పెళ్లి వేడుకలో విషాదం.. నలుగురు చిన్నారులుసహా 13మంది మృతి

మధ్యప్రదేశ్ రాష్ట్రం రాజ్ గఢ్ జిల్లాలో ఆదివారం రాత్రి పెళ్లిబృందం ట్రాక్టరు ట్రాలీ బోల్తాపడింది. ఈ ఘటనలో నలుగురు చిన్నారులు సహా 13మంది మృత్యువాత పడ్డారు.

పెళ్లి వేడుకలో విషాదం.. నలుగురు చిన్నారులుసహా 13మంది మృతి

Road Accident In Rajgarh

Updated On : June 3, 2024 / 8:14 AM IST

Rajgarh Road Accident : ఓ కుటుంబంలో పెళ్లి ఆనందం క్షణాల్లో విషాదంగా మారింది. మధ్యప్రదేశ్ రాష్ట్రం రాజ్ గఢ్ జిల్లాలో ఆదివారం రాత్రి పెళ్లిబృందం ట్రాక్టరు ట్రాలీ బోల్తాపడింది. ఈ ఘటనలో నలుగురు చిన్నారులు సహా 13మంది మృత్యువాత పడ్డారు. మరో 15మందికి గాయాలయ్యాయి. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని తెలిసింది. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం మధ్యప్రదేశ్ లోని రాజ్‌గఢ్‌ ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన నలుగురిని మెరుగైన చికిత్స భోపాల్ లోని జిల్లా ఆసుపత్రికి తరలించినట్లు జిల్లా కలెక్టర్ హర్ష్ దీక్షిత్ చెప్పారు.

Also Read : Train Accident : ఢీకున్న రెండు రైళ్లు.. తృటిలో తప్పిన ఘోర ప్రమాదం

మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్ జిల్లా కులంపుర గ్రామంలో ఆదివారం రాజస్థాన్ రాష్ట్రం ఝలావర్ జిల్లాలో మోతీపురా గ్రామానికి చెందిన మోతీలాల్ వివాహం జరగాల్సి ఉంది. గ్రామం నుంచి ట్రాక్టర్ ట్రాలీలో మహిళలు, చిన్నారులతోసహా మొత్తం 40 నుంచి 45 మంది పెళ్లి ఊరేగింపుగా కులంపుర గ్రామంకు బయలుదేరారు. మధ్యప్రదేశ్ సరిహద్దు ప్రాంతంలో ఉన్న పిప్లొడి ఔట్ పోస్ట్ సమీపంలో ట్రాక్టర్ ట్రాలీ బోల్తా పడటంతో దానికింద నలిగి నలుగురు చిన్నారులుసహా 13మంది మరణించారు. సమాచారం అందుకున్నపోలీసులు స్థానికుల సహాయంతో అంబులెన్సుల ద్వారా క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుల్లో నలుగురు చిన్నారులు, ఐదుగురు మహిళలు ఉన్నారు. మృతదేహాలను పోస్టుమార్టం అనంతరం రాజస్థాన్ లోని ఝలావర్ జిల్లాలోని మోతీపురా గ్రామానికి తరలించారు.

Also Read : ఓఆర్ఆర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. సెల్ఫీలు దిగుతున్న వారిపై దూసుకెళ్లిన ట్యాంకర్

రాజ్‌గఢ్ జిల్లాలో రోడ్డు ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.