ధర్మపోరాట దీక్ష : మోడీకి బాబు వార్నింగ్

  • Published By: madhu ,Published On : February 11, 2019 / 04:36 AM IST
ధర్మపోరాట దీక్ష : మోడీకి బాబు వార్నింగ్

Updated On : February 11, 2019 / 4:36 AM IST

ఢిల్లీ : ఏపీ సీఎం చంద్రబాబు స్వరం పెంచారు. కేంద్రంతో సై అంటే సై అంటున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తున్నారు. రాష్ట్రం పట్ల వివక్ష చూపితే సహించేది లేదని..తాము చేస్తున్న పోరాటం ఐదు కోట్ల ప్రజలకు సంబంధించిందని..ఖబడ్దార్..అంటూ మోడీ సర్కార్‌ని హెచ్చరించారు బాబు. హక్కుల కోసం పోరాటమే తప్ప బిక్ష కోసం కాదన్నారు. లెక్కలు చెప్పడానికి తాము సిద్ధమని..కానీ తాము కట్టిన పన్నులు చెప్పడానికి మోడీ సర్కార్ సిద్ధమా ? అని ప్రశ్నించారు. మీ ఆటలు సాగవని చెప్పడానికే తాము ఢిల్లీకి వచ్చామన్నారు బాబు.

ఫిబ్రవరి 11వ తేదీన ఏపీ భవన్ వద్ద బాబు ధర్మపోరాట దీక్ష చేపట్టారు. ఉదయం 8 నుండి రాత్రి 8గంటల వరకు ఈ దీక్ష సాగనుంది. ఈ సందర్భంగా బాబు ప్రసంగించారు. ఆంధ్రభవన్ సాక్షిగా చేసిన ఉద్యమాలు ఎన్నాడూ ఫెయిల్ కాలేదని..రాష్ట్రం పట్ల వివక్ష చూపినప్పుడు న్యాయం కోసం పోరాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఈ పరిస్థితి తీసుకొచ్చిన కేంద్ర సర్కార్‌ని నిలదీయాలని పిలుపునిచ్చారు. పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీలు అమలు చేయలేదని పేర్కొన్నారు. 

తాము ముందే నిర్ణయించుకున్న దీక్ష కంటే ఒక రోజు ముందు మోడీ గుంటూరుకు వచ్చారని…విభజన హామీలు అమలు కోసం నిరంతరం పోరాడుతున్నామని బాబు తెలిపారు. ధర్మాన్ని పాటించాలని గతంలో వాజ్ పేయి మోడీకి చెప్పారని…ఏపీ విషయంలో ధర్మాన్ని పాటించాలని సూచించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం తమ పార్టీ ఎంపీలు గట్టిగా కొట్లాడారని..వారిని అభినందిస్తున్నట్లు చెప్పారు. గుంటూరుకు వచ్చిన మోడీ..తనను విమర్శించడానికే ఎక్కువ సమయం కేటాయించారని..విభజన చట్టంలో పేర్కొన్న వాటిని కేంద్రం అమలు చేసిందా ? ఇచ్చిన హామీలు అమలు చేయాలని…అమలు చేసేంత వరకు పోరాటం చేయడం జరుగుతుందని బాబు తెలిపారు.