బడ్జెట్ పై జైట్లీ స్పందన : 2022 నాటికి ప్రతి ఒక్కరికీ ఇల్లు

ఢిల్లీ : కేంద్ర బడ్జెట్ పై కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ స్పందించారు. పదేళ్ల పాలనలో యూపీఏ ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నించారు. రైతులకు రూ.70 వేల కోట్లు రుణమాఫీ చేస్తామన్నారు.. కానీ రూ.52 వేల కోట్లు మాత్రమే రుణమాఫీ చేశారని పేర్కొన్నారు. రుణమాఫీ మొత్తంలో ఎక్కువగా వ్యాపారులకే దక్కినట్లు కాగ్ చెప్పిందన్నారు.
ఎన్డీఏ పాలనలో గ్రామీణ ప్రాంతాల్లో 91 శాతం రోడ్లు పూర్తి చేశామని తెలిపారు. 2022 నాటికి గ్రామాల్లో ప్రతి ఒక్కరికీ ఇల్లు ఇవ్వడమే లక్ష్యమన్నారు. గ్రామాల్లో 98.7 శాతం ప్రజలకు మరుగుదొడ్లు నిర్మించి ఇస్తామన్నారు. ’రైతుల విషయంలో కాంగ్రెస్ ది మొసలి కన్నీరు’ అని విమర్శించారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కిసాన్ సమ్మాన్ నిధి పథకం అమలు చేయాలన్నారు. రైతులకు ఆర్థికసాయంపై కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పని చేయాలని సూచించారు. కిసాన్ సమ్మాన్ నిధితో రైతులకు తొలి ఏడాదే రూ.75 వేల కోట్ల లబ్ధి చేకూరిందని తెలిపారు. భవిష్యత్ లో ఈ మొత్తం మరింత పెరుగనుందన్నారు. ఓటర్లకు గాలం వేసేలా బడ్జెట్ ఉందన్న విపక్షాల విమర్శలు సరికావు అని అన్నారు.