అనూహ్యంగా ఎదిగింది, ఇంతలోనే పతనమైంది.. సుశాంత్ సింగ్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి జీవితం తలకిందులు

  • Published By: naveen ,Published On : September 9, 2020 / 10:11 AM IST
అనూహ్యంగా ఎదిగింది, ఇంతలోనే పతనమైంది.. సుశాంత్ సింగ్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి జీవితం తలకిందులు

Updated On : September 9, 2020 / 11:46 AM IST

రియా చక్రవర్తి. పరిచయం అక్కర్లేని పేరు. నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ గర్ల్ ఫ్రెండ్. ఇప్పుడు కటకటాల పాలైంది. బాలీవుడ్ లో సంచలనం రేపిన సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి అనేక మలుపులు తిరిగింది. చివరికి రియా అరెస్ట్ కి దారితీసింది. ఎన్సీబీ(నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో) అధికారులు ఆమెని అదుపులోకి తీసుకున్నారు. మూడు రోజులు డ్రగ్స్ లావాదేవీల కోణంలో రియాని ప్రశ్నించిన ఎన్సీబీ అధికారులు చివరికి అరెస్ట్ చేస్తున్నట్లు ప్రకటించారు. అసలు రియా చక్రవర్తి లైఫ్ ఎలా స్టార్ట్ అయ్యింది? ఆమె ప్రస్తానం ఏంటి? స్టార్ డమ్ ఎలా వచ్చింది? ఇంతలోనే ఆమె జీవితంలో చీకట్లు ఎందుకు అలుముకున్నాయి? శిఖరం స్థాయిలో ఉన్న రియా చక్రవర్తి పతనానికి పడిపోవడానికి కారణం ఏంటి?

పదిహేడేళ్ల వయసులోనే గ్లామర్ ప్రపంచంలోకి:
రియా చక్రవర్తి తండ్రి ఓ ఆర్మీ ఆఫీసర్‌. అంబాలాలోని ప్రతిష్ఠాత్మక ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌లో చదువుకుంది. ఇదీ రియా బాల్యం. పదిహేడేళ్ల వయసులోనే తను గ్లామర్‌ రంగంలోకి అడుగుపెట్టింది. ఎమ్‌టివి నిర్వహించిన ఓ షోలో విజేతగా నిలిచింది. ఇక అప్పటి నుంచి ఫోకస్‌ లైట్లే తనకి దారి చూపించాయి. వీజేగా, మోడల్‌గా అడుగులు వేస్తూ సినిమాల్లోకి ప్రవేశించింది.

తెలుగు చిత్రంతోనే వెండితెర మీదకు ఎంట్రీ:
2012లో విడుదల అయిన ‘తూనీగ తూనీగ’ తెలుగు చిత్రంతోనే వెండితెర మీద తొలి అవకాశం దక్కింది రియాకు. ఎంఎస్. రాజు దర్శకత్వం, దిల్‌రాజు సమర్పణ… ఓ నటిగా నిలదొక్కుకోవడానికి ఇంకేం కావాలి. ఆ మరుసటి ఏడాదే ‘మేరే డాడ్‌ కి మారుతి’ సినిమాలోనూ మంచి పాత్రనే దక్కించుకుంది. యష్‌రాజ్‌ సంస్థ ఆ సినిమాకి అండగా నిలిచింది. ఇక రియా కెరీర్‌ పట్టాల మీదకు వచ్చేసింది. దూసుకుపోవడమే తరువాయి అనుకున్నారంతా. ఊహించినట్టుగానే ‘సోనాలి కేబుల్‌’, ‘దొబారా’ లాంటి అవకాశాలను అందుకుంది. సిప్పీ బ్రదర్స్‌ నిర్మించిన సోనాలి కేబుల్‌ పూర్తిగా రియా చుట్టూనే తిరుగుతుంది.

రియా జీవితాన్ని మలుపు తిప్పిన సుశాంత్ మరణం:
కాలమే కలిసిరాలేదో, కెరీర్‌పరమైన పొరపాట్లో… ఏదైతేనేం, దొబారా తర్వాత రియా వేగం ఒక్కసారిగా తగ్గిపోయింది. గత ఆరేళ్లలో మూడు సినిమాల్లో మాత్రమే కనిపించింది. అమితాబ్‌, ఇమ్రాన్‌ హష్మీలతో తను నటించిన ‘చెహ్రా’ విడుదల కొవిడ్‌ వల్ల వాయిదా పడింది. అది కనుక రిలీజ్‌ అయి, తనకి గుర్తింపు వస్తే… కెరీర్‌లో రెండో ఇన్నింగ్స్‌ మొదలు పెట్టేదేమో.

కానీ ఇంతలో సుశాంత్‌ మరణం, అతని జీవితంలో తన పాత్రతో… కెమెరా ముందు నిలబడాల్సిన మనిషి బోనులోకి చేరింది. దర్శకుల సలహా వినాల్సిన తను, లాయర్లను కలుసుకుంటోంది. చివరికి అనుకున్నదే జరిగింది. నెలల తరబడి జాతీయ మీడియా దోషిగా నిర్ధరించిన రియా చక్రవర్తి ఇప్పుడు అరెస్టయ్యింది. ఈ ఇంటర్వెల్‌ బ్యాంగ్‌ తర్వాత.. రియా పాత్ర ఏమిటో విచారణలో తేలుతుంది.

రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకోవడానికి రియానే కారణం:
14, జూన్‌ 2020. సుశాంత్‌ సింగ్ ఆత్మహత్య వార్తతో దేశం ఉలిక్కిపడింది. ఆత్మహత్య పరిష్కారం కాదనే సినిమాలో (చిచోరే) నటించినవాడు, ఎలాంటి ఒడిదుడుకులనైనా ఎదుర్కొని జీవితమనే ఆటలో గెలవాలనే (ఎమ్‌.ఎస్‌.ధోని) సంభాషణలు పలికించిన వాడు… స్వయంగా తన ప్రాణం తీసుకోవడం సంచలనం సృష్టించింది. అందరూ డిప్రెషన్‌ గురించి, నెపోటిజమ్‌ గురించి చర్చించడం మొదలుపెట్టారు. సోషల్‌ మీడియా వేదికగా తలా నాలుగు మాటలు చెప్పేందుకు సిద్ధపడిపోయారు.

ఇంతలో సుశాంత్‌ తండ్రి కె.కె.సింగ్‌ పాట్నాలో రియా మీద ఓ కేసు ఫైల్‌ చేయడంతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కిపోయింది. రియా తన కొడుకును మోసం చేసి… అతను ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించిందని ఆయన వాదన. రూ.15 కోట్లకు పైగా డబ్బును సుశాంత్‌ నుంచి దండుకుందని ఆరోపణ.
https://10tv.in/what-is-the-connection-of-riya-drug-case-to-the-death-of-mumbai-polices-son/
జీడీపీ పతనం, చైనా దురాక్రమణలకంటే రియా ట్రయల్‌ మీదే మీడియా దృష్టి:
ఆ నేపథ్యంలో ఆత్మహత్యకు ప్రేరేపించడం దగ్గర నుంచి దొంగతనం వరకు … రకరకాల కేసులను రియాపై మోపారు. ఇక వార్తలన్నీ సుశాంత్‌ ఆత్మహత్య కోణం నుంచీ… రియా చేసిన మోసం వైపు మళ్లాయి. విషకన్య, లేడీ కిలాడీ, కాలాజాదూ… అంటూ కొత్తకొత్త పేర్లెన్నో రియాను పలకరించాయి. ఓ రెండు నెలలుగా మీడియా ప్రైమ్‌ టైమ్‌ రియా మీద చర్చలతోనే గడిచిపోయింది. జీడీపీ పతనం, చైనా దురాక్రమణలకంటే రియా ట్రయల్‌ మీదే దృష్టి పెట్టింది.

ఓవైపు సీబీఐ, మరోవైపు ఈడీ, ఇంకోవైపు నార్కోటిక్స్ శాఖ:
తను నిరపరాధినని రియా మొదటి నుంచి చెబుతూనే ఉన్నా… ఆమె నిజాయతీనే ప్రశ్నించేలా రోజుకో ఆధారంగా బయటపడటం మొదలైంది. డ్రగ్స్‌ గురించి వాట్సాప్‌లో చేసిన చాట్‌తో ఏదో జరుగుతున్నదనే అనుమానం బలపడింది. దాంతో నార్కోటిక్స్‌ శాఖ రంగంలోకి దిగింది. సుశాంత్‌ నుంచి తీసుకున్న డబ్బులకు సంబంధించి ఈడీ డిపార్టుమెంట్‌ తన విచారణ మొదలుపెట్టింది.

సీబీఐ ఎలాగూ రంగంలోనే ఉంది. ఇక జాతీయ మీడియా సమాంతర విచారణ సరేసరి. మొత్తానికి రియా అష్టదిగ్బంధనంలోకి వెళ్లిపోయింది. సుశాంత్‌ ఇంట్లో పని వాళ్లని తనే అజమాయిషీ చేస్తుందనే వార్త, మహేష్‌భట్‌కు చేరువయ్యేందుకే తనతో బ్రేకప్‌ చేసుకుందనే పుకారు… ఇలా రియాని దోషిగా నిలబెట్టేందుకు సహకరించే కబుర్లు చాలానే వెలుగులోకి వచ్చాయి.

డ్రగ్స్‌ డీలర్లతో సంబంధం ఉందన్న రుజువుతో రియా సోదరుడు షోవిక్‌ చక్రవర్తిని గతవారం అరెస్టు చేయడంతో… త్వరలోనే రియాను కూడా బంధిస్తారనే నమ్మకం ఏర్పడిపోయింది. ‘కంగ్రాచ్యులేషన్స్‌… మీరు నా కొడుకుని అరెస్టు చేశారు. తర్వాత నా కూతురును కూడా అరెస్టు చేస్తారు. ఆ తర్వాత ఎవరి వంతో చూడాలి’ అంటూ షోవిక్‌ అరెస్టు సమయంలో ఆమె తండ్రి బేలగా స్పందించడమే ఇందుకు నిదర్శనం.

రియా కెరీర్ ముగిసినట్టే:
‘నేనేం చేసినా సుశాంత్‌ కోసమే చేశాను’ అంటూ రియా అధికారుల దగ్గర వాపోయిందంటూ ఓ జాతీయ పత్రిక తెలిపింది. సుశాంత్‌తో కలిసి తను, తన సోదరుడు డ్రగ్స్‌ తీసుకున్నట్టు ఒప్పుకుందంటూ మరో వార్తా సంస్థ ప్రకటించింది. కానీ అధికారికంగా పూర్తి వివరాలు వస్తే కానీ రియా-సుశాంత్‌ కథ మీద ఓ నిర్ణయానికి రాలేం. ప్రస్తుతానికైతే ఒకటి స్పష్టం… రియా ఇప్పుడు బోనులో ఉంది. తన కెరీర్‌ తాత్కాలికంగా ముగిసిపోయింది. ఆర్మీ నేపథ్యంలోని క్రమశిక్షణ, నటనలోని తృప్తి, కళతో పాటు వచ్చే కాసులు… ఇవన్నీ తనకు దూరమయ్యాయి.