ్మద్ (జెఎం) కు చెందిన ఇద్దరు లేదా ముగ్గురు విదేశీ ఉగ్రవాదుల బృందాన్ని సెర్చ్ టీమ్ చూసింది. భద్రతా బలగాలను చూడగానే ముష్కరులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. గ్రనేడ్లను కూడా విసిరారు. టెర్రరిస్టుల కాల్పులను దళాలు ప్రతిఘటించాయి. సైన్యం, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF), అదనపు పోలీస్ బలగాలు తరలివచ్చాయి. ఇరువర్గాల మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి.

ఆపరేషన్‌ను వేగవంతం చేయడానికి డ్రోన్లు, స్నిఫర్ డాగ్‌లతో సహా అధునాతన నిఘా పరికరాలను మోహరించారు. ఈ సంవత్సరం జమ్మూ ప్రాంతంలో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన మూడవ ఎన్‌కౌంటర్ ఇది. జనవరి 7, 13 తేదీలలో కథువా జిల్లాలోని బిల్లావర్ ప్రాంతంలోని కహోగ్, నజోట్ అడవుల్లో ఎన్‌కౌంటర్లు జరిగాయి. గత సంవత్సరం డిసెంబర్ 15న ఉధంపూర్ జిల్లాలో ఉగ్రవాదులతో జరిగిన కాల్పుల్లో ఒక పోలీసు అధికారి మరణించారు. దట్టమైన చెట్టు ఆకులు, చీకటిని ఉపయోగించుకుని ఉగ్రవాదులు తప్పించుకోగలిగారు.

గత ఏడాది డిసెంబర్‌లో జమ్మూ ప్రాంతంలోని అటవీ ప్రాంతాలలో దాదాపు 36 మంది ఉగ్రవాదులను ఏరివేసేందుకు ప్రారంభించిన ప్రధాన ఉగ్రవాద నిరోధక ఆపరేషన్ తర్వాత ఈ ఎన్‌కౌంటర్లు జరిగాయి. పాకిస్తాన్ కేంద్రంగా పని చేస్తున్న హ్యాండ్లర్లు మరింత మంది ఉగ్రవాదులను పంపేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారనే నిఘా వర్గాల సమాచారంతో భద్రతా దళాలు హైఅలర్ట్ అయ్యాయి. గణతంత్ర వేడుకల నేపథ్యంలో సెర్చ్ ఆపరేషన్లను మరింత ముమ్మరం చేసినట్లు ఆర్మీ వర్గాలు తెలిపాయి.

Also Read: బంగ్లాదేశ్‌లో మరో హిందువు హత్య.. అరటి పండ్ల విషయంలో గొడవ.. వ్యాపారిని కొట్టి చంపేశారు..!