ఇసుక సెగ : మంత్రులు బోత్స, మోపిదేవిలను నిలదీసిన కార్మికులు

గుంటూరులో మంత్రులు బొత్స సత్యనారాయణ, మోపిదేవి వెంకటరమణకి చేదు అనుభవం ఎదురైంది. మంత్రుల పర్యటనను భవన నిర్మాణ కార్మికులు అడ్డుకున్నారు. ఇసుక దొరకక పోవడంతో పనులు లేక పస్తులు ఉంటున్నామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యను తీర్చాలని నిలదీశారు. 2019, అక్టోబర్ 26వ తేదీ శనివారం ఉదయం మంత్రులు బోత్స, మోపిదేవీలు పరమాయకుంట, బీఆర్ స్టేడియం, పాత గుంటూరు, పొన్నూరు రోడ్డు ప్రాంతాల్లో పర్యటించారు. పారిశుధ్యంపై ఆరా తీశారు. అస్తవ్యస్థంగా మారిన రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థను పరిశీలించారు.
పూలకొట్ల సెంటర్ వద్దకు చేరుకోగా..అక్కడనే ఉన్న భవన నిర్మాణ కార్మిక సంఘాలు అడ్డుకున్నారు. ఇసుక కొరతను తీర్చాలన్నారు. ఎక్కడా ఇసుక దొరకపోవడం వల్ల తాము పస్తులుంటున్నామని, ఎన్నో రోజులు ఈ సమస్య ఉన్నా ఎవరూ పరిష్కరించడం లేదని నిలదీశారు. వెంటనే ఇసుక కొరతను తీర్చాలన్నారు. వారిని సముదాయించే ప్రయత్నం చేశారు మంత్రులు.
కొన్ని రోజులుగా ఇసుకపై రాజకీయ రచ్చ కొనసాగుతోంది. ప్రతిపక్షాలు వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. టీడీపీ దీనిపై ఆందోళనలు చేపట్టింది. అక్టోబర్ 25వ తేదీ శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, ధర్నాలు చేశారు తెలుగు తమ్ముళ్లు. భవన నిర్మాణ కార్మికులతో కలిసి ఆందోళనలు చేపడుతున్నారు. టీడీపీతో పాటు జనసేన కూడా ఇసుక కొరత విషయంలో అధికార పార్టీ తీరుపై విమర్శలు చేస్తోంది. విశాఖపట్టణంలో భారీ ర్యాలీ చేపట్టనున్నట్లు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. భవన నిర్మాణ కార్మకులకు మద్దతుగా ఈ ర్యాలీ నిర్వహిస్తోంది జనసేన.
Read More : వైసీపీ లోకి వల్లభనేని వంశీ ! దీపావళి తర్వాత క్లారిటీ