WB Assembly polls : అందరి చూపు అటే..నందిగ్రామ్ ఎన్నికల పోలింగ్
దేశంలోని ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నా.. ప్రజలందరి ఆసక్తి మాత్రం ఆ నియోజకవర్గంపైనే పడింది.

West Bengal Assembly polls
Nandigram : దేశంలోని ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నా.. ప్రజలందరి ఆసక్తి మాత్రం ఆ నియోజకవర్గంపైనే పడింది. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పోటీ చేస్తున్న నందిగ్రామ్‌లో.. 2021, ఏప్రిల్ 01వ తేదీ గురువారం పోలింగ్ జరగనుంది. దానికోసం సర్వం సిద్ధం చేసింది ఎలక్షన్ కమిషన్. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 22 కంపెనీల కేంద్ర బలగాలను రంగంలోకి దించింది.
పశ్చిమ బెంగాల్‌లో రెండో దశ ఎన్నికల ప్రచారం ముగిసింది. చివరి రోజున నందిగ్రామ్‌లో తృణమూల్, బీజేపీ రోడ్‌షోలతో హోరెత్తించాయి. మమతా బెనర్జీ వీల్ చైర్‌లో రోడ్‌షో నిర్వహించారు. బీజేపీ అభ్యర్థి సువేందు అధికారికి మద్దతుగా హోంమంత్రి అమిత్ షా నందిగ్రామ్‌లో జరిగిన భారీ రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ, తృణమూల్ కార్యకర్తల మధ్య చిన్నపాటి ఘర్షణ చోటు చేసుకుంది. అమిత్ షా రోడ్ షోలో పాల్గొనే వేదికను దాటుకుంటూ మమత ముందుకెళ్లారు. ఆ సమయంలో అక్కడున్న కొందరు జై శ్రీరామ్ నినాదాలు చేస్తూ, ఆమె రోడ్ షోను వెంబడించడంతో ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసుల జోక్యంతో పరిస్థితి సద్దుమణిగింది.
నందిగ్రామ్ నుంచి బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి భారీ మెజారిటీతో గెలవబోతున్నారని అమిత్ షా జోస్యం చెప్పారు. రోడ్ షోకు లభించిన ప్రజా స్పందనే ఇందుకు నిదర్శమన్నారు. మరోవైపు మమత బీజేపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీ తమ సొంత పార్టీ మహిళా కార్యకర్తలను హతమార్చే ప్లాన్ చేసిందని…ఇందుకోసం యూపీ, బీహార్ నుంచి రౌడీలను తీసుకొచ్చారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీజేపీని నందిగ్రామ్ నుంచి కాకుండా బెంగాల్ నుంచే తరిమికొట్టాలని మమత ప్రజలకు పిలుపునిచ్చారు.