రాష్ట్రపతి భవన్ లో విందు… ట్రంప్ తో కేసీఆర్ ముచ్చట్లు

  • Published By: venkaiahnaidu ,Published On : February 25, 2020 / 03:09 PM IST
రాష్ట్రపతి భవన్ లో విందు… ట్రంప్ తో కేసీఆర్ ముచ్చట్లు

Updated On : February 25, 2020 / 3:09 PM IST

తొలిసారిగా భారత పర్యటనకు విచ్చేసిన అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌నకు భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఇవాళ(ఫిబ్రవరి-25,2020)రాత్రి ఘనమైన విందు ఏర్పాటు చేశారు. కోవింద్ విందులో పాల్గొనేందుకు సతీమణితో కలిసి రాష్ట్రపతి భవన్ కు చేరుకున్నారు ట్రంప్. ట్రంప్ దంపతులకు రాష్ట్రపతి దంపతులు ఘనస్వాగతం పలికారు. ట్రంప్ రాక సందర్భంగా రాష్ట్రపతి భవన్ ను మరింత అందంగా ముస్తాబుచేశారు. రాష్ట్రపతి భవన్ ప్రత్యేకతలను ట్రంప్ దంపతులకు కోవింద్ వివరించారు.

 ట్రంప్‌కు స్వాగతం పలికిన తర్వాత.. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆయనను లోపలికి తీసుకువెళ్లారు. అనంతరం రాష్ట్రపతి భవన్‌లోని నార్త్‌ డ్రాయింగ్‌ రూం వద్ద ఇరువురు కాసేపు భేటీ అయ్యారు. అనంతరం విందులో పాల్గొనేందుకు రాష్ట్రపతి భవన్ కు విచ్చేసిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, పలు రాష్ట్రాల సీఎంలు,కేంద్రమంత్రులు,ప్రముఖులను ట్రంప్ కు పరిచయం చేశారు రామ్ నాథ్ కోవింద్. తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ఈ విందులో పాల్గొన్నారు. ట్రంప్ మొదట నమస్కారం పెట్టారు కేసీఆర్. ఆ తర్వాత షేక్ హ్యాండ్ ఇచ్చారు. ట్రంప్ తో కొంతసేపు ముచ్చటించారు కేసీఆర్. గతేడాది హైదరాబాద్ లో జరిగిన ఓ సదస్సుకు ట్రంప్ కూతురు ఇవాంక హాజరైన విషయం తెలిసిందే. ఇవాంక హైదరాబాద్ పర్యటనను కేసీఆర్ ట్రంప్ కు గుర్తుచేసినట్లు తెలుస్తోంది.

ట్రంప్‌ తనయ, సలహాదారు ఇవాంకా ట్రంప్‌ తదితరులు పాల్గొననున్నారు. ప్రధాని మోడీ కూడా ఈ విందులో పాల్గొన్నారు. ఈ క్రమంలో ట్రంప్‌ అభిరుచికి తగ్గట్టుగా ఘుమఘుమలాడే వంటకాలు తయారుచేసినట్లు రాష్ట్రపతి భవన్‌ వర్గాల సమాచారం. కాగా ఆరెంజ్‌తో తయారు చేసిన అమ్యూజ్‌ బౌజ్‌ సర్వ్‌ చేసిన తర్వాత.. సాలమన్‌ ఫిష్‌ టిక్కాతో ఈ గ్రాండ్‌ డిన్నర్‌ ప్రారంభం అయింది.

వెజిటేరియన్‌ ఫుడ్‌లో భాగంగా… రకారకాల సూపులు ఆలూ టిక్కీ, స్పినాచ్‌ చాట్‌ తదితర వంటకాలను ట్రంప్‌ కుటుంబానికి వడ్డిస్తున్నారు. అదే విధంగా రాష్ట్రపతి భవన్‌ ప్రఖ్యాత వంటకం దాల్‌ రైసీనాతో పాటు.. మటన్‌ బిర్యానీ, మటన్‌ ర్యాన్‌, గుచ్చీ మటార్‌(మష్రూమ్‌ డిష్‌) కూడా అమెరికా అధ్యక్షుడి మోనూలో చేర్చారు. డిన్నర్‌ అనంతరం డిజర్ట్‌లో భాగంగా… హాజల్‌నట్‌ ఆపిల్‌తో పాటుగా వెనీలా ఐస్‌క్రీం, మాల్పువా విత్‌ రాబ్డీలను ట్రంప్‌ ఆరగించనున్నారు.  డిన్నర్‌ అనంతరం ఎయిర్‌ఫోర్స్‌ వన్‌లో ట్రంప్‌ అమెరికాకు తిరిగి వెళ్లనున్నారు