రాష్ట్రమే కడుతుంది : పోలవరంపై మంత్రి కీలక వ్యాఖ్యలు

ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం గురించి పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పోలవరం ప్రాజెక్టుపై ప్రజలకు ఎలాంటి సందేహాలు అవసరం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వమే పోలవరం నిర్మాణాన్ని పూర్తి చేస్తుందని స్పష్టం చేశారు. పోలవరం నిర్మాణ పనులను కేంద్రానికి అప్పగించే యోచన రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్నారాయన. ఈ విషయంలో తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. అంతేకాదు రీ టెండరింగ్ ద్వారానే పోలవరం ప్రాజెక్టు పనులను కొనసాగిస్తామని మంత్రి తేల్చి చెప్పారు. సెప్టెంబర్ లో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఏపీలో పర్యటిస్తారని… పోలవరం ప్రాజెక్టు పనులను ఆయన పర్యవేక్షిస్తారని మంత్రి వెల్లడించారు.
టీడీపీ నేతలపై మంత్రి పెద్దిరెడ్డి ఫైర్ అయ్యారు. అనవసరంగా ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నారని విమర్శించారు. ఇటీవల పోలవరం హైడల్ ప్రాజెక్టు నుంచి నవయుగ కంపెనీ నుంచి తప్పిస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు తప్పుబట్టింది. ఈ పరిస్థితుల్లో పెద్దిరెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. రీ టెండరింగ్ ద్వారానే పోలవరం ప్రాజెక్టు పనులను కొనసాగిస్తామని మంత్రి చెప్పడం ఆసక్తికరంగా మారింది. రాష్ట్రంలో ప్రతి ఇంటికి తాగునీరు అందించే ప్రాజెక్ట్ కి సెప్టెంబర్‌లో టెండర్లు పిలవబోతున్నామని మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. రూ.60 వేల కోట్ల అంచనాలతో ఈ పనులను ప్రారంభించాలని భావిస్తున్నట్టు వివరించారు.
పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. రివర్స్ టెండరింగ్ కు వెళ్లాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకోవడమే ఇందుకు కారణం. ఇందులో భాగంగా నవయుగ కంపెనీతో చేసుకున్న ఒప్పందాన్ని కూడా ప్రభుత్వం రద్దు చేసుకుంది. రివర్స్ టెండరింగ్ నిర్ణయంపై టీడీపీ, బీజేపీ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. అలా చేస్తే ప్రాజెక్ట్ నిర్మాణం చాలా ఆలస్యం అవుతుందని ఆందోళన చెందుతున్నారు. రివర్స్ టెండరింగ్ నిర్ణయం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. జగన్ ప్రభుత్వం మాత్రం రివర్స్ టెండరింగ్ విషయంలో పట్టుదలగా ఉంది.
Also Read : కర్నూలులో ఎకరా స్థలం కూడా లేదు : ఫ్యాక్షనిస్టులు అధికారంలో ఉంటే ప్రజాసేవ చెయ్యలేరు