ఈడీ విచారణకు అరవింద్ కేజ్రీవాల్ ఎందుకు వెళ్లడం లేదు?

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు వరుసగా నోటీసులు జారీ చేస్తూనే ఉంది ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్.

ఈడీ విచారణకు అరవింద్ కేజ్రీవాల్ ఎందుకు వెళ్లడం లేదు?

Why Arvind Kejriwal skips ED summons

Updated On : February 27, 2024 / 12:15 PM IST

Arvind Kejriwal: లిక్కర్ పాలసీ కేసులో ఈడీ విచారణకు మరోసారి గైర్హాజరయ్యారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. ఇప్పటికే 6 సార్లు జారీ చేసిన నోటీసులను లెక్క చేయని ఆయన.. ఏడోసారి కూడా వాటిని బేఖాతరు చేశారు. అయితే.. విచారణ అంశం కోర్టులో పెండింగ్‌లో ఉండగానే మళ్లీ మళ్లీ సమన్లు పంపడం వేధింపులకు పాల్పడటమేనన్నారు కేజ్రీవాల్. మరోవైపు.. 2018 పరువు నష్టం కేసులో ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది సుప్రీంకోర్టు.

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు వరుసగా నోటీసులు జారీ చేస్తూనే ఉంది ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్. ఇటీవల ఏడోసారి నోటీసులు జారీ చేసిన ఈడీ.. సోమవారం విచారణకు హాజరు కావాలని సూచించింది. కానీ.. ఈసారి కూడా ఎంక్వైరీకి రెడీగా లేనని తేల్చిచెప్పారు కేజ్రీవాల్. మళ్లీమళ్లీ సమన్లు పంపించే బదులు.. కోర్టు తీర్పు వచ్చే వరకు వేచి ఉంటే బాగుంటుందని ఈడీకి హితవు పలికారాయన. తాము ఇండియా కూటమిని వదిలిపెట్టాలన్న ఉద్దేశంతోనే ఇవన్నీ జరుగుతున్నాయని ఆరోపించారు కేజ్రీవాల్.

ఈ కేసులో సీఎం కేజ్రీవాల్‌ను ఇప్పటికే ఒకసారి విచారించింది ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్. గతేడాది ఏప్రిల్‌లో దాదాపు 9 గంటల పాటు ఆయన్ను విచారించారు అధికారులు. ఆ తర్వాత నవంబర్ నుంచి నాలుగు నెలల్లోనే ఏడుసార్లు నోటీసులు పంపించింది ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్. గతేడాది నవంబర్ 2, డిసెంబర్ 21, ఆ తర్వాత జనవరి 3, జనవరి 13, జనవరి 31న వరుసగా ఐదు సార్లు సమన్లు జారీ చేసింది. ప్రతిసారీ ఈడీ నోటీసుల్ని కేజ్రీవాల్ పట్టించుకోలేదు.

Also Read: గాంధీ-నెహ్రూ కుటుంబ వారసులు యూపీలో గెలిచే పరిస్థితులు ఉన్నాయా?

కేజ్రీవాల్ విచారణకు హాజరుకాకపోవడంతో గత ఫిబ్రవరిలో ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించింది ఈడీ. ఆయన విచారణకు హాజరయ్యేందుకు ఆదేశించాలని పిటిషన్ దాఖలు చేసింది. అయితే.. ఢిల్లీ అసెంబ్లీలో బల పరీక్ష నేపథ్యంలో కేజ్రీవాల్ కోర్టుకు వర్చువల్‌గా కోర్టుకు హాజరయ్యారు. ఆ తర్వాత కేసు విచారణను మార్చి 16కు వాయిదా వేసింది న్యాయస్థానం. ఈ క్రమంలోనే మరో రెండుసార్లు కూడా కేజ్రీవాల్‌కు నోటీసులు జారీ చేసింది ఈడీ. ఫిబ్రవరి 22న ఏడోసారి సమన్లు పంపిన ఈడీ.. 26న ప్రత్యక్షంగా విచారణకు హాజరుకావాలని పేర్కొంది.

పరువు నష్టం కేసులో కేజ్రీవాల్‌కు ఊరట
మరోవైపు.. 2018 పరువు నష్టం కేసులో అరవింద్ కేజ్రీవాల్‌కు ఊరట లభించింది. యూట్యూబర్ ధ్రువ్ రాథీ వీడియోను రీట్వీట్ చేసిన కేసులో ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ట్రయల్ కోర్టును ఆదేశించింది సుప్రీంకోర్టు. అయితే.. పరువుకు భంగం కలిగించేలా ఉన్న వీడియోను రీట్వీట్ చేయడం పొరపాటేనని.. ఆ కేసును మూసివేయాలని న్యాయస్థానాన్ని కోరారు కేజ్రీవాల్. అయితే.. ఈ కేసు దాఖలు చేసిన పిటిషనర్.. కేజ్రీవాల్ అభ్యర్థనకు అంగీకరించడంతో సమస్య సద్దుమణిగింది. దీంతో ఢిల్లీ సీఎంపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించిన సుప్రీంకోర్టు.. తదుపరి విచారణను మార్చి 11కు వాయిదా వేసింది.