AP Capital Issue : అమరావతి వర్సెస్ వైజాగ్.. వచ్చే ఎన్నికలు రాజధానిపై ప్రజా తీర్పేనా? ఏపీలో ఏం జరగనుంది?

మరో వారం 10 రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్న సమయంలో సీఎం జగన్ తాజా ప్రకటన విస్తృత చర్చకు దారితీసింది.

AP Capital Issue : అమరావతి వర్సెస్ వైజాగ్.. వచ్చే ఎన్నికలు రాజధానిపై ప్రజా తీర్పేనా? ఏపీలో ఏం జరగనుంది?

AP Capital Issue : క్లారిటీ వచ్చేసింది. ఎజెండా ఫిక్స్ అయ్యింది. సిద్ధంతో ప్రతిపక్షాలకు ఛాలెంజ్ విసిరిన సీఎం జగన్ ఇప్పుడు రాజధాని స్టేట్ మెంట్ తో రాబోయే ఎన్నికల తర్వాత తన టార్గెట్ ఏంటో తేల్చి చెప్పేశారు. జెండా సభ వేదికగా అమరావతి రాజధాని అని టీడీపీ-జనసేన కూటమి ప్రకటిస్తే.. విశాఖ గడ్డపై రాజధాని ఎజెండాను ప్రకటించి ఎన్నికలకు సిద్ధమన్నారు సీఎం జగన్.

మళ్లీ గెలుస్తున్నాం.. విశాఖలోనే ప్రమాణం చేస్తా..
మళ్లీ గెలుస్తున్నాం. విశాఖలోనే ప్రమాణం చేస్తా. విశాఖ నుంచే పాలన కొనసాగిస్తా అంటూ ముఖ్యమంత్రి జగన్ మరోమారు నిస్పష్ట ప్రకటన చేశారు. కొద్ది రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి అనగా.. సీఎం జగన్ ప్రకటన రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. మరో వారం 10 రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్న సమయంలో సీఎం జగన్ తాజా ప్రకటన విస్తృత చర్చకు దారితీసింది.

గత వారం తాడేపల్లిగూడెంలో జరిగిన టీడీపీ-జనసేన ఉమ్మడి సభలో కూటమి నేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్ అమరావతి రాజధానికి కట్టుబడి ఉన్నట్లు ప్రకటన చేశారు. అమరావతి రైతులకు తమ మద్దతు కొనసాగుతుందని ప్రకటించారు.

విపక్ష నేతల ప్రకటనపై ఇన్నాళ్లూ వేచి చూసిన జగన్.. విజన్ విశాఖ సమ్మిట్ లో తన విజన్ ఏంటో చెప్పేశారు. ఇంతకుముందు చెప్పినట్లు విశాఖ రాజధానికి కట్టుబడి ఉంటామని చెప్పడమే కాకుండా.. వచ్చే ఎన్నికల తర్వాత విశాఖ గడ్డపై నుంచే తాను ప్రమాణస్వీకారం చేస్తానని తేల్చి చెప్పారు సీఎం జగన్.

విశాఖలో రాజధాని ఏర్పాటు చేస్తే 10వేల కోట్లు చాలు..
ఎవరు ఎన్ని అవాంతరాలు సృష్టించినా విశాఖను పరిపాలన రాజధానిగా చేయాలన్నదే సీఎం జగన్‌ లక్ష్యంగా కనిపిస్తోంది. వచ్చే ఎన్నికలకు ఇదే అజెండాగా వెళ్లి.. ప్రజామోదం తర్వాత విశాఖలో ప్రమాణ స్వీకారం చేయడంతోపాటు అక్కడి నుంచే పరిపాలన కొనసాగించాలని భావిస్తున్నారు సీఎం జగన్‌. వాస్తవానికి సీఎం జగన్‌ విశాఖ రాజధానిపై అంత పట్టుదలగా ఉండటానికి చాలా కారణాలు చెబుతున్నారు. అందులో ప్రధానమైదని రాజధాని నిర్మాణానికి అయ్యే వ్యయం.. విశాఖలో రాజధాని ఏర్పాటు చేస్తే కేవలం 10వేల కోట్లతోనే అద్భుత రాజధాని నిర్మించొచ్చని భావిస్తున్నారు సీఎం జగన్‌. అదే అమరావతిలో కొత్త రాజధాని నగరం నిర్మించాలంటే ఇప్పటికిప్పుడు లక్ష కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సివస్తుందని అంచనా. కొత్త రాష్ట్రం అంత మొత్తం ఖర్చు చేసే పరిస్థితి లేనందున మూడు రాజధానుల ప్రతిపాదన చేస్తోంది వైసీపీ ప్రభుత్వం.

3 ప్రాంతాలూ అభివృద్ధి చెందాలంటే..
అమరావతిని శాసన రాజధానిగా కొనసాగిస్తూనే విశాఖను పరిపాలన రాజధాని చేయాలనేది ముఖ్యమంత్రి జగన్‌ అంతరంగం. గత ఎన్నికల్లో గెలిచిన వెంటనే 2019 డిసెంబర్‌లో అసెంబ్లీ వేదికగానే మూడు రాజధానులపై ప్రకటన చేశారు సీఎం జగన్‌. కొత్తగా ఏర్పడిన రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందాలంటే అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలన్నది సీఎం జగన్‌ ఆలోచన. అందుకు తగ్గట్టుగానే అమరావతిని శాసన రాజధానిగా కొనసాగిస్తూ విశాఖను పరిపాలన రాజధానిగా.. కర్నూలును న్యాయ రాజధానిగా ప్రకటించింది ప్రభుత్వం. దీనిపై శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టింది. అయితే ప్రతిపక్షాలు, రాజధాని రైతులు కోర్టుకు వెళ్లి ఈ బిల్లును అడ్డుకున్నాయి. అయినప్పటికీ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేదు సీఎం జగన్‌. మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే మూడు రాజధానులు ఉండాలన్న నిర్ణయానికి కట్టుబడి ఉన్నట్లు గతంలో పలు సందర్భాల్లో స్పష్టం చేశారు సీఎం జగన్‌.

అమరావతి రాజధాని నిర్మించాలంటే లక్ష కోట్ల రూపాయలు కావాలి..
అమరావతి రాజధాని నిర్మించాలంటే లక్ష కోట్ల రూపాయలు అవుతుందని.. అన్ని రకాల వసతులు కొత్తగా సమకూర్చుకోవాల్సి వుంటుందనేది ప్రభుత్వ వాదన. అదే విశాఖ రాజధాని అయితే కొద్దికాలంలోనే విశ్వనగరంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందని వైసీపీ ప్రభుత్వం చెబుతోంది. విశాఖలో అంతర్జాతీయ విమానాశ్రయంతోపాటు రాజధానికి కావాల్సిన సకల సౌకర్యాలు ఉన్నాయని.. అందుకే విశాఖను రాజధానిగా చేయాలనే నిర్ణయాన్ని ఆరు నూరైనా… అమలు చేద్దామని భావిస్తున్నారు సీఎం జగన్‌.

2019లో తొలిసారిగా మూడు రాజధానుల ప్రతిపాదన చేశారు సీఎం.. ఆ తర్వాత చాలా సందర్భాల్లో విశాఖ పరిపాలనా రాజధానిపై తన దృక్పథాన్ని తెలియజేశారు. ఓసారి ఢిల్లీలో పారిశ్రామికవేత్తల సమావేశంలో కూడా విశాఖ పరిపాలన రాజధానికి తాను కట్టుబడి ఉన్నట్లు తేల్చిచెప్పారు. అంతేకాకుండా తాను అమరావతి నుంచి విశాఖకు మారుతున్నట్లు చెప్పారు. ఇక ఎన్నికలు సమీపిస్తుండటంతో విశాఖ రాజధానినే అజెండా చేసుకోవాలని నిర్ణయించారు సీఎం జగన్‌.

15లక్షలు ఖర్చు పెట్టాల్సిందే..!
అమరావతి నిర్మించాలంటే ఇప్పటికిప్పుడు లక్ష కోట్లు అవసరమని, అమరావతిలో రాజధాని నిర్మాణం పూర్తి చేయడానికి పదేళ్లు పట్టే అవకాశం ఉన్నందున.. లక్ష కోట్లు కాస్త పది నుంచి పదిహేను లక్షల కోట్లకు పెరిగి రాష్ట్రంపై భారం అవుతుందని చెబుతున్నారు సీఎం జగన్‌. విశాఖలో అన్ని మౌలిక సదుపాయాలు ఉన్నందున.. కొద్దికాలంలోనే అభివృద్ధి చెంది రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుందని సీఎం జగన్‌ భావిస్తున్నారు. విశాఖ రాజధాని వల్ల జరిగే మేలును ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో.. అదే ప్రధాన అజెండాగా మార్చుకుని ఎన్నికలకు వెళ్లడంతోపాటు ప్రజామోదంతో ఎన్నికల తర్వాత విశాఖలోనే ప్రమాణ స్వీకారం చేస్తానని చెబుతున్నారు సీఎం జగన్‌.

3 రాజధానులు వర్సెస్‌ అమరావతి..
సీఎం తాజా ప్రకటనతో మూడు రాజధానులు వర్సెస్‌ అమరావతి రాజధాని అంశం చుట్టూనే రాజకీయం కొనసాగే పరిస్థితి కనిపిస్తోంది. గత ఐదేళ్లలో విశాఖ నుంచి పరిపాలన చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేసిన వైసీపీ ప్రభుత్వం.. ఇప్పుడు ప్రజాకోర్టులోనే తేల్చుకోవాలని నిర్ణయించిందని అంటున్నారు పరిశీలకులు. అటు టీడీపీ-జనసేన కూటమి కూడా అమరావతి రాజధానికి కట్టుబడి ఉన్నట్లు ప్రకటన చేయడం ద్వారా రాజధాని అంశం ఏకైక ఎన్నికల అస్త్రంగా మారింది. మొత్తానికి విజన్‌ విశాఖలో రాజధానిపై తన విజన్‌ విస్పష్టంగా ప్రకటించిన సీఎం జగన్‌.. తగ్గేదేలే అన్నట్లు దూకుడు ప్రదర్శిస్తున్నారు.

Also Read : వైసీపీ వర్సెస్ టీడీపీ.. నెల్లూరులో జోరుమీదున్న పార్టీ ఏది?