Haridwar: హరిద్వార్‌లో విషాదం.. మానస దేవి ఆలయంలో తొక్కిసలాట.. ఆరుగురు భక్తులు మృతి.. పలువురికి గాయాలు

ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన హరిద్వార్‌లోని మానస దేవి ఆలయంలో తొక్కిసలాట జరిగింది.

Haridwar: హరిద్వార్‌లో విషాదం.. మానస దేవి ఆలయంలో తొక్కిసలాట.. ఆరుగురు భక్తులు మృతి.. పలువురికి గాయాలు

Mansa Devi temple

Updated On : July 27, 2025 / 10:44 AM IST

Haridwar Temple Stampede: ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన హరిద్వార్‌లోని మానస దేవి ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఆదివారం ఉదయం జరిగిన ఈ తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు మరణించారు. 30మందికిపైగా గాయపడినట్లు తెలుస్తోంది. మానస దేవి ఆలయంలోకి పెద్ద సంఖ్యలో భక్తులు చేరుకోవటం వల్ల ఈ తొక్కిసలాట ఘటన జరిగినట్లు చెబుతున్నారు. ఘటన జరిగిన వెంటనే పోలీసులు ఘటన స్థలికి చేరుకొని గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

మానస దేవి ఆలయంకు భారీ సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. పోలీసులు, ఇతర సిబ్బంది ఘటనా స్థలికి చేరుకున్నారు. గాయపడిన వారిని అంబులెన్సుల ద్వారా చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రులకు తరలించారని గర్హ్వాల్ డివిజన్ కమిషనర్ విజయ్ శంకర్ పాండే తెలిపారు. తొక్కిసలాట ఘటనకు కారణాలపై పూర్తిస్థాయి విచారణ చేసిన తరువాత వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.

ఈనెల 23వ తేదీన జరిగిన జలాభిషేకం తరువాత కూడా లక్షలాది మంది కన్వారియాలు (శివ భక్తులు), సామాన్య భక్తులు హరిద్వార్ చేరుకుంటున్నారు. శనివారం, ఆదివారం కావడంతో హరిద్వార్‍లో భక్తుల తాకిడి పెరిగింది. ఈ ప్రమాదం జరిగిన రోడ్డు చాలా ఇరుకైన రోడ్డు. అయితే, జాతర సందర్భంగా ఈ రోడ్డు పూర్తిగా మూసివేయబడింది. అయితే, ఇవాళ భారీ రద్దీ ఉండటంతో భక్తులను ఈ రోడ్డు గుండానే పంపుతున్నారు.

హరిద్వార్ మానస దేవి ఆలయంకు ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. దేశంలోని అనేక రాష్ట్రాల నుండి భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటుంటారు. ఈ కారణంగా మానస దేవి ఆలయంలో ఎప్పుడూ భక్తుల రద్దీతో ఉంటుంది.