నిరుద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్…ఇకపై అన్ని ఉద్యోగాలకు ఒకే పరీక్ష

  • Published By: venkaiahnaidu ,Published On : August 19, 2020 / 04:52 PM IST
నిరుద్యోగులకు కేంద్రం  గుడ్ న్యూస్…ఇకపై అన్ని ఉద్యోగాలకు ఒకే పరీక్ష

Updated On : August 19, 2020 / 5:11 PM IST

నిరుద్యోగులకు మోడీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. నేషనల్ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీపై కేంద్ర ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్ ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రసంగంలో ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు జాతీయ స్థాయిలో నేషనల్ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ (NRA) ఏర్పాటుకు ఇవాళ(ఆగస్టు-19,2020)సమావేశమైన కేంద్రకేబినెట్ ఆమోద ముద్రవేసింది.



NRA ఏర్పాటుతో నిరుద్యోగులకు ఎంతో లబ్ధి చేకూరుతుంది. దీని ద్వారా కేంద్ర ప్రభుత్వ పరిధిలోని నాన్ గెజిటెడ్ ఉద్యోగాలు, ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఉద్యోగాల భర్తీకి ఒకే ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. తద్వారా ఇటు ప్రభుత్వం, అటు అభ్యర్థులు ఖర్చు తగ్గుతుంది. సమయం కూడా కలిసి వస్తుంది. ఈ నేపథ్యంలో కేంద్రం నిర్ణయంపై నిరుద్యోగ యువత హర్షం వ్యక్తం చేస్తోంది.



ప్రతి ఏటా సుమారు 1.25 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదలవుతున్నాయి. సుమారు 2.5 కోట్ల మంది అభ్యర్థులు ఈ పరీక్షలు రాస్తున్నారు. అయితే వేర్వేరు శాఖలకు సంబంధించిన ఉద్యోగాలకు వేర్వేరు పరీక్షలను నిర్వహిస్తున్నారు. రైల్వే, ONGC, NTPC, బ్యాంకులు పలు ఉద్యోగాలకు ఆయా శాఖలే పరీక్షలు నిర్వహిస్తున్నాయి.



కాగా, ఇకపై వీటన్నింటింటికీ ఒకే పరీక్ష (CET) నిర్వహిస్తారు. ఆ పరీక్షలో సాధించిన స్కోరుకు మూడేళ్ల పాటు వ్యాలిడిటీ ఉంటుంది. ఆ స్కోర్ ఆధారంగానే ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. మళ్లీ మళ్లీ పరీక్షలు రాయాల్సిన అవసరం ఉండదు.