నెల్లూరు వైసీపీలో వర్గ విభేదాలు : ఎడముఖం పెడముఖంగా నేతలు
ఎన్నికలు సమీపిస్తుండడంతో నెల్లూరు జిల్లాలో రాజకీయాలు కాక పుట్టిస్తున్నాయి.

ఎన్నికలు సమీపిస్తుండడంతో నెల్లూరు జిల్లాలో రాజకీయాలు కాక పుట్టిస్తున్నాయి.
నెల్లూరు : ఆ జిల్లా వైసీపీకి కంచుకోట. గత ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను కైవసం చేసుకుంది. ఈ ఎన్నికల్లోనూ సీన్ రిపీట్ చేసేందుకు .. వైసీపీ ప్రయత్నిస్తోంది. ప్రజల్లో ఫ్యాను పార్టీకి మంచి ఆదరణ ఉన్నప్పటికీ నాయకుల్లో మాత్రం ఐక్యత కనిపించడంలేదు. ఎవరికి వారే యమునాతీరన్నట్లుగా ఉంది పరిస్ధితి. నేతల మధ్య బేధాభిప్రాయాలు అధిష్టానానికి తలబొప్పి కట్టిస్తున్నాయి. మరి ఎన్నికల్లో వైసీపీకి గడ్డు పరిస్ధితి తప్పదా..? పట్టున్న స్ధానాలు కోల్పోవలసిందేనా..? అసలు అధిష్టానం ఏం చేయబోతోంది..? హాట్ హాట్‌గా మారిన నెల్లూరు రాజకీయాలపై స్పెషల్ స్టోరీ చూద్దాం.
ఎన్నికలు సమీపిస్తుండడంతో నెల్లూరు జిల్లాలో రాజకీయాలు కాక పుట్టిస్తున్నాయి. ఈ జిల్లాలో వైసీపీకి మంచి పట్టుంది. జిల్లా రాజకీయాల్లో రెడ్డి సామాజిక వర్గానిదే డామినేషన్. ఇప్పటికే వచ్చే ఎన్నికల్లో నియోజకవర్గ సమన్వయ కర్తలనే బరిలోకి దించాలని వైసీపీ భావిస్తుంటే.. టీడీపీ మాత్రం అభ్యర్ధులను ఇంకా ఖరారు చేయలేదు. గత ఎన్నికల్లో జిల్లాలోని మెజార్టీ స్థానాల్లో వైసీపీ విజయం సాధించింది. అయితే ఈసారి ఎన్నికల్లో కూడా అదే రిజల్ట్ దక్కించుకునేందుకు ఫ్యాను పార్టీ తహతహలాడుతోంది.
గత వైభవం కోసం వైసీపీ పోరాడుతున్నా.. స్ధానిక పరిస్ధితులు అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. వైసీపీలోని జిల్లా నాయకులు, ఎమ్మెల్యేల మధ్య సమన్వయం కుదరక.. ఎవరికి వారే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. నియోజకవర్గాల్లోనైతే సమన్వయకర్తలు, పార్టీ టికెట్ ఆశావహుల మధ్య .. వర్గ విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఎవరికివారు నేను గెలిస్తే చాలనే ధోరణిలో ఉన్నట్లు కనిపిస్తోంది. అందుకోసం సొంతపార్టీ అభ్యర్ధిని ఓడించేందుకు కూడా సై అంటున్నారని రాజకీయ వర్గాలు విశ్లేషించుకుంటున్నాయి. సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి జిల్లా అధ్యక్షునిగా వహరిస్తున్నా.. ఎమ్మెల్యేలు, నాయకులను సమన్వయం చేయలేకపోతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనీల్ కుమార్ యాదవ్ , నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలు ప్రజా సమస్యలపై పోరాడుతూ నిత్యం ప్రజల్లోనే ఉంటున్నారు. పార్టీ సమావేశాలు, సభల్లో ఎమ్మెల్యేలిద్దరూ కలిసి పనిచేస్తున్నా.. అంతర్గతంగా మాత్రం ఇద్దరి మధ్య విభేదాలే. వీరిద్దరికీ ఒకరంటే ఒకరు పడదన్నది బహిరంగ రహస్యమే. సిటీ ఎమ్మెల్యే అనీల్ కుమార్ యాదవ్‌ను దెబ్బతీసేందుకు ఆ పార్టీలోని ఓ రెడ్డి త్రయం ఏకమైందన్న ప్రచారమూ సాగుతోంది. అనీల్ ప్రభావాన్ని తగ్గించడమే వారి టార్గెట్‌గా తెలుస్తోంది. ఇటీవల జగన్ పాదయాత్రలో గూడూరు మున్సిపల్ ఛైర్మన్ పొణకా దేవసేనమ్మ, ఆమె అనుచరులు, కౌన్సిలర్‌లు తమకు తెలియకుండా అనీల్ కుమార్ యాదవ్ ఆద్వర్యంలో వైసీపీలో చేరడంపై .. జిల్లా అధిష్టానంతో పాటు, ఆ నియోజకవర్గ ఇంఛార్జ్ కూడా ఫీల్ అయినట్లు సమాచారం.
కావలి నియోజకవర్గ వైసీపీ టికెట్ సిట్టింగ్ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికే అని ప్రచారం సాగుతోంది. దీంతో ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి, అదే పార్టీకి చెందిన వంటేరు వేణుగోపాల్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డిల మధ్య వర్గ విబేధాలు తారాస్థాయికి చేరాయి. దీంతో ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్ధికి వెన్నుపోట్లు తప్పవని తెలుస్తోంది. ఇప్పటికే ఆశావహులు విష్ణువర్ధన్ రెడ్డి, వంటేరు వేణుగోపాల్ రెడ్డిలు పార్టీ అధిష్టానానికి వ్యతిరేకంగా తిరుగుబావుటా ఎగురవేశారు. మొదట్లో మాజీ ఎంపీ మేకపాటితో సన్నిహితంగా ఉన్న ప్రతాప్ కుమార్ రెడ్డి.. ఆ తరువాత పార్టీలో చేరిన ఆనం రామనారాయణ రెడ్డికి దగ్గరవడంతో .. అటు మేకపాటి కూడా ప్రతాప్ కుమార్ రెడ్డిని దూరం పెట్టినట్లు సమాచారం.
జగన్.. పార్టీ పెట్టినప్పటి నుంచి అతని వెంటే నడుస్తున్న మేకపాటి కుటుంబానికి .. వచ్చే ఎన్నికల్లో జిల్లాలో 3 టికెట్లు రాకుండా చేసేందుకు .. మేకపాటి వ్యతిరేకవర్గం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో నెల్లూరు ఎంపీ అభ్యర్ధిగా మేకపాటి రాజమోహన్ రెడ్డి, ఆత్మకూరు అసెంబ్లీకి సిట్టింగ్ ఎమ్మెల్యే మేకపాటి గౌతంరెడ్డి, ఉదయగిరి నియోజవర్గం నుంచి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి పోటీ చేసేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. అయితే మేకపాటి కుటుంబాన్ని రెండు సీట్లకే పరిమితం చేయాలని వైసీపీలోని .. ఆ రెడ్డి సామాజికవర్గం గ్రూపు నాయకులు తీవ్రంగా కృషి చేస్తున్నారట. ఈ క్రమంలోనే మేకపాటి రాజమోహన్ రెడ్డి పార్టీ మారతారన్న ప్రచారం సాగింది.
గూడూరు నియోజకవర్గంలో కూడా వైసీపీ రాజకీయాలు పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారాయి. నియోజకవర్గంలో పార్టీకి ఎల్లసిరి గోపాల్ రెడ్డి, పేర్నాటి శ్యాంసుందర్ రెడ్డి, నల్లపరెడ్డి, నేదురుమల్లివర్గాలు, కోడూరు మీరారెడ్డి, పొణకా దేవసేనమ్మ వంటి బలమైన నాయకులుగా ఉన్నా.. వారి మధ్య ఉన్న విభేదాలే ఎన్నికల్లో వైసీపీ కొంపముంచేటట్లున్నాయి. ఈ విభేదాలు తారాస్థాయికి చేరడంతో ఒక వర్గం .. నియోజకవర్గ ఇంఛార్జి మేరిగ మురళికి అండగాను, మరోవర్గం వ్యతిరేకంగానూ నిలబడుతున్నాయి. మరోవైపు పనబాక కృష్ణయ్య కూడా వైసీపీలోకి వచ్చేందుకు ప్రయత్నాలు మమ్మురం చేసినట్లు సమాచారం.
ఆత్మకూరు, సర్వేపల్లి, సూళ్లూరుపేట నియోజకవర్గాల్లో వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు మేకపాటి గౌతం రెడ్డి, కాకాణి గోవర్ధన్ రెడ్డి, కిలివేటి సంజీవయ్యలు .. అలాగే వెంకటగిరి, ఉదయగిరి, కోవూరు నియోజకవర్గాల్లో ఇంఛార్జ్‌లు ఆనం రామనారాయణ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిలు తమ పని తాము సాఫీగా చేసుకుపోతున్నారు. నియోజకవర్గంలో ప్రజా సమస్యలపై పోరాడుతున్నారు. కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న విభేదాలు తలెత్తినా సున్నితంగా పరిష్కరించుకుంటూ ప్రజల్లో ఉంటున్నారు. అయితే వీరిలో కొందరు నేతలు పక్క నియోజకవర్గ విషయాల్లో జోక్యం చేసుకుని లేనిపోని సమస్యలు సృష్టిస్తున్నారన్న ప్రచారం సాగుతోంది.
ఇప్పటికైనా పార్టీ అధిష్టానం జిల్లాపై దృష్టిపెట్టి పార్టీలోని వర్గ విభేదాలను పరిష్కరించకపోతే రానున్న ఎన్నికల్లో వైసీపీకి గడ్డు పరిస్థితి తప్పేట్టులేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అయితే ఎన్నికలు సమీపిస్తుండడంతో పార్టీ అధిష్టానం ఆ దిశగా చర్యలు చేపట్టి ఎక్కువ స్థానాలను కైవసం చేసుకుంటుందో లేదో చూడాలి మరి.