పొరపాటున బీజేపీకి ఓటేసినందుకు వేలు నరుక్కున్నాడు

రెండవ దశ సార్వత్రిక ఎన్నికలు దేశవ్యాప్తంగా ప్రశాంతంగా ముగిశాయి. అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు మినహాయిస్తే ప్రతీ చోట కూడా ఓటర్లు లైన్లలో నుంచుని ఓపికగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇదిలా ఉంటే దేశప్రధానిని డిసైడ్ చేసే రాష్ట్రంగా చెప్పే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ ఓటర్ చేసినపని ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఎస్పీ, బీఎస్పీ, ఆర్ఎల్‌డీలు కలిసి కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో పోటీ చేస్తుండగా.. బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుంది. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్ కు చెందిన పవన్ కుమార్(25) అనే దళిత ఓటరు పోలింగ్ బూత్‌లో పొరపాటున బీఎస్పీకి ఓటు వేయబోయి బీజేపీకి ఓటు వేశాడు. దీంతో తాను వేయదలుచుకున్న అభ్యర్థికి కాకుండా పొరపాటున వేరొక అభ్యర్థికి ఓటువేయడాన్ని జీర్ణించుకోలేకపోయిన పవన్ కుమార్.. చేసిన తప్పుకు పశ్చాతాపంగా తనవేలును తానే నరుకేసుకున్నాడు.
పవన్ కుమార్ ఉత్తరప్రదేశ్ లోని బులంద్‌షర్ నియోజకవర్గంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అక్కడ సిట్టింగ్ ఎంపీ బీజేపీ అభ్యర్ధి బోలా సింగ్‌కు కూటమి బలపరిచిన అభ్యర్ధి యోగేష్ వర్మకు మధ్య పోటీ జరుగుతుంది. అయితే వర్మకు ఓటు వెయ్యాలని భావించిన పవన్ కుమార్.. బోలాసింగ్‌కు వేయడంతో వేలును నరుక్కున్నాడు. ఈ ఘటన తర్వాత పవన్ కుమార్ ఒక వీడియో విడుదల చేశాడు. అది ట్విట్టర్‌లో వైరల్ అవుతుంది. ఉత్తరప్రదేశ్‌లో మొత్తం 8స్థానాలలో రెండవ దశలో ఎన్నికలు జరిగాయి.