Meghalaya Nagaland Voting: మేఘాలయ, నాగాలాండ్‌లలో పోలింగ్.. రెండు రాష్ట్రాల్లో 118 అసెంబ్లీ నియోజకవర్గాలకు ..

ఈశాన్య భారత్‌లోని మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. సోమవారం ఉదయం 7గంటల నుంచే పోలింగ్ కేంద్రాల వద్దకు ఓటర్లు బారులు తీరారు. రెండు రాష్ట్రాల్లోని పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంల ద్వారా ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

Meghalaya Nagaland Voting: మేఘాలయ, నాగాలాండ్‌లలో పోలింగ్.. రెండు రాష్ట్రాల్లో 118 అసెంబ్లీ నియోజకవర్గాలకు ..

Meghalaya Nagaland Assembly Elections

Updated On : February 27, 2023 / 7:38 AM IST

Meghalaya Nagaland Voting: ఈశాన్య భారత్‌లోని మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. సోమవారం ఉదయం 7గంటల నుంచే పోలింగ్ కేంద్రాల వద్దకు ఓటర్లు బారులు తీరారు. రెండు రాష్ట్రాల్లోని పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంల ద్వారా ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. రెండు రాష్ట్రాల్లో కలిపి మొత్తం 118 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రారంభమైంది. మేఘాలయ రాష్ట్రంలో మొత్తం 60 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. సోహియాంగ్ నియోజకవర్గంలో ఓ అభ్యర్థి మరణించడంతో ఎన్నిక వాయిదా పడింది. దీంతో సోమవారం 59 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతుంది. అదేవిధంగా నాగాలాండ్ రాష్ట్రంలోనూ 60 అసెంబ్లీ స్థానాలకుగాను అకులుటో అసెంబ్లీ నియోజకవర్గం ఏకగ్రీవం అయింది. దీంతో మిగిలిన 59 అసెంబ్లీ స్థానాలకు ఎన్నిక కొనసాగుతోంది.

Meghalaya Assembly Polls: పోలింగుకు సిద్ధమైన మేఘాలయ.. పోటీలో 369 మంది అభ్యర్థులు

మేఘాలయ రాష్ట్రంలో 59 అసెంబ్లీ నియోజక వర్గాల్లో 3,419 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. ఉదయం 7గంటలకు ప్రారంభమైన ఓటింగ్ ప్రక్రియ సాయంత్రం 4గంటల వరకు కొనసాగుతుంది. 21,75,236 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మొత్తం ఓటర్లలో 10.99 లక్షల మంది మహిళలు, 10.68 లక్షల మంది పురుషులు ఉన్నారు. వీరిలో మొదటిసారి ఓటువేసే వారి సంఖ్య 81వేలు. 59 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 369 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరిలో 36 మంది మహిళ అభ్యర్థులు ఉన్నారు. ఈ రాష్ట్రంలో 120 పోలింగ్ కేంద్రాల్లో కేవలం మహిళలు మాత్రమే పోలింగ్ ప్రక్రియను నిర్వహించనున్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద అధికారులు పటిష్ఠ భదోబస్తును ఏర్పాటు చేశారు. ఈ రాష్ట్రంలో అన్ని పార్టీలు ఒంటరిగానే పోటీ చేస్తున్నాయి. అధికార నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్‌పీపీ), ప్రతిపక్ష కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య పోటీ తీవ్రంగా కనిపిస్తోంది.

Nagaland polls: ఎన్నికల సిబ్బందితో వస్తున్న బస్సు బోల్తా.. ఒకరు మృతి, 13 మందికి గాయాలు

నాగాలాండ్ రాష్ట్రంలో 59అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ కొనసాగుతుంది. 183 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 13,17,632 ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో 6,61,489 మంది పురుషులు కాగా, 6,56,143 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. పోలింగ్ నిర్వహణకు 2,351 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ఠ బందోబస్తును ఏర్పాటు చేశారు. వోఖా జిల్లాలోని భండారీ నియోజకవర్గం పరిధి మెరపానీ పోలింగ్ కేంద్రంలో కేవలం 37 మంది ఓటర్లు మాత్రమే ఉన్నారు. ఇదిలాఉంటే నాగాలాండ్ రాష్ట్రంలో అధికార నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ (ఎన్డీపీసీ), బీజేపీ పొత్తు పెట్టుకొని ఎన్నికల బరిలో నిలిచాయి. కాంగ్రెస్, ఎన్సీపీ, ఎన్‌పీపీ, జేడీయూలు నుంచి బీజేపీ కూటమికి గట్టిపోటీ ఎదురవుతుంది.