లే ఔట్ రెగ్యులరైజేషన్ పథకం : ఏపీ, తెలంగాణ, తమిళనాడుకు నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు

లే ఔట్ రెగ్యులరైజేషన్ పథకం : ఏపీ, తెలంగాణ, తమిళనాడుకు నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు

Updated On : December 16, 2020 / 1:49 PM IST

Supreme Court : తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడులో అమలు తలపెట్టిన లే అవుట్ రెగ్యులరైజేన్ పథకంపై సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. జస్టిస్ ఎల్.నాగేశ్వరరావు నేతృత్వంలో విచారణ చేపట్టిన త్రి సభ్య ధర్మాసనం ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.

ఎల్‌ఆర్ఎస్ స్కీమ్ ద్వారా అక్రమాలకు పాల్పడిన రియల్ ఎస్టేట్ వాళ్లను, అధికారులను వదిలేసి… ప్లాట్లు కొన్న వారు, ఇళ్లు కట్టుకున్న వారిని శిక్షిస్తున్నారని తెలంగాణ లోని జనగాం వాసి జువ్వాడి సాగర్ రావు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అక్రమ లే అవుట్ల వల్ల వరదలతో సహా అనేక సమస్యలు వస్తాయని హైదరాబాద్, చెన్నైలో వచ్చిన వరదలు రుజువు చేస్తున్నాయని పిటిషనర్‌ పేర్కొన్నారు.

అక్రమ లేఔట్లకు అనుమతి ఇచ్చిన వాళ్లపై విచారణ జరిపాలని, ఎల్ ఆర్ ఎస్ ద్వారా సమీకరించిన నిధులను ఇతర అవసరాలకు మళ్లించ కుండా మౌళిక సదుపాయాల కల్పన కోసం వెచ్చించాలని, జిపిఎస్ విధానం ద్వారా అక్రమ నిర్మాణాలు నిలువరించాలని పిటిషనర్ తన ప్రజా ప్రయోజన వ్యాజ్యం లో కోరారు.

కేంద్ర పర్యావరణ శాఖ, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ, సిబిఐ సహా తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు రాష్ట్రాలకు నోటీసు జారీ చేసింది. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కూడా రెస్పాండెంట్లుగా చేర్చి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.