Sisir Adhikari : మమత ఓటమి ఖాయం, సువేందు తండ్రి నోట జై శ్రీరామ్ నినాదాలు

Suvendu father
Suvendu’s father : పశ్చిమ బెంగాల్ లో ఎన్నికల వేడి నెలకొంది. తిరిగి అధికారం చేజిక్కించుకోవాలన్న తపనతో మమతా బెనర్జీ ఉండగా.. పశ్చిమ బెంగాల్‌ను వశం చేసుకోవాలని కమలనాథులు తహతహలాడుతున్నారు. బీజేపీ పెద్దలు బెంగాల్ లో తిష్ట వేసి వ్యూహ రచన చేస్తున్నారు. టీఎంసీలో ఉన్న కీలక నేతలను ఆకర్షిస్తున్నారు. పలువురు ఇప్పటికే కాషాయ కండువా కప్పుకున్నారు కూడా. ఇటీవల తృణమూల్ కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరిన మాజీ మంత్రి సువేందు అధికారిపైనే అందరి చూపు నెలకొంది.
ఆయన నందిగ్రామ్ నియోజవర్గం నుంచి బరిలోకి దిగుతుండడం..ఇక్కడి నుంచే మమత బెనర్జీ కూడా రంగంలోకి దిగుతుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. మమత బెనర్జీని నందిగ్రామ్ లో ఓడిస్తానని సువేందు అధికారి ఇదివరకేు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని ఆయన తండ్రి తృణముల్ కాంగ్రెస్ ఎంపీ శిశిర్ అధికారి కూడా చెబుతున్నారు. నందిగ్రామ్ లో మమతను సువేందు ఓడించి తీరుతాడన్నారు. భారీ ఆధిక్యంతో గెలుస్తాడని…నందిగ్రామ్ లో ప్రచారం చేస్తానన్నారు. ఈయన కూడా బీజేపీ కండువా కప్పుకున్నారు.
వెస్ట్ బెంగాల్ ఎన్నికల సందర్భంగా..ఈగ్రాలో కేంద్ర మంత్రి అమిత్ షా భారీ బహిరంగసభ నిర్వహించారు. ఈ సభకు సువేందు అధికారి తండ్రి ఎంపీ శిశిర్ అధికారి హాజరు కావడం విశేషం. ఆయన అమిత్ షా సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. ‘‘అరాచకాలవాదుల చెర నుంచి బెంగాల్ ను రక్షించండి. మేమంతా మీ వెంటే ఉన్నాం. పార్టీ మీకు అండగా ఉంది. పార్టీని వీడాలన్న ఉద్దేశమే లేదని, కానీ, పార్టీ నేతలే తమను బయటకు గెంటేశారని ఆయన ఆరోపించారు.