ఆస్పత్రిలో బెడ్ కోసం సీఎం ఇంటి ఎదుట కరోనా పేషెంట్ నిరసన

కుటుంబంలో కరోనా సోకిన వ్యక్తి ఒకరు కర్ణాటక ముఖ్యమంత్రి యెడ్యూరప్ప నివాసం వద్దకు వచ్చి ఆస్పత్రిలో బెడ్ ఇప్పించమని ప్రాధేయపడ్డాడు. తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని, తన కొడుక్కి జ్వరంగా ఉందని..ఆస్పత్రిలో బెడ్ లు దొరకటంలేదని బాధ పడుతూ తన భార్య ఇద్దరు పిల్లలతో గురువారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి నివాసం వద్ద నిరసన తెలిపాడు.
వెంటనే ముఖ్యమంత్రి సిబ్బంది అంబులెన్స్ పిలిచి అతడిని ఆస్పత్రికి తరలించారు. నిరసన తెలిపిన వ్యక్తి తనకు పాజిటివ్ అని తెలియగానే, తన వద్ద డబ్బులు లేకపోవటంతో , ఏ ఆస్పత్రికి వెళ్లకుండా నేరుగా సీఎం నివాసానికే వచ్చినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు.
రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగతున్న నేపధ్యంలో ఆస్పత్రుల్లో బెడ్ ల సంఖ్య పెంచాలని ప్రజలు కోరుతున్నారు. మంగళవారం నుండి బెంగుళూరు అర్బన్ ,మరియు బెంగుళూరు రూరల్ తో సహా పలు జిల్లాల్లో వారంరోజుల పాటు లాక్ డౌన్ అమలు చేస్తున్నారు.
మరో వైపు కోవిడ్ రోగుల సేవల కోసం ఆస్పత్రిలో ఖాళీగా ఉన్న బెడ్ ల సంఖ్యతెలియ చేస్తూ ఆస్పత్రి ఎదుట బోర్డులు పెట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రవేటు ఆస్పత్రుల్లో 50 శాతం బెడ్ లు తప్పని సరిగా కోవిడ్ రోగులకు చికిత్స చేసేందుకు కేటాయించాలని కూడా ఆదేశించింది.