Sonia Gandhi : పార్లమెంట్ భద్రతా వైఫల్య ఘటన క్షమించరానిది.. బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోంది : సోనియా గాంధీ

బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు సోనియాగాంధీ.పార్లమెంట్ నుంచి విపక్ష ఎంపీలను సస్పెండ్ చేయడాన్ని ఖండించారు.

Sonia Gandhi : పార్లమెంట్ భద్రతా వైఫల్య ఘటన క్షమించరానిది.. బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోంది : సోనియా గాంధీ

Sonia Gandhi

Sonia Gandhi in Congress Parliamentary Party meeting : కాంగ్రెస్ అధినేత్రి..కాంగ్రెస్ పార్లమెంటరిపార్టీ చైర్ పర్సన్ సోనియాగాంధీ నేతృత్వంలో పార్లమెంట్ సెంట్రల్ హాల్లో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ భేటీ అయ్యింది. ఈ సందర్భంగా సోనియాగాంధీ మోదీ ప్రభుత్వంపై మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు.పార్లమెంట్ నుంచి విపక్ష ఎంపీలను సస్పెండ్ చేయడాన్ని ఖండించారు.డిసెంబర్ 13వ తేదీన ఘటనపై లోక్‌సభలో హోంమంత్రి ప్రకటన చేయాలని విపక్ష సభ్యులు డిమాండ్ చేస్తే వారిని సస్పెండ్ చేయటం ప్రజాస్వామ్యానికి మాయనిమచ్చ అని అన్నారు.పార్లమెంట్ భద్రతా వైఫల్య ఘటన క్షమించరానిదన్నారు.పార్లమెంట్ ఘటనపై ప్రధాని జాతిని ఉద్దేశించి తన అభిప్రాయాన్ని వెల్లడించడానికి నాలుగు రోజులు పట్టింది అంటూ విమర్శించారు. పార్లమెంటు బయట ప్రధాని స్పందించారని..పార్లమెంట్ గౌరవం పట్ల తనకున్న అసహ్యాన్ని, మన దేశ ప్రజల పట్ల తనకున్న నిర్లక్ష్యాన్ని మోడీ స్పష్టంగా సూచించారని విమర్శించారు.

ఈరోజు బీజేపీ ప్రతిపక్షంలో ఉండి ఉంటే ఎలా స్పందిస్తుందో మీకే ఊహకే వదిలేస్తున్నానని అన్నారు.ఈ సెషన్‌లో జమ్మూ కాశ్మీర్‌కు సంబంధించిన కొన్ని ముఖ్యమైన బిల్లులు ఆమోదం పొందాయని..జవహర్‌లాల్ నెహ్రూ వంటి గొప్ప దేశభక్తుల పరువు తీసేందుకు చరిత్రను వక్రీకరించి, చారిత్రక వాస్తవాలను వక్రీకరించే వారు ఎడతెగని ప్రచారం చేస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు.కేంద్ర ప్రభుత్వం బెదిరింపులకు తాము భయపడేదిలేదని సోనియా స్పష్టంచేశారు. నిజం చెప్పటానికి తాము ఎప్పుడు భయపడమన్నారు. జమ్మూ కాశ్మీర్‌పై తమ వైఖరి స్పష్టంగా మరియు స్థిరంగా ఉందన్నారు.

ఉపరాష్ట్రపతి పట్ల టీఎంసీ ఎంపీ తీరుపై ప్రధాని మోదీ ఆగ్రహం.. ద్రౌపది ముర్ము ఏమన్నారంటే ..

జమ్మూకాశ్మీర్ కు పూర్తి రాష్ట్ర హోదాను తక్షణమే పునరుద్ధరించాలని ఆమె డిమాండ్ చేశారు. కశ్మీర్ లో ఎన్నికలు త్వరగా నిర్వహించాలని..లడఖ్ ప్రజల ఆకాంక్షలు కూడా నెరవేర్చాలని..వారి డిమాండ్లు నెరవేర్చాలని అన్నారు. లడఖ్ ప్రజల పట్ల గౌరవం చూపాలన్నారు. డీలిమిటేషన్ జనాభా గణన తర్వాత మాత్రమే మహిళా రిజర్వేషన్ బిల్లును అమలు చేయబడుతుందని నమ్ముతున్నామని..ఇది మహిళలను తప్పుదారి పట్టించడానికి వారి ఓట్లను సంపాదించడానికి ఉద్దేశించిన కంటితుడుపు చర్యగా అభివర్ణించారు.పార్లమెంటులో మహిళా ప్రాతినిధ్యానికి కాలం చెల్లిందని..మహిళలకు రిజర్వేషన్లు తక్షణమే అమలు చేయాలని..OBC కమ్యూనిటీతో సహా అన్ని వర్గాలకు చెందిన మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు.

అసెంబ్లీ ఎన్నికలకు అంకితభావంతో, దృఢ సంకల్పంతో పని చేసినందుకు తెలంగాణలోని కాంగ్రెస్ నేతలకు అభినందనలు తెలిపారు సోనియాగాంధీ. తెలంగాణ ప్రజలు మాకు స్పష్టమైన తీర్పు ఇచ్చారని..తమకు విజయాన్ని చేకూర్చిన తెలంగాణ ప్రజల నమ్మకాన్ని, విశ్వాసాన్ని నెరవేర్చేందుకు మన శక్తిమేరకు కృషి చేయాలని ప్రభుత్వానికి సూచించారు.ఈ సెషన్‌లో తెలంగాణలో సెంట్రల్ ట్రైబల్ యూనివర్శిటీ ఏర్పాటు బిల్లు ఆమోదం పొందడం సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తంచేశారు.ఇది ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014లో పొందుపరచబడిన నిబద్ధత అని..

ఆ హామీని నెరవేర్చడానికి బీజేపీ ప్రభుత్వం తొమ్మిది సంవత్సరాల సమయం తీసుకుంది అంటూ ఎద్దేవా చేశారు.ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ ను తీవ్రంగా నిరాశపరిచాయని తెలిపారు. తప్పులు సరిదిద్దుకోవడానికి కాంగ్రెస్ అధ్యక్షుడు ఇప్పటికే సమీక్ష జరిపారని..తాము అపారమైన సవాళ్లను ఎదుర్కొంటున్నామని తెలిపారు. దైర్యంగా ముందుకు వెళ్తాం..ఈ క్లిష్ట సమయంలో మన భావజాలం, మన విలువలే మనకు మార్గదర్శకమని అన్నారు.మన నేతలు మనకు స్వాతంత్ర్యం ఇవ్వడానికి చాలా ధైర్యంతో అసమానతలకు వ్యతిరేకంగా పోరాడారని ఆ విషయాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదని గుర్తు చేశారు. ఇండియా కూటమిలో భాగంగా..కాంగ్రెస్ అధ్యక్షుడు మా ఎన్నికల సన్నాహాలు ఇప్పటికే ప్రారంభించారని తెలిపారు.

కేరళలో పెరుగుతున్న కోవిడ్-19 కేసులు.. ముగ్గురు మృతి

ఈ ప్రభుత్వం ప్రజాస్వామ్యంపైనా..పార్లమెంట్‌తో సహా దానికి మూలస్తంభాలైన సంస్థలపైనా క్రమపద్ధతిలో దాడి చేస్తోందని ఆరోపించారు. ప్రపంచ దేశాలలో భారతదేశానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చిన బలం వైవిధ్యం…విభిన్న మతాలు, కులాలు జాతులతో మన అందమైన దేశాన్ని నిర్మించడంలో పాలుపంచుకున్న తీరు గురించి మనం గర్విస్తున్నామని అన్నారు. బీజేపీ ప్రభుత్వ చర్యలు పద్ధతి ప్రకారం ఈ ఐక్యత స్ఫూర్తిని బలహీనపరిచాయని ఆరోపించారు. రిపబ్లిక్ ఆఫ్ ఇండియా రాజ్యాంగం దాడికి గురవుతోందన్నారు.దేశంలో ఆర్థిక అసమానతలు విస్తరిస్తున్నాయని..ఆర్థిక వృద్ధి గురించి ప్రధాన మంత్రి ప్రగల్భాలకు వాస్తవికత మధ్య గణనీయమైన తేడాలున్నాయని అన్నారు. నిరుద్యోగం విపరీతంగా పెరిగిందన్నారు.

పారిశ్రామికవేత్తల చేతిలో సంపద కేంద్రీకృతమై ఉందని విమర్శించారు.నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయని దీంతో పేదల ప్జలు పలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.ఈ సమస్యలను ప్రజల్లోకి తీసుకెళ్లడం చాలా అవసరమన్నారు.మన దేశాన్ని నిలబెట్టిన సామాజిక నిర్మాణాన్ని దెబ్బతీసే శక్తులకు వ్యతిరేకంగా పోరాడడం మన కర్తవ్యమని అన్నారు.ఈ సందర్భంగా సోనియా ఖర్గే అధ్యక్షుడుగా సంవత్సర కాలంలో ప్రదర్శించిన నాయకత్వానికి పార్టీ తరపున కృతజ్ఞతలు తెలిపారు.సార్వత్రిక ఎన్నికల కోసం మనం నిరాశను సానుకూలంగా మార్చుకోవాలని నేతలకు దిశానిర్ధేశం చేశారు.పార్టీకి డోనేషన్స్ విజయవంతమైన ప్రయత్నంగా ఉండేలా ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేస్తారని నాకు నమ్మకం ఉందని సోనియా అన్నారు.