మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్.. పీర్జాదిగూడ మేయర్ పీఠం కాంగ్రెస్ హస్తగతం

కాంగ్రెస్ కండువా కప్పుకున్న బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఇన్నాళ్లు క్యాంప్ లో ఉన్నారు. ఇవాళ ఉదయమే క్యాంప్ నుంచి తిరిగి వచ్చారు.

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్.. పీర్జాదిగూడ మేయర్ పీఠం కాంగ్రెస్ హస్తగతం

Updated On : August 9, 2024 / 5:29 PM IST

Peerzadiguda Municipal Corporation : మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగిలింది. పీర్జాదిగూడ మేయర్ పీఠాన్ని కాంగ్రెస్ హస్తగతం చేసుకుంది. మేయర్ వెంకట్ రెడ్డిపై అవిశ్వాస తీర్మానం నెగ్గింది. జక్కా వెంకట్ రెడ్డి మేయర్ పదవిని కోల్పోవాల్సి వచ్చింది. కొత్త మేయర్ గా కాంగ్రెస్ కార్పొరేటర్ అమర్ సింగ్ ఎన్నికయ్యారు. మున్సిపల్ కార్పొరేషన్ లో మొత్తం 26 మంది కార్పొరేటర్లు ఉన్నారు. కాంగ్రెస్ కు 21 మంది కార్పొరేటర్లు మద్దతు తెలిపారు. బీఆర్ఎస్ కు 5 మంది కార్పొరేటర్లు మాత్రమే మద్దతుగా నిలిచారు. కాంగ్రెస్ కండువా కప్పుకున్న బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఇన్నాళ్లు క్యాంప్ లో ఉన్నారు. ఇవాళ ఉదయమే క్యాంప్ నుంచి తిరిగి వచ్చారు.

పీర్జాదిగూడ మేయర్ పీఠానికి సంబంధించి చాలా కాలంగా అవిశ్వాసం తీర్మానంపై ఉత్కంఠ నడిచింది. గతంలో కొంతమంది సమావేశానికి హాజరు కాకపోవడం వంటివి జరిగాయి. ఇవాళ మాత్రం ఉత్కంఠకు తెరపడింది. అవిశ్వాసం నెగ్గింది. మేయర్ గా ఉన్న జక్కా వెంకట్ రెడ్డి తన పదవిని కోల్పోయారు. అవిశ్వాస తీర్మానం పెట్టకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ జక్కారెడ్డి కోర్టుకి కూడా వెళ్లారు. కానీ, కోర్టు ఆయన వాదనలు వినలేదు. ఇప్పుడు అవిశ్వాస తీర్మానం పెట్టడంతో జక్కా వెంకట్ రెడ్డి తన పదవిని కోల్పోయారు. మేయర్ పీఠాన్ని కాంగ్రెస్ చేజిక్కించుకోనుంది. కాంగ్రెస్ కు చెందిన కార్పొరేటర్ అమర్ సింగ్.. మేయర్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మేయర్ పీఠం చేజారకుండా బీఆర్ఎస్ అన్ని ప్రయత్నాలు చేసింది. కానీ, ప్రయోజనం లేకుండా పోయింది.

Also Read : కొత్త అధ్యక్షుడిపై ఎటూ తేల్చుకోలేకపోతున్న బీజేపీ అధిష్టానం..! కారణం ఏంటి..

జక్కా వెంకట్ రెడ్డి వర్గం నుంచి చాలామంది కార్పొరేటర్లు కాంగ్రెస్ లో చేరడంతో జక్కా వెంకట్ రెడ్డి తన పదవిని కోల్పోవాల్సి వచ్చింది. అనేక ప్రాంతాల్లో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను కాంగ్రెస్ మెల్లమెల్లగా కైవసం చేసుకుంటోంది. అవిశ్వాసం పేరుతో తమవైపు వచ్చిన కార్పొరేటర్ల ద్వారా ముందుకెళ్తోంది హస్తం పార్టీ. మొత్తంగా కాంగ్రెస్ కు మరో కార్పొరేషన్ దక్కిందని చెప్పొచ్చు. ప్రధానమైన జీహెచ్ఎంసీ కార్పొరేషన్ కూడా ఇటీవలే కాంగ్రెస్ కైవసమైంది. ఇప్పుడు దాని పక్కనే ఉండే పీర్జాదిగూడ మేయర్ పీఠం కూడా కాంగ్రెస్ వశం కావడంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. ఉప్పల్, బోడుప్పల్, మేడ్చల్ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ కొంత వీక్ గా ఉంది. ఈ పరిస్థితుల్లో కార్పొరేషన్ దక్కడంతో ఒకింత కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది.