Kumbh Mela: కుంభమేళాలో పడవలు నడిపే వ్యక్తి కుటుంబం రూ.30కోట్లు సంపాదించింది.. ఎలానో చెప్పిన సీఎం యోగి ఆదిత్యనాథ్
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనం మహా కుంభమేళా దిగ్విజయంగా పూర్తయింది.

Yogi Adityanath
Maha Kumbh Mela: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనం మహా కుంభమేళా దిగ్విజయంగా పూర్తయింది. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26వ తేదీ వరకు అంటే.. 45రోజులు పాటు ప్రయాగ్ రాజ్ ప్రాంతం భక్తిపారవశ్యంలో మునిగిపోయింది. దేశంలోని నలుమూలల నుంచేకాక.. విదేశాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు కుంభమేళాలో పాల్గొని పుణ్యస్నానాలు ఆచరించారు. తాజాగా.. కుంభమేళా విజయవంతంపై యూపీ ముఖ్యమంత్రి యోగి ఆధిత్యనాథ్ అసెంబ్లీలో మాట్లాడారు. మహాకుంభమేళా నిర్వహణ కోసం రూ.7,500 కోట్లు పెట్టుబడులు పెడితే.. దాదాపు రూ.3లక్షల కోట్ల వ్యాపారం జరిగిందని తెలిపారు. ఈ క్రమంలో ఓ ఆశ్చర్యకరమైన విషయాన్ని ఆధిత్యనాథ్ వెల్లడించారు.
Also Read: Maha Kumbh Mela 2025 : వ్యాపారం @ రూ.3లక్షల కోట్లు..! కుంభమేళాలో రికార్డులు బద్దలు..
మహా కుంభమేళాలో ఎలాంటి అవాంతరాలు లేకుండా విజయవంతంగా నిర్వహించామని, 45 రోజుల్లో ఒక్క నేరం కూడా చోటుచేసుకోలేదని, దేశవిదేశాల నుంచి కోట్లాది మంది భక్తులు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేశారని యోగి ఆధిత్యనాథ్ తెలిపారు. మహా కుంభమేళా ద్వారా దశాబ్దాలుగా నగరానికి ప్రయోజనం చేకూర్చే మౌలిక సదుపాయాలను కల్పించామని, 200కిపైగా రోడ్లను వెడల్పు చేయడంతోపాటు 14 ప్లైఓవర్లు, తొమ్మిది అండర్ పాస్ లు, 12 కారిడార్లు నిర్మించడం జరిగిందని చెప్పారు.
మహాకుంభమేళా సందర్భంగా అనేక వర్గాల వారికి ఆదాయం సమకూరిందని, ఒక పడవ నడిపేవారి కుటుంబం రూ.30కోట్ల లాభం ఆర్జించిందని ఆశ్చర్యకరమైన విషయాన్ని అసెంబ్లీ వేదికగా యోగి ఆదిత్యనాథ్ వెల్లడించారు. ‘‘నేను ఒక పడవ నడిపే కుటుంబం విజయగాథను చెబుతున్నాను. వారికి 130 పడవలు ఉన్నాయి. 45రోజుల్లో వారు రూ.30 కోట్లు లాభపడ్డారు. అంటే ఒక్కో పడవకు రూ.23లక్షలు సంపాదించారు. రోజుకు ఒక్కో పడవ ద్వారా వారు రూ. 50వేలు నుంచి రూ.52వేల వరకు వారు సంపాదించారు’. అంటూ వివరించారు.
45రోజులు సాగిన మహాకుంభ మేళాలో హోటల్ పరిశ్రమకు రూ.40వేల కోట్లు, ఆహారం, ఇతర నిత్యావసరాల రంగానికి రూ.33వేల కోట్లు, రవాణా రంగానికి రూ.1.5లక్షల కోట్ల మేర ఆదాయం లభించిందని అన్నారు. కానుకల ద్వారా 20వేలకోట్లు, విరాళాల ద్వారా రూ.660 కోట్లు, టోల్ పన్నుల ద్వారా రూ.300 కోట్లు, ఇతర ఆదాయ వనరుల ద్వారా రూ.60వేల కోట్లు ఆదాయం వచ్చిందని అసెంబ్లీలో యోగిఆధిత్య నాథ్ తెలిపారు.