రాజధాని లేదు, పరిశ్రమలూ లేవు.. ఇదేనా వైఎస్ఆర్ పాలన అంటే? సీఎం జగన్‌పై వైఎస్ షర్మిల ఫైర్

రాజధాని కడదామంటే డబ్బు లేదు. పోలవరం కట్టుకుందామంటే డబ్బు లేదు, పెద్ద పెద్ద పరిశ్రమలు పెట్టుకుందాం అంటే డబ్బు లేదు. ఆఖరికి రోడ్లు వేసుకుందామంటే డబ్బు లేదు. జీతాలు ఇయ్యాలంటే డబ్బు లేదు..

రాజధాని లేదు, పరిశ్రమలూ లేవు.. ఇదేనా వైఎస్ఆర్ పాలన అంటే? సీఎం జగన్‌పై వైఎస్ షర్మిల ఫైర్

YS Sharmila Questions CM Jagan

Updated On : February 7, 2024 / 8:33 PM IST

YS Sharmila : ఏపీ సీఎం జగన్ టార్గెట్ గా కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చెలరేగిపోతున్నారు. పలు అంశాలపై ప్రతి సభలో జగన్ ను నిలదీస్తున్నారు షర్మిల. ముఖ్యంగా ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తావిస్తూ ముఖ్యమంత్రి జగన్ పై నిప్పులు చెరుగుతున్నారు షర్మిల. తాజాగా బాపట్లలో కాంగ్రెస్ బహిరంగ సభలో ముఖ్యమంత్రి జగన్ లక్ష్యంగా షర్మిల విరుచుకుపడ్డారు.

”చంద్రబాబు కనీసం ఒక్కసారి కూడా ప్రత్యేక హోదా కోసం బీజేపీతో కొట్లాడలేకపోయారు. ఒక్క నిజమైన ఉద్యమం చేయలేకపోయారు. ఆరోజు ప్రతిపక్షంలో ఉన్న జగన్.. ప్రత్యేక హోదా కోసం నిరాహార దీక్షలు చేశారు. ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వడం లేదు? ఎందుకు కొట్లాడటం లేదని నిలదీశారు. ఆరోజు జగనన్న చెప్పిన మాట.. అందరం మూకుమ్మడిగా రాజీనామాలు చేద్దాం. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వదో చూద్దాం అని అన్నారు జగనన్నా.

మరి జగన్ సీఎం అయ్యాక ప్రత్యేక హోదా కోసం ఎంతమంది రాజీనామాలు చేశారు? మూకుమ్మడిగా ఎంతమంది రాజీనామాలు చేశారు? రాజీనామాలు సంగతి సరే.. కనీసం ఒక్కసారైనా ప్రత్యేక హోదా కావాలని ప్రధాని మోదీని నిలదీయగలిగారా? ఒక్క నిజమైన ఉద్యమం అయినా చేయగలిగారా? అలాంటి మీరా మాట మీద నిలబడేది.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి మాట తప్పకుండా, మడమ తిప్పకుండా పరిపాలన చేశారు. మాట కోసం ప్రాణమైనా ఇచ్చే వ్యక్తి వైఎస్ఆర్. జగనన్న మద్యపాన నిషేధం అన్నారు. ఆ మాట నిలబెట్టుకోలేదు. ప్రత్యేక హోదా అన్నారు. ఆ మాటా నిలబెట్టుకోలేదు. ఇదేనా వైఎస్ఆర్ ఆశయాలను నిలబెట్టడం అంటే? ఈరోజు రాష్ట్రం అప్పులకుప్పలా మారింది. 8లక్షల కోట్ల అప్పులు చేశారు. ఇంత డబ్బు తెచ్చారే. మరి మన రాష్ట్రంలో దేనికి ఉపయోగించారు? రాజధాని కడదామంటే డబ్బు లేదు. పోలవరం కట్టుకుందామంటే డబ్బు లేదు, పెద్ద పెద్ద పరిశ్రమలు పెట్టుకుందాం అంటే డబ్బు లేదు. ఆఖరికి రోడ్లు వేసుకుందామంటే డబ్బు లేదు. జీతాలు ఇయ్యాలంటే డబ్బు లేదు” అంటూ జగన్ సర్కార్ పై తీవ్ర విమర్శలు చేశారు షర్మిల.