టీడీపీ ప్రభుత్వ అక్రమాలపై విచారణకు సిట్ ఏర్పాటు

గత ప్రభుత్వ అవినీతి వ్యవహారాలను వెలికి తీసే పనిలో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సర్కార్ దూకుడు పెంచింది. రాజధాని భూములు, అవినీతి ఆరోపణలపై కేబినెట్ సబ్ కమిటీ సమర్పించిన నివేదికలోని అవినీతిపై కీలక నిర్ణయం తీసుకుంది. చంద్రబాబు ఐదేళ్ల పాలన, ప్రభుత్వ నిర్ణయాలపై సిట్‌ను (Special Investigation Team) ఏర్పాటు చేసింది. ఐపీఎస్ అధికారి కొల్లి రఘురామ్ రెడ్డి నేతృత్వంలో 10 మంది సభ్యులతో కూడిన సిట్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
రాష్ట్ర విభజన తర్వాత, నవ్యాంధ్ర అభివృద్ధిపై ప్రభావం చూపించేలా తీసుకున్న ప్రధాన విధానాలు, ప్రాజెక్టులు, పథకాలు ఏర్పాటు చేసిన సంస్థలు, ఇతర కీలకమైన పరిపాలనా నిర్ణయాలపై 2019 జూన్ 26వ తేదీన మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటైంది. ఈ కమిటీ తన తొలి నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది.
CRDA పరిధిలో భూముల కేటాయింపుతో సహా పలు ప్రాజెక్టుల్లో విధాన , న్యాయ , ఆర్థికపరమైన అవకతవకలను, మోసపూరిత లావాదేవీలను గుర్తించింది. దీనిపై నిశితంగా చర్చించిన తర్వాత… ఈ మొత్తం వ్యవహారంపై ఒక ప్రత్యేక ఏజెన్సీతో దర్యాప్తు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే సిట్‌ను ఏర్పాటు చేసినట్టు ప్రభుత్వం జీవోలో స్పష్టం చేసింది. పైగా గత అసెంబ్లీ సమావేశాల సందర్భంగా..ఈ అంశాలపై దర్యాప్తు జరిపించాలని స్పీకర్ కూడా ప్రభుత్వాన్ని ఆదేశించారని గుర్తు చేసింది.
సిట్ పనితీరు, విధి విధానాలను కూడా జీవోలో స్పష్టంగా పొందుపర్చారు. సిట్ అధికారులు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం ఆయా అంశాలపై విచారణ చేయవచ్చు. కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేయవచ్చు. అవసరమైతే కేంద్ర, రాష్ట్ర పరిధిలోని ఇతర విచారణ సంస్థల సహాయం తీసుకునేందుకు వెసులుబాటు కల్పించింది. అంతేకాదు… తాము దర్యాప్తు చేస్తున్న అంశానికి సంబంధించి ఏ వ్యక్తినైనా, అధికారినైనా పిలిపించుకుని, వారి వాంగ్మూలం రికార్డు చేసుకునే అధికారం కూడా సిట్‌కు ఉంటుంది. ఇక… ఆయా అంశాలకు సంబంధించిన ఎలాంటి రికార్డులనైనా తెప్పించుకుని పరిశీలించవచ్చు. సిట్‌కు అన్ని శాఖలు, అందరు అధికారులు సహకరించాల్సిందే. ఇదే జీవోలో పోలీసు స్టేషన్ ప్రస్తావన కూడా తీసుకొచ్చారు. సిట్‌నే ఒక పోలీసు స్టేషన్‌గా పరిగణిస్తారని స్పష్టం చేశారు.
సాధారణంగా ఒక సంచలన సంఘటన, విస్తృతమైన పరిధి ఉన్న అంశంపై సమగ్రమైన, ప్రత్యేక దర్యాప్తు కోసం సిట్ ఏర్పాటు చేస్తుంటారు. కానీ… ఇప్పుడు నిర్దిష్టంగా ఒక్క అంశంపై కాకుండా, గత ఐదేళ్ల కాలంలో తీసుకున్న అన్ని కీలక నిర్ణయాలపై సిట్ ఏర్పాటు చేశారు. సిట్‌లో నియమించిన సభ్యులంతా పోలీసు విభాగానికి చెందిన వారే ఉన్నారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో 50కి పైగా విభాగాలు తీసుకున్న నిర్ణయాల్లో లోటుపాట్లపై వీరు దర్యాప్తు చేయనున్నారు. రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు ప్రభుత్వం ఐదేళ్లలో తీసుకున్న, అమలు చేసిన అన్ని ప్రధాన నిర్ణయాలు, అప్పగించిన కాంట్రాక్టులు, ఏర్పాటు చేసిన సంస్థలన్నింటిపైనా దర్యాప్తు జరిపించాలని జగన్ సర్కారు తీర్మానించింది.
మొత్తం 10మంది సభ్యులతో సిట్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీనికి ఐపీఎస్ అధికారి కొల్లి రఘురామ్‌రెడ్డి నేతృత్వం వహించనున్నారు. ఇక సభ్యులుగా విశాఖ ఎస్పీ బాబూజీ అట్టాడ, ఇంటెలిజెన్స్ ఎస్పీ సీహెచ్ వెంకట అప్పలనాయుడు, కడప అదనపు ఎస్పీ శ్రీనివాసరెడ్డి, ఇంటెలిజెన్స్ డీఎస్పీ జయరామరాజు, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీఎస్పీ విజయభాస్కర్ సభ్యులుగా నియమించారు. వీరితోపాటు ఇంటెలిజెన్స్ డీఎస్పీ ఎం. గిరిధర్, ఏలూరు రేంజ్ ఇన్‌స్పెక్టర్ కెన్నడీ, నెల్లూరు జిల్లాకు చెందిన ఇన్‌స్పెక్టర్ ఐ. శ్రీనివాసన్, గుంటూరు జిల్లాకు చెందిన ఇన్‌స్పెక్టర్ వి. రాజశేఖరరెడ్డి సభ్యులుగా ఉన్నారు.
చంద్రబాబు ఐదేళ్ల పాలనపై ఉన్నతస్థాయిలో మంత్రివర్గ ఉపసంఘాన్ని ఇదివరకే నియమించారు. కేబినెట్‌లో నంబర్ -2 పొజిషన్‌లో ఉన్న బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, పార్టీలో నంబర్ 2గా భావించే విజయసాయి రెడ్డి, అప్పటి ప్రత్యేక సీఎస్ మన్మోహన్ సింగ్‌ను సభ్యులుగా నియమించారు. వీరు గుర్తించిన అవకతవకలపై ఇంకా లోతుగా దర్యాప్తు చేయించడానికి డీఐజీ స్థాయి అధికారి నేతృత్వంలో సిట్ వేశారు. అందులోనూ… సిట్ ఏ వ్యక్తినైనా,అధికారినైనా పిలిపించవచ్చచని జీవోలో స్పష్టం చేశారు. టార్గెట్‌గా పెట్టుకున్న కొందరు వ్యక్తులను విచారణ ముందు నిలబెట్టి, ఇరుకున పెట్టేందుకే వైసీపీ ఇలాంటి నిర్ణయం తీసుకుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ సిట్‌కు ప్రత్యేకంగా పోలీసు స్టేషన్ హోదా కల్పించడం కలకలం రేపుతోంది. దీని ఉద్దేశం ఏమిటనే అంశంపైనా చర్చ జరుగుతోంది.