Alliance Disputes : కూటమిలో పొత్తు మంటలు.. టీడీపీ, జనసేన, బీజేపీలో భగ్గుమన్న అసంతృప్తులు
పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటన రాగానే వారంతా ఆగ్రహంతో రగిలిపోయారు. పార్టీ ఆఫీసు ముందు జెండాలు, ఫ్లెక్సీలు తగలబెట్టారు.

Alliance Disputes : టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులు, సీట్ల పంపకాలతో మూడు పార్టీల్లోనూ అసంతృప్త నేతలు భగ్గుమంటున్నారు. టీడీపీ సెకండ్ లిస్ట్ ప్రకటనతో ఈ భగభగలు మరింత పెరిగాయి. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, విశాఖ, తిరుపతి.. ఇలా పలుచోట్ల సీట్లు దక్కని నేతలు ఆగ్రహంతో ఊగిపోతున్నారు.
టీడీపీ జెండాలు, ఫ్లెక్సీలకు నిప్పు..
పిఠాపురం టీడీపీలో అసంతృప్త సెగలు భగ్గుమన్నాయి. పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నానని పవన్ ప్రకటించగానే అక్కడి టీడీపీ శ్రేణులు ఆందోళనలు తీవ్ర తరం చేశాయి. పార్టీ జెండాలు, ఫ్లెక్సీలకు నిప్పు పెట్టారు కార్యకర్తలు. స్థానిక నేత వర్మకు సీటు రాకపోవడంతో వారు మండిపడుతున్నారు. మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధమవుతున్నారు. వర్మ మద్దతుదారులు టీడీపీ ఆఫీసు ముందుకు నిరసనకు దిగారు. పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటన రాగానే వారంతా ఆగ్రహంతో రగిలిపోయారు. పార్టీ ఆఫీసు ముందు జెండాలు, ఫ్లెక్సీలు తగలబెట్టారు.
ఆరణి శ్రీనివాసులు గో బ్యాక్.. తిరుపతిలో తారస్థాయికి విబేధాలు
అటు.. తిరుపతి కూటమి అభ్యర్థి విషయంలో విభేదాలు మరింత ముదిరాయి. ఆరణి శ్రీనివాసులు గో బ్యాక్ అంటూ తిరుపతి వీధుల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. చిత్తూరు సిట్టింగ్ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులకు తిరుపతి జనసేన అభ్యర్థిగా టికెట్ ఖరారైంది అంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే, ఆరణి అభ్యర్థిత్వాన్ని టీడీపీ, జనసేన నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. స్థానిక బలిజ నేతకే తిరుపతి టికెట్ ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
పవన్ కల్యాణే పోటీ చేయాలి, లేదా లోకల్ బలిజ నేతకు ఇవ్వాలి..
చిత్తూరు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండి వైసీపీని వీడి జనసేనలో చేరిన ఆరణి శ్రీనివాసులుకు తిరుపతి అసెంబ్లీ సీటు కేటాయించబోతున్నట్లుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. దీంతో ఒక్కసారిగా తిరుపతిలో టీడీపీ, జనసేన నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఈ ఉదయం ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ ఆరణి శ్రీనివాసులు అభ్యర్థిత్వాన్ని అంగీకరించే ప్రసక్తే లేదన్నారు. తిరుపతిలో వీలైతే పవన్ కల్యాణే పోటీ చేయాలి, లేదా స్థానిక బలిజ నాయకుడికే టికెట్ ఇవ్వాలని నేతలు డిమాండ్ చేస్తున్నారు.
ఉదయం అంతా మీటింగ్ పెట్టుకున్న నాయకులు.. మరో అడుగు ముందుకేసి.. నగరంలో ఏకంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఆరణి శ్రీనివాసులు గో బ్యాక్ అంటూ నగరంలోని ప్రధాన కూడళ్లలో ఫ్లెక్సీలు పెట్టడం కలకలం రేపింది. ఆరని శ్రీనివాసులు పట్ల వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ఈ ఫ్లెక్సీలే నిదర్శనం అంటున్నారు.
Also Read : టీడీపీలో అసంతృప్త జ్వాలలు.. గంటా రహస్య భేటీ.. గండి బాబ్జి రాజీనామా