CAAలో ఆ నిబంధన లేదు…విద్యార్థులకు షా విజ్ణప్తి

పౌరసత్వ సవరణ చట్టాన్ని అర్థం చేసుకోవాలని విద్యార్థులకు అమిత్ షా విజ్ణప్తి చేశారు. ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన చేపట్టిన విద్యార్థులకు హింసాత్మక నిరసనలు వీడాలని హోంమంత్రి విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న జార్ఖండ్ లోని పోరెయహత్ లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో అమిత్ షా మాట్లాడుతూ… దేశంలోని ఏ ఒక్కరి నుంచీ పౌరసత్వం లాగేసుకునే ఎలాంటి నిబంధన ఈ చట్టంలో లేదని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం సాగించే తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని విద్యార్థులను ఆయన హెచ్చరించారు.
వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఢిల్లీలో ఆప్, కాంగ్రెస్ పార్టీలు బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ ఈ తరహా ప్రచారాన్ని చేపడుతున్నాయని అమిత్ షా ఆరోపించారు. మరోవైపు ప్రధాని నరేంద్ర మోడీ సైతం పౌరసత్వ సవరణ చట్టంపై హింసాత్మక నిరసనలు దురదృష్టకరమని కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు దీనిపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు.
పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా అనేక యూనివర్శిటీల్లో విద్యార్థులు ఆందోళనలకు దిగిన విషయం తెలిసిందే. ఢిల్లీలోని జామియా మిలియా వర్సిటీలో ఆదివారం ఆందోళనకారులు పలు బస్సులను తగలబెట్టడంతో హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. మంటలను ఆర్పేందుకు వస్తున్న అగ్నిమాపక వాహనాలను కూడా విద్యార్థులు ధ్వంసం చేశారు. పోలీసుల లాఠీ చార్జిలో పలువురు విద్యార్థులు, ఆందోళనకారులకు తీవ్ర గాయాలయ్యాయి.