Chandrayaan-3: చారిత్రక ఘట్టానికి అంతాసిద్ధం.. చంద్రయాన్-3 సాప్ట్ ల్యాండింగ్‌కు ఎదురయ్యే మూడు అతిపెద్ద సవాళ్లు ఇవే..
చంద్రయాన్-3 ప్రయోగంలో ల్యాండర్ సాప్ట్ ల్యాండింగ్ సమయంలో మూడు ప్రధాన సవాళ్లను ఎదుర్కొనే అవకాశం ఉంది. వాటిని అధిగమిస్తే ఇస్రో చరిత్ర సృష్టించడం ఖాయమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Chandrayaan-3
Chandrayaan-3 Landing: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 మరికొద్ది గంటల్లో జాబిల్లి దక్షిణ ధ్రువంలో ఉపరితలాన్ని ముద్దాడనుంది. ఈ క్షణంకోసం ప్రపంచ ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఇస్రో జయహో అంటూ దేశం నినదిస్తోంది. చంద్రయాన్-3 మిషన్‌లో భాగమైన ల్యాండర్ మాడ్యూల్ తన తుది గమ్యాన్ని నేడు ముద్దాడనుంది. బుధవారం 5.27 గంటలకు ఈ ప్రక్రియ ప్రారంభమవుతోంది. సరిగ్గా 6.04 గంటలకు జాబిల్లి ఉపరితలంపై ల్యాండర్‌ను సురక్షితంగా దించడానికి ఇస్రో శాస్త్రవేత్తలు ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే, ఈ ప్రయోగంలో ఆఖరి 17 నిమిషాలు అత్యంత కీలకం కానున్నాయి. దీనిని ‘17 మినిట్స్ ఆఫ్ టెర్రర్’ అని అభివర్ణిస్తున్నారంటే ఇదెంత ముఖ్యమో అర్థం చేసుకోవచ్చు. ఈ 17 నిమిషాల్లో ల్యాండర్ తనలోని ఇంజిన్లను తానే మండించుకుంటుంది. సరైన సమయంలో ఇంజిన్లను మండించడం, సరైనపరిమాణంలో ఇంధనాన్ని వాడుకోవడం చాలా కీలకం.
Chandrayaan-3 : చంద్రయాన్ 3 ల్యాండింగ్‌కు ముందు ఇస్రో విడుదల చేసిన చంద్రుడి తాజా చిత్రాలు
ఇప్పటి వరకు చంద్రయాన్ -3 ఇస్రో అంచనాలకు అనుగుణంగా దూసుకెళ్తోంది. అసలైన కీలక ఘట్టానికి సమయం దగ్గరపడుతుండటంతో ఇస్రో కార్యాలయంలో అంతకంతకూ ఉత్కంఠ పెరుగుతోంది. కంట్రోల్ రూమ్‌ల దగ్గర అన్ని అంశాలను శాస్త్రవేత్తలు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. విక్రమ్ ల్యాండర్ సాప్ట్ ల్యాండింగ్‌పై ఇస్రో శాస్త్రవేత్తలు ధీమాతో ఉన్నారు. అయితే, ల్యాండర్ మాడ్యూల్ సాప్ట్ ల్యాండింగ్ తప్ప మరో ఆప్షన్ లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఫెయిల్యూర్ బేస్డ్ డిజైన్‌తో చంద్రయాన్-3 రూపకల్పన చేశారు.
చంద్రయాన్-3 ప్రయోగంలో ల్యాండర్ సాప్ట్ ల్యాండింగ్ సమయంలో మూడు ప్రధాన సవాళ్లను ఎదుర్కొనే అవకాశం ఉంది. వాటిని అధిగమిస్తే ఇస్రో చరిత్ర సృష్టించడం ఖాయమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ల్యాండర్ వేగాన్ని నియంత్రించడం మొదటి సవాలు. చివరిసారి ల్యాండర్ అతివేగం కారణంగా కూలిపోయింది. రెండవ సవాలు.. ల్యాండర్ ల్యాండింగ్ సమయంలో నిటారుగా ఉండాలి. మూడో సవాలు.. ల్యాండర్‌ను ఇస్రో ఎంచుకున్న అదే స్థలంలో ల్యాండ్ చేయాలి.
చివరిసారి చంద్రయాన్-2 ఎగుడుదిగుడుగా ఉన్న ప్రదేశాన్ని ఢీకొనడంతో కూలిపోయింది. అయితే, ఈ సమస్యలు తలెత్తకుండా ఇస్రో ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇటీవల రష్యా ప్రయోగం విఫలం కావడంతో ప్రపంచం మొత్తం చంద్రయాన్-3 వైపు చూస్తోంది. ఇస్రో ల్యాండర్ విక్రమ్‌ను, దానిలోని రోవర్ ప్రజ్ఞాన్‌ను చంద్రుడిపై దింపితే భారత్ చరిత్ర సృష్టిస్తుంది. అమెరికా, రష్యా, చైనా శాస్త్రవేత్తలు రాళ్లు, మట్టి దిబ్బలు ఉన్న చంద్రుడి దక్షిణ ధ్రువంపై తమ అంతరిక్ష నౌకను దింపడంలో విఫలం అయ్యారు.