కేసీఆర్ కు మద్దతిస్తే రాష్ట్ర ద్రోహులుగా మిగిలిపోతారు : చంద్రబాబు
కేసీఆర్ కు మద్దతు ఇస్తే రాష్ట్ర ద్రోహులుగా మిగిలిపోతారని సీఎం చంద్రబాబు అన్నారు.

కేసీఆర్ కు మద్దతు ఇస్తే రాష్ట్ర ద్రోహులుగా మిగిలిపోతారని సీఎం చంద్రబాబు అన్నారు.
కడప : కేసీఆర్ కు మద్దతు ఇస్తే రాష్ట్ర ద్రోహులుగా మిగిలిపోతారని సీఎం చంద్రబాబు అన్నారు. ఏపీకి అన్ని విధాలుగా అన్యాయం చేసి, దోచుకున్న వ్యక్తి కేసీఆర్ అని విమర్శించారు. 60 సంవత్సరాలు హైదరాబాద్ లో ఉన్నామన్నారు. చాలా కష్టపడి సంపద సృష్టించి, ఆదాయాన్ని పెంచామని తెలిపారు. ఆదాయాన్ని దోచుకుని.. సంపదను హస్త గతం చేసుకుని.. మనల్ని కట్టుబట్టలతో పంపించారని వాపోయారు. అవమానం చేసి పంపించారని మండిపడ్డారు. రాష్ట్ర విభజన చేసి మనల్ని తరిమికొట్టారని తెలిపారు. అలాంటి కేసీఆర్ కు జగన్ మద్దతిస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ ను చూస్తే జగన్ కు లాగులు తడుస్తాయన్నారు. జగన్.. కేసీఆర్ ను కాళ్లు మొక్కుతా బాంచన్ అంటున్నారని ఎద్దేవా చేశారు. ఆత్మగౌరవం పోతే మళ్లీ తేలేనని చెప్పారు చంద్రబాబు. టీఆర్ఎస్, వైసీపీ తమ మిత్రపక్షమని పీయూష్ గోయెల్ ప్రకటించారని తెలిపారు.
ముస్లీంల పట్ల వివక్ష, దారుణమైన దాడులకు మోడీ పాల్పడుతున్నారని ఆరోపించారు. కాశ్మీర్ మొదలుకొని.. కన్యాకుమారి వరకు ముస్లీంలకు భద్రత లేదన్నారు. ముస్లీంలు ఏ ఆహారం తింటే మోడీకి ఎందుకని ప్రశ్నించారు. మీరు తినే తిండిని ఆయన డిసైడ్ చేస్తాడా అని నిలదీశాడు. త్రిబుల్ తలాఖ్ విషయంలో మైనార్టీలపై దాడులు చేయడానికి, బాధ పెట్టడానికి ప్రత్యేకమైన చట్టం తీసుకొచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందువులకు ఒక చట్టం.. ముస్లీంలకు ఒక చట్టమా అని నిలదీశారు. దేశంలో ముస్లీంలు భాగస్వాములు కారా అని ప్రశ్నించారు. గోద్రా సంఘటనలో 2500 మందిని ఊచకోత కోశారని.. ముస్లీలను నిర్దాక్షిణ్యంగా చంపేశారని తెలిపారు. ఆనాడు మోడీని డిస్మిస్ చేయమని మొట్టమొదటగా తానే డిమాండ్ చేసినట్లు గుర్తు చేశారు. మోడీ నమ్మక ద్రోహం చేశారని మండిపడ్డారు.
టీడీపీ హయాంలో అనేక సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చేట్టామని తెలిపారు. అభివృద్ధిలో ముందుకు పోయామన్నారు. అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసి, రూ.5లకే నాణ్యమైన భోజనం పెట్టామని తెలిపారు. మూడు హజ్ హౌజ్ లను కట్టిన ఘనత టీడీపీదేనని స్పష్టం చేశారు. మైనార్టీ గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఆటో రిక్షాలను కొనుగోలుకు మైనార్టీలకు 50 శాతం సబ్సిడీ ఇస్తామని చెప్పారు.
పులివెందులకు నీళ్లు ఇచ్చానని తెలిపారు. రాయసీమకు నీళ్లిచ్చి సస్యశ్యామలం చేస్తానని చెప్పారు. కడపకు స్టీల్ ప్లాంట్ ప్రకటించానని అన్నారు. కడపను స్మార్ట్ సీటీగా తాయారు చేస్తానని చెప్పారు. పట్టణాల్లో ఉచితంగా డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మిస్తామని చెప్పారు. జాబు రావాంటే బాబు ఉండాలి.. మళ్లీ మళ్లీ గెలవాలన్నారు.