కేసీఆర్ డైరెక్షన్‌లో జగన్ అరాచకాలు : 10 రోజులు కష్టపడండి – బాబు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డైరెక్షన్‌లో జగన్ అరాచకాలు సృష్టిస్తున్నాడని..ఏం చేసుకుంటారో చేసుకోనివ్వండి..10రోజులు మాత్రం కష్టపడండి..అంటూ సీఎం చంద్రబాబు నాయుడు తెలుగు తమ్ముళ్లకు ధైర్యం నూరిపోస్తున్నారు. ముగ్గురు IPS అధికారులను కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ చేయడంపై బాబు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. కోర్టు మెట్లు ఎక్కారు కూడా. దీనితో సీఈసీ వర్సెస్ టీడీపీ ప్రభుత్వంగా మారిపోయింది. ఎన్నికల నేపథ్యంలో ప్రతి రోజు ఉదయం వివిధ జిల్లాల నేతలతో బాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. మార్చి 28వ తేదీన నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో బాబు నేతలకు దిశానిర్దేశం చేశారు.
దేశంలోని వ్యవస్థలన్నింటినీ మోడీ నాశనం చేశారని దుయ్యబట్టారు. అరాచకమే ప్రధాన అజెండగా మోడీ, కేసీఆర్, జగన్ ఎన్నికలకు వెళుతున్నారని విమర్శించారు. అరాచకాలు సృష్టించే కేసీఆర్ అధికారంలోకి వచ్చారని..ఇలాగే ఏపీలోనూ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని వ్యాఖ్యానించారు. కేసీఆర్ డైరెక్షన్‌లో జగన్ ఎన్ని అరాచకాలు చేయాలో అన్నీ చేస్తున్నారన్న బాబు..అరాచకం సృష్టిస్తూనే అధికారులను బదిలీ చేయించే స్థాయికి వచ్చారన్నారు. ఎంతమందిని బదిలీ చేస్తారో చేసుకోనివ్వండి…ప్రజాస్వామ్య విలువలు కాపాడే దిశగానే పోరాటం ఉంటుందన్నారు. ఆ స్పూర్తితో పోరాటానికి ప్రతొక్కరూ సిద్ధం కావాలని బాబు పిలుపునిచ్చారు.