Anushka Yadav: లాలూ కుటుంబంలో తేజ్ ప్రతాప్ మిస్టరీ ‘గర్ల్‌ఫ్రెండ్’ చిచ్చు..! ఎవరీ అనుష్క యాదవ్..
దీనిపై రచ్చ రచ్చ జరగడంతో లాలూ ప్రసాద్ యాదవ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కొన్న కొడుకునే పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.

Anushka Yadav: ఓ ఫేస్ బుక్ పోస్ట్ కారణంగా లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబంలో కలకలం రేగిన సంగతి తెలిసిందే. తన కొన్న కొడుకునే పార్టీ నుంచి సస్పెండ్ చేసేశారు లాలూ ప్రసాద్ యాదవ్. తన పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ ను ఆర్జేడీ నుంచి ఆరేళ్ల పాటు బహిష్కరించారు. అంతేకాదు కుటుంబం నుంచి బహిష్కరించినట్లు లాలూ ప్రకటించారు. దీనంతటికి కారణం ఒక అమ్మాయి వ్యవహారమే అని తెలుస్తోంది.
తాను ఒక అమ్మాయితో 12ఏళ్లుగా రిలేషన్ షిప్ లో ఉన్నానంటూ తేజ్ ప్రతాప్ యాదవ్ తన ఫేస్ బుక్ లో ఒక పోస్ట్ పెట్టారు. ఆ అమ్మాయితో కలిసున్న పిక్ కూడా పెట్టారాయన. అంతే.. ఒక్కసారిగా రాజకీయంగా పెను దుమారం రేగింది. క్షణాల్లో ఊహించని పరిణామాలు జరిగిపోయాయి. తేజ్ ప్రతాప్ యాదవ్ తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్ ఫుల్ సీరియస్ అయ్యారు. కొడుకు అని కూడా చూడకుండా ఏకంగా పార్టీ నుంచి కుటుంబ నుంచి బహిష్కరించేశారు.
దీంతో ఇప్పుడు అందరి చూపు ఆ అమ్మాయిపై పడింది. అందరూ ఆమె గురించే చర్చించుకుంటున్నారు. అసలు ఎవరీ అనుష్క యాదవ్ అని ఆమె గురించి ఆరా తీస్తున్నారు.
అనుష్క యాదవ్ చాలావరకు ప్రైవేట్ వ్యక్తిగానే ఉన్నారు. ఆమె గురించి చాలా పరిమిత సమాచారం మాత్రమే ప్రజలకు అందుబాటులో ఉంది. తేజ్ ప్రతాప్ ఇటీవల ఆమె పేరు వెల్లడించే వరకు కూడా.. ఆమె పేరు మీడియా నివేదికలలో లేదా రాజకీయ చర్చలలో చాలా అరుదుగా కనిపించింది. అనుష్క యాదవ్ బీహార్ కు చెందిన వ్యక్తిగా భావిస్తున్నారు. ఇద్దరూ పదేళ్ల క్రితం కలుసుకున్నట్లు తెలుస్తోంది.
Also Read: లాలూ కుటుంబంలో సోషల్ మీడియా పోస్ట్ వివాదం.. కన్న కొడుకునే పార్టీ నుంచి బహిష్కరించిన తండ్రి..
అనుష్క యాదవ్ విద్యా నేపథ్యం లేదా వృత్తిపరమైన కార్యకలాపాల గురించి చాలా తక్కువ సమాచారం అందుబాటులో ఉంది. తేజ్ ప్రతాప్ తన ఫేస్‌బుక్ పోస్ట్‌లో ఆమెను తన జీవితంలో కీలకమైన వ్యక్తిగా పేర్కొన్నాడు. అనుష్క యాదవ్.. తేజ్ ప్రతాప్ క్లోజ్ ఫ్రెండ్ కు సోదరి అని తెలుస్తోంది. తేజ్ ఫ్రెండ్ ఆర్జేడీ నుంచి వైదొలిగి మరో రాజకీయ పార్టీలో చేరినట్లు సమాచారం.
నిజానికి.. తేజ్ ప్రతాప్ యాదవ్ బీహార్ మాజీ ముఖ్యమంత్రి దరోగా రాయ్ మనవరాలు ఐశ్వర్య రాయ్‌ను వివాహం చేసుకున్నారు. 2018లో ఈ జంట వివాహం చాలా హై ప్రొఫైల్‌గా జరిగింది. అయితే, వారి బంధం ఎక్కువ రోజులు కొనసాగలేదు. తేజ్ ప్రతాప్, తని కుటుంబం సరిగా వ్యవహరించలేదని ఆరోపిస్తూ ఐశ్వర్య ఆ ఇంటి నుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత జరిగిన చట్టపరమైన పోరాటాలు జరిగాయి. ఇద్దరి మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలు నడిచాయి. వారి విడాకుల కేసు ఇప్పటికీ పాట్నా ఫ్యామిలీ కోర్టులో పెండింగ్‌లో ఉంది.
తేజ్ ప్రతాప్ ఫేస్ బుక్ పోస్టులో అసలేముంది?
“నేను తేజ్ ప్రతాప్ యాదవ్. ఈ ఫోటోలో నాతో ఉన్న వ్యక్తి అనుష్క యాదవ్. మేము 12 సంవత్సరాలుగా ఒకరికొకరు తెలుసు. ఒకరినొకరు ప్రేమించుకుంటున్నాము. మేము ఇన్ని సంవత్సరాలుగా రిలేషన్ షిప్ లో ఉన్నాము. చాలా కాలంగా మీ అందరితో దీన్ని పంచుకోవాలనుకున్నాను. కానీ దానిని ఎలా వ్యక్తపరచాలో నాకు తెలియలేదు. ఈరోజు, ఈ పోస్ట్ ద్వారా, నేను మీ అందరికీ నా హృదయాన్ని విప్పుతున్నాను. మీరు నన్ను అర్థం చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను” అని ఆ పోస్టులో ఉంది. ఇది తేజ్ ప్రతాప్ యాదవ్ వెరిఫైడ్ ఫేస్ బుక్ ఖాతాలో కనిపించింది.
ఈ పోస్టు బాగా వైరల్ అయ్యింది. రాజకీయవర్గాలతో పాటు జనాల్లో చర్చకు దారితీసింది. తేజ్ పై తీవ్ర విమర్శలు వచ్చాయి. రిలేషన్ షిప్ ల్ ఉన్నా.. ఐశ్వర్యను ఎందుకు పెళ్లి చేసుకున్నావు అని తేజ్ ను నిలదీస్తున్నారు. దీనిపై రచ్చ రచ్చ జరగడంతో తేజ్ ప్రతాప్ యాదవ్ స్పందించాల్సి వచ్చింది. తన ఫేస్ బుక్ ఖాతాను ఎవరో హ్యాక్ చేశారని, ఎడిట్ చేసిన ఫోటోలను అందులో పెట్టారని, తన కుటుంబ గౌరవాన్ని దెబ్బతీసేందుకు ఎవరో కావాలనే ఇదంతా చేశారని ఆయన ఆరోపించారు. ఇలాంటి పుకార్లను నమ్మొద్దని కోరారు. దీనిపై రచ్చ రచ్చ జరగడంతో లాలూ ప్రసాద్ యాదవ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కొన్న కొడుకునే పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. తనకు కుటుంబం కంటే పార్టీయే ముఖ్యమని స్పష్టం చేశారు.