ఓటమి ఖాయం : బీజేపీ ఫ్యూచర్ చెప్పిన బాబు
గుంటూరు: పార్లమెంటులో తమ ఎంపీలను సస్పెండ్ చేసినంత మాత్రాన భయపడేది లేదని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. దేశంలో బీజేపీ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని, రాబోయే రోజుల్లో బీజేపీ ఓటమి తప్పదని చంద్రబాబు జోస్యం చెప్పారు. బీజేపీ చర్యలతో తమలో మరింత పట్టుదల పెరుగుతుందని.. అనుకున్నది సాధించి తీరతామని చంద్రబాబు అన్నారు. గుంటూరు జిల్లా అచ్చంపేటలో జరిగిన జన్మభూమి – మా ఊరు కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడారు. అతి తక్కువ అవినీతి ఉన్న రాష్ట్రం ఏపీయేనని అన్నారు. రాఫెల్ డీల్‌లో అవినీతి చేసిన వాళ్లు తమను విమర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
చంద్రబాబు ఛాలెంజ్:
సంక్షేమం, అభివృద్ధి విషయంలో బీజేపీ ప్రభుత్వం ఎంత చేసిందీ, టీడీపీ ప్రభుత్వం ఎంత చేసింది అనే దానిపై చర్చకు సిద్ధమా అని ప్రధాని మోదీకి చంద్రబాబు సవాల్ విసిరారు. తమను ఒంటరిని చేసి దెబ్బ తీయాలని చూస్తున్నారని మోదీపై మండిపడ్డారు. మూడు సార్లు ప్రధాని, ఏడు సార్లు అమిత్‌షా, పదిహేను మంది మంత్రులు, ముగ్గురు ముఖ్యమంత్రులు వచ్చినా బీజేపీ తెలంగాణాలో గెలిచింది ఒకే ఒక్క సీటంటూ ఎద్దేవా చేశారు.