రూ.102 కోట్లకు టోల్ గేట్ వసూళ్లు.. మార్చి1 వరకు ఫాస్టాగ్ ఉచితం

Toll gate collection for Rs 102 crore : దేశవ్యాప్తంగా ఈ నెల 16 నుంచి వాహనాలకు ఫాస్టాగ్ తప్పనిసరి చేయడంతో నాలుగు రోజుల్లో టోల్ గేట్ల వద్ద డిజిటల్ వసూళ్లు 23.3 శాతం పెరిగినట్లు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) శనివారం (ఫిబ్రవరి 20, 2021) తెలిపింది. అలాగే ఈ నెల 19న రోజువారీ టోల్ కలెక్షన్ వంద కోట్ల మార్కును దాటి రూ.102 కోట్లు వసూలైనట్లు పేర్కొంది. రోజువారీ టోల్ ట్రాన్సాక్షన్స్ సంఖ్య కూడా 63 లక్షలు దాటినట్లు వెల్లడించింది.
ఫాస్టాగ్‌ను మరింతగా ప్రొత్సహించేందుకు మార్చి1 వరకు ఉచితంగా ఇస్తున్నట్లు ఎన్‌హెచ్‌ఏఐ తెలిపింది. ఈ మేరకు ప్రచారాన్ని ప్రారంభించింది. మార్చి1 వరకు రూ.వంద రుసుంను మాఫీ చేస్తున్నట్లు పేర్కొంది. దేశ వ్యాప్తంగా ఉన్న 770కు పైగా టోల్‌ప్లాజాల వద్ద ఫాస్టాగ్‌ను ఉచితంగా పొందవచ్చని తెలిపింది.
దేశ వ్యాప్తంగా టోల్‌ప్లాజాల వద్ద డిజిటల్ విధానంలో టోల్ ట్యాక్స్ చెల్లించేందుకు వాహనాలకు ఫాస్టాగ్‌కు ఈ నెల 16 నుంచి కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఫాస్టాగ్ లేని వాహనాల నుంచి టోల్‌ప్లాజాల వద్ద రెట్టింపు టోల్ ట్యాక్స్ వసూలు చేస్తామని పేర్కొంది. ఈ నేపథ్యంలో వాహనదారులంతా ఫాస్టాగ్‌ను తప్పనిసరిగా ఏర్పాటు చేసుకుంటున్నారు.