పోలింగ్ డే : తమిళనాడులో థియేటర్లు బంద్

చెన్నై : తమిళనాడు రాష్ట్రంలో ఏప్రిల్ 18వ తేదీన సినిమా థియేటర్లు మూతపడనున్నాయి. గురువారం రెండో షో లు ఉండవు. ఎన్నికల కారణంగా తమిళనాడు థియేటర్ల సంఘం ఈ ప్రకటన చేసింది. ఉదయం, మధ్యాహం షో లు క్యాన్సిల్ చేసినట్టు తెలిపారు. దేశంలో రెండో విడత సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఏప్రిల్ 18న పలు రాష్ట్రాల్లో పోలింగ్ జరగనుంది. తమిళనాడు రాష్ట్రంలో 38 లోక్ సభ స్థానాలకు, 16 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తారు. ఓటింగ్ శాతాన్ని పెంచాలనే ఉద్దేశ్యంతో, ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుతూ తమిళనాడు సినిమా థియేటర్ల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది.
సాధారణంగా ఉదయం పూట షోలు మాత్రమే క్యాన్సిల్ చేస్తామని, ఈసారి మాత్రం మధ్యాహ్నం షో ని కూడా క్యాన్సిల్ చేశామని తమిళనాడు థియేటర్లు, మల్టిప్లెక్స్ ఓనర్ల సంఘం అధ్యక్షుడు సుబ్రమణియన్ తెలిపారు. రెండు షో లు క్యాన్సిల్ చేయడంతో తమకు 25 కోట్ల రూపాయల నష్టం వస్తుందని చెప్పారు.
ఓటు ప్రజల హక్కు. దేశం కోసం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని ఈసీ చెబుతుంది. ఓటు ఆవశ్యకత, ప్రజాస్వామ్య పరిరక్షణలో ఓటుకున్న పాత్ర గురించి ఓటర్లను చైతన్యం చేసేందుకు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఈసీ ఇంత శ్రమిస్తున్నా ఇంకా చాలామందికి ఓటు విలువ తెలియడం లేదు. ఓటు వేయడానికి ముందు రాడవం లేదు. ముఖ్యంగా యువ ఓటర్లు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. పోలింగ్ రోజున ఓటు వేసేందుకు ప్రభుత్వం సెలవు ప్రకటిస్తే.. దాన్ని వినియోగించుకోవడం లేదు. కొందరు ఇంటికే పరిమితం అయితే, కొందరు సినిమాలకు, షికార్లకు వెళ్తున్నారు. దీంతో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు తమిళనాడు సినిమా థియేటర్ల సంఘం తనవంతు కృషిగా థియేటర్లను బంద్ చేయాలని నిర్ణయం తీసుకుంది.