‘సుప్రీం’లో తేల్చుకుంటాం..

The stalemate in the central government-farmers talks : కేంద్రం-రైతుల చర్చల్లో అదే ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఎనిమిదో విడత చర్చల్లో కూడా కేంద్రం వెనక్కి తగ్గేదే లేదని తేల్చేసింది. కొత్త వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకునేదే లేదని తేల్చేసింది. అవసరమైతే సుప్రీంకోర్టులోనే తేల్చుకోవాలని కేంద్రం భావిస్తోంది. చట్ట విరుద్ధమని సుప్రీంకోర్టు చెబితేనే కొత్త చట్టాలను వెనక్కి తీసుకుంటామని స్పష్టం చేసింది. మరోవైపు… మూడు చట్టాల రద్దుకే రైతులు పట్టుబట్టారు. 700 సార్లు చర్చలకు పిల్చినా వెళ్తాం కానీ.. వెనక్కి తగ్గబోమని రైతుల స్పష్టం చేశారు. చట్టాలను రద్దు చేసేంత వరకు ఉద్యమం ఆపేదే లేదని రైతులు హెచ్చరించారు. చట్టాలను వెనక్కి తీసుకుంటేనే ఇళ్లకు తిరిగి వెళ్తామని తెగేసి చెబుతున్నారు.
కేంద్ర తీసుకువచ్చినవ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ ఢిల్లీలో రైతులు ఆందోళన చేస్తుంటే…. రైతు సంఘాలను కేంద్రం చర్చలకు ఎందుకు పిలుస్తుందని రైతు పోరాట సమన్వయ సమితి కో-కన్వీనర్ హన్నన్ మొల్లా ప్రశ్నించారు. రైతులు చలిలో తీవ్ర ఇబ్బందులు పడుతుంటే… కేంద్ర పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. వ్యవసాయ చట్టాలు రైతులకు వ్యతిరేకంగా ఉన్నాయని.. వెంటనే రద్దు చేసి.. పంటలకు మద్దతు ధర కల్పించాలంటూ డిమాండ్ చేశారు. చట్టాల్లో ఎలాంటి సవరణలను అంగీకరించబోమని సృష్టం చేశారు.
రైతు సంఘాల నేతలతో కేంద్రం 8వ విడత చర్చలు చేపట్టింది. విజ్ఞాన్ భవన్‌లో 40 రైతు సంఘాల నేతలతో కేంద్ర మంత్రులు సమావేశమయ్యారు. వ్యవసాయ చట్టాల రద్దు, కనీస మద్దతు ధరకు చట్టబద్ధతపై చర్చించారు. అయితే.. చట్టాల రద్దు మినహా అన్ని డిమాండ్లు అమలు చేసేందుకు కేంద్రం సిద్దమంటోంది. రైతులు మాత్రం చట్టాలను రద్దు చేయాల్సిందేనని, కేవలం సవరణలతో సరిపెడతామంటే కుదరదని స్పష్టం చేస్తున్నారు. కేంద్రం తీరును రైతు పోరాట సమన్వయ సమితి ప్రతినిధి కూరగంటి కవిత తీవ్రంగా తప్పుపట్టారు.
చట్టాలను రద్దు చేయమంటూనే చర్చలకు పిలవడం వెనుకున్న మర్మమేంటో అర్థం కావడం లేదన్నారు. రైతు ఉద్యమం నిలుపుదల కేంద్రం నిర్ణయంపై ఆధారపడి ఉందని చెప్పారు. చట్టాల రద్దు, పంటలకు మద్దతు ధరకు చట్టబద్దత కల్పించాలన్న ఆమె.. కేంద్రం వద్ద కొన్ని ప్రతిపాదనలు ఉన్నట్లు తెలిసిందన్నారు. రైతుల వైఖరి స్పష్టం చేశామన్న కవిత.. ఇక తేల్చాల్సింది కేంద్రమేనని క్లారిటీ ఇచ్చారు. ఇవాళ్టి చర్చలు ఫలించకపోతే జనవరి 26న కిసాన్ పరేడ్ జరుగుతుందని కవిత
చెప్పారు.