కొత్త ట్రాఫిక్ జరిమానాల చట్టం : వాహనదారులకు గుడ్ న్యూస్ వినిపించిన కేంద్ర మంత్రి
వాహనదారుల భద్రత, రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కొత్త మోటారు వాహన చట్టం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 1 నుంచి కొత్త చట్టం దేశంలోని పలు

వాహనదారుల భద్రత, రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కొత్త మోటారు వాహన చట్టం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 1 నుంచి కొత్త చట్టం దేశంలోని పలు
వాహనదారుల భద్రత, రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కొత్త మోటారు వాహన చట్టం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 1 నుంచి కొత్త చట్టం దేశంలోని పలు రాష్ట్రాల్లో అమల్లోకి వచ్చింది. కొత్త చట్టం ప్రకారం ట్రాఫిక్ చలాన్లు భారీగా పెంచేశారు. రూల్స్ బ్రేక్ చేసినా, నిబంధనలు పాటించకపోయినా వాహనదారుల జేబులు గుల్ల చేస్తున్నారు. వేలకు వేల రూపాయల జరిమానాలు వేస్తున్నారు. దీంతో ఆస్తులు అమ్ముకునే పరిస్థితి వచ్చిందని వాహనదారులు వాపోతున్నారు. నూతన ట్రాఫిక్ చట్టంపై వాహనదారులు సీరియస్ గా ఉన్నారు. ఇది టూ మచ్ అని మండిపడుతున్నారు. కొత్త ట్రాఫిక్ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నారు. వెంటనే వెనక్కి తీసుకోవాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నారు.
ఈ క్రమంలో కేంద్ర రవాణశాఖ మంత్రి నితిన్ గడ్కరీ కీలక ప్రకటన చేశారు. వాహనదారులకు ఆయన గుడ్ న్యూస్ వినిపించారు. ట్రాఫిక్ జరిమానాల చట్టం ద్వారా పెంచిన ట్రాఫిక్ ఫైన్ల విధింపుపై రాష్ట్రాలే సొంతంగా నిర్ణయాలు తీసుకోవచ్చని నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. అంతేకాదు.. కావాలంటే ఫైన్లను తగ్గించుకోవచ్చని తెలిపారు. దేశవ్యాప్తంగా పెరిగిన ట్రాఫిక్ జరిమానాలను గుజరాత్ ప్రభుత్వం మంగళవారం(సెప్టెంబర్ 10,2019) 90శాతానికి తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. కొత్త జరిమానాలను అమలు చేసే ఆలోచన తమకు లేదని వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఇదే విధంగా మరికొన్ని రాష్ట్రాలు కూడా ప్రకటిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నితిన్ గడ్కరీ ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవల సవరించిన మోటారు వాహనాల చట్టం-2019 ప్రకారం పెరిగిన ట్రాఫిక్ జరిమానాలను రాష్ట్ర ప్రభుత్వాలు తగ్గించుకునే వెసులుబాటు ఉంటుందని నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. కేంద్రం పెంచిన జరిమానాలు ఆదాయం పెంచుకోవడం కోసం కాదని.. ప్రజల భద్రత కోసమేనని ఆయన తేల్చిచెప్పారు.
కాగా, వాహనాల కొనుగోళ్లకు యువత మొగ్గు చూపని కారణంగా ఆటో మొబైల్ రంగం మందగమనంలో సాగుతోందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని నితిన్ గడ్కరీ వివరణ ఇచ్చారు. వాహనాల అమ్మకాలు పడిపోయేందుకు ఇది కూడా ఓ కారణమని నిర్మలా సీతారామన్ చెప్పారని ఆయన తెలిపారు. బీఎస్-6 ప్రమాణాలతో హోండా యాక్టివా 125 స్కూటర్ ఆవిష్కరణ సందర్భంగా ఆయన దీనిపై స్పందించారు. ప్రతి నెల దిగజారుతున్న వాహన అమ్మకాలకు పలు కారణాలు ఉన్నాయని అన్నారు. మార్కెట్ లోకి ఈ-రిక్షాల అరంగేట్రంతో సంప్రదాయ ఇంధన వాహనాల అమ్మకాలు పడిపోవడం, దేశ వ్యాప్తంగా ప్రజా రవాణా మెరుగుపడడం వంటి కారణాల వల్ల వాహన రంగం కష్టాల్లో ఉందని వివరించారు. వాహనాలపై ప్రస్తుతం ఉన్న జీఎస్టీని 10 శాతం తగ్గించాలని, దీనివల్ల తమకు తాత్కాలిక ఊరట లభిస్తుందని ఆటోమొబైల్ రంగం కోరుతోంది. కానీ ఇది జీఎస్టీ మండలి పరిధిలోని అంశం అని, దీనిపై ఆర్థికశాఖను సంప్రదించాను అని, ఇది వారి చేతుల్లోనే ఉందని గడ్కరీ వివరించారు. ప్రతి ఏటా మన దేశంలో 5లక్షల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, 1.5లక్షల మంది చనిపోతున్నారని గడ్కరీ తెలిపారు. ప్రాణం కన్నా ప్రపంచంలో ఖరీదైనది ఏదీ లేదన్నారాయన.
కొత్త ట్రాఫిక్ చలాన్ల చట్టం గురించి కేంద్రమంత్రి చేసిన ప్రకటన వాహనదారులకు ఊరటనిచ్చేలా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కేంద్ర మంత్రి ప్రకటనను రాష్ట్ర ప్రభుత్వాలు స్వాగతించాయి. కావాలంటే ట్రాఫిక్ చలాన్లు తగ్గించుకోవచ్చన్న మంత్రి ప్రకటనతో… రాష్ట్ర ప్రభుత్వాలు దానిపై ఫోకస్ పెట్టాయి. భారీ ఫైన్లతో వాహనదారుల నుంచి తీవ్రమైన నిరసన వ్యక్తమవుతోంది. నిత్యం ట్రాఫిక్ పోలీసులు, వాహనదారుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ వ్యవహారం పెద్ద తలనొప్పిగా మారింది. చలాన్లు తగ్గించుకునే వెసులుబాటు ఇవ్వడంతో అటు రాష్ట్ర ప్రభుత్వాలకు, ఇటు వాహనదారులకు కొంత రిలీఫ్ లభించినట్టు అయ్యింది.