Year Roundup 2025: పాకిస్తాన్‌కు బుద్ధి చెప్పిన భారత్.. మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బ.. 2025లో కీలక ఘట్టాలు..

ఉగ్రవాద శిబిరాలను భారత్ నేలమట్టం చేసింది. 100 మందికిపైగా టెర్రరిస్టులను మట్టుబెట్టింది.

Year Roundup 2025: పాకిస్తాన్‌కు బుద్ధి చెప్పిన భారత్.. మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బ.. 2025లో కీలక ఘట్టాలు..

Updated On : December 12, 2025 / 6:57 PM IST

Year Roundup 2025: కొన్ని రోజుల్లో 2025 సంవత్సరానికి వీడ్కోలు పలకబోతున్నాం. ఎన్నో ఆశలు, ఆశయాలతో కొత్త ఏడాదికి స్వాగతం పలకబోతున్నాం. 2025 సంవత్సరానికి గుడ్ బై చెప్పే క్రమంలో.. ఈ ఏడాదిలో జరిగిన కీలకమైన ఘట్టాలను ఒకసారి మననం చేసుకుందాం. 2025 సంవత్సరాన్ని భారతీయులు ఎన్నటికీ మర్చిపోలేరు. ఎందుకంటే.. ఇండియా-పాకిస్తాన్ యుద్ధం జరిగింది ఈ ఏడాదిలోనే. పాకిస్తాన్ కు భారత్ గట్టిగా బుద్ధి చెప్పింది ఈ సంవత్సరంలోనే. మరోసారి మన జోలికి రావాలంటే పాక్ ను భయపడేలా చేసింది భారత్.

పహల్గాం ఉగ్రదాడితో దేశమంతా ఉలిక్కిపడింది. ఏప్రిల్‌ 22న పర్యాటకులపై ముష్కర మూకలు జరిపిన పాశవిక దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. జమ్మూకశ్మీర్ లోని పహల్గామ్ లోని బైసరన్ లోయలో పాక్ టెర్రరిస్టులు దాడికి పాల్పడ్డారు. పర్యాటకులను లక్ష్యంగా చేసి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఉగ్రదాడిలో అమాయకులు మరణించారు.

ఈ ఘటనతో భారత్‌, పాక్‌ మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. పాకిస్తాన్ తో దౌత్య సంబంధాలకు సంబంధించి భారత్‌ కఠిన నిర్ణయాలు తీసుకుంది. సింధూ జలాల ఒప్పందం అమలును నిలిపివేయడంతో పాటు పాక్‌ పౌరులు తక్షణమే భారత్‌ విడిచి వెళ్లాలని ఆదేశించింది.

పహల్గామ్ దాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. మే 7న ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్తాన్‌‌పై మెరుపు దాడి చేసింది. క్షిపణి దాడులు చేసింది. బాంబుల వర్షం కురిపించింది. పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలను ఈ ఆపరేషన్ లక్ష్యంగా చేసుకుంది. ఉగ్రవాద శిబిరాలను భారత్ నేలమట్టం చేసింది. 100 మందికిపైగా టెర్రరిస్టులను మట్టుబెట్టింది. ఏప్రిల్ 22న పహల్గాంలో జరిగిన దాడికి ప్రతీకారంగా భారత్ మే 6,7 తేదీల్లో ఆపరేషన్ సిందూర్ పేరిట దాడులు చేసి పాక్ పాలక వర్గానికి, అక్కడి ఉగ్రమూకలకు వెన్నులో వణుకు పుట్టించింది. మరోసారి భారత్ జోలికి రావాలంటే భయపడేలా చేసింది.

ఆపరేషన్ సిందూర్ తో పాక్ కు దిమ్మతిరిగిపోయింది. ప్రతీకారంతో రగిలిపోయింది. సరిహద్దుల్లో భారత్ భూభాగాలపై దొంగ దాడులకు తెగబడింది. భారత్ కూడా ధీటుగా బదులిచ్చింది. ఇది రెండు దేశాల మధ్య యుద్ధానికి దారితీసింది. అయితే, భారత్ దాడులను తీవ్రతరం చేయడంతో పాకిస్తాన్ వణికిపోయింది. కొన్ని రోజులకే కాళ్ల బేరానికి వచ్చింది. ప్లీజ్ దాడులు ఆపండి అంటూ.. కాల్పుల విరమణ ఒప్పందం ప్రకటించింది.

ఇక 2025 సంవత్సరంలో మావోయిస్టులకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. కీలకమైన, ముఖ్యమైన మావోయిస్టు నాయకులు ఎన్ కౌంటర్ లో మరణించారు. పెద్ద సంఖ్యలో లొంగిపోయారు. 2026 కల్లా దేశంలో మావోయిస్టు పార్టీని లేకుండా చేస్తామని ప్రకటించిన కేంద్రం అన్నంత పని చేసింది. మావోయిస్టుల గుప్పెట్లోని ప్రాంతాలన్నింటిని ఒక్కొక్కటిగా బలగాలు చేజిక్కించుకున్నాయి.

మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బ..

వచ్చే ఏడాది మార్చికల్లా మావోయిజాన్ని నిర్మూలించాలని సంకల్పించిన కేంద్రం.. ఇందులో భాగంగా చేపట్టిన ‘ఆపరేషన్‌ కగార్‌’తో మావోయిస్టు పార్టీకి భారీ నష్టమే జరిగింది. గత ఏడాది మొత్తం 357 మంది మావోయిస్టులు చనిపోయారు. మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్‌ బస్వరాజ్‌ మే 20న ఛత్తీస్ ఘఢ్‌ అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతిచెందారు.

గత రెండేళ్లలో 800 మావోయిస్టులు సరెండర్ అయ్యారు. ఈ ఏడాది 300 మందికిపైగా లొంగిపోయారు. ఇలా లొంగుబాట్లు, ఎన్ కౌంటర్లతో అబూజ్ మడ్ లో మావోయిస్టులు మనుగడ కోసం పోరాడే పరిస్థితి నెలకొంది. ఇటీవల మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు కీలక నేత, కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా మృతి చెందారు. ఇలా మావోయిస్టు పార్టీకి 2025లో కోలుకోలేని దెబ్బ తగిలింది.

Also Read: ఘోర బస్సు, అగ్ని ప్రమాదాలు.. పెను విషాదం నింపిన 2025…