ఏపీలో ఆధిపత్య పోరు 

  • Published By: chvmurthy ,Published On : April 24, 2019 / 04:21 PM IST
ఏపీలో ఆధిపత్య పోరు 

Updated On : April 24, 2019 / 4:21 PM IST

అమరావతి: పాలనలో పైచేయి కోసం ఏపీలో ఆధిపత్యపోరు కొనసాగుతోంది. సీఎస్ రివ్యూలపై వివాదం అంతకంతకు ముదురుతోంది. ప్రస్తుత పరిస్థితి అధికారులు వర్సెస్ రాజకీయ నేతలుగా మారింది.  సీఎస్ వరుస సమీక్షలను టీడీపీ నేతలు తప్పుపడుతున్నారు. అయితే సీఎస్ మాత్రం సమీక్షలు చేస్తే తప్పేంటని ప్రశ్నిస్తున్నారు. 

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వేళ సీఎస్‌ను మారుస్తూ.. కేంద్రం రాజేసిన అగ్గి.. రోజు రోజుకు రాజుకుంటోంది. రాష్ట్రంలో సీఎస్ ఓ వైపు.. ప్రభుత్వం మరోవైపు అన్నట్లు తయారైంది పరిస్థితి. ఎన్నికల ఫలితాలకు దాదాపు నెల రోజుల సమయం ఉండడంతో… ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం సహా పలు అంశాలపై సమీక్షలు చేపట్టారు. ఆ సమీక్షలను ఎన్నికల సంఘం తప్పుపట్టింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా సమీక్షలు నిర్వహించరాదని, అధికారులెవరూ వాటికి హాజరు కాకూడదని మార్గనిర్దేశం చేసింది. అయితే.. రెండురోజులుగా రాష్ట్రంలోని పలు అంశాలపై సీఎస్ వరుస సమీక్షలు నిర్వహిస్తుండటాన్ని ప్రభుత్వ పెద్దలతో పాటు.. టీడీపీ నేతలు తీవ్రంగా తప్పుపడుతున్నారు.

ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం చేస్తున్న సమీక్షలపై టీడీపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. వచ్చే నెల 23న జరిగే ఓట్ల లెక్కింపుపై సీఎస్‌ సమీక్ష నిర్వహించడాన్ని ఏపీ ప్రణాళికా మండలి ఉపాధ్యక్షుడు కుటుంబరావు తప్పుపట్టారు. బీజేపీ చెప్పుచేతల్లో పనిచేస్తున్న ఎన్నికల కమిషన్‌ సూచనలతో సీఎస్‌ సమీక్షలు చేస్తున్నారని విమర్శించారు. ఎవరి ఆదేశాలతో సమీక్షలు చేస్తున్నారో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం వివరణ ఇవ్వాలని కుటుంబరావు డిమాండ్‌ చేశారు. 

ఎల్వీ సుబ్రహ్మణ్యం తీరుపై మంత్రి యనమల ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆర్థిక శాఖ, ఎన్నికల కౌంటింగ్‌లపై సీఎస్‌ సమీక్షలు నిర్వహించడంపై ఆయన అభ్యంతరం తెలిపారు. సంక్షేమ పథకాలకు నిధుల విడుదలను ప్రశ్నించడం అహేతుకమన్న యనమల.. మూడు స్కీములకు బడ్జెట్‌లో నిధులు లేవనడమేంటని ప్రశ్నించారు. ఆ స్కీములకు ఓటౌన్ అకౌంట్‌ కింద తాము బడ్జెట్ కేటాంపులు జరిపామని.. కొత్తగా వీటిపై సీఎస్ రివ్యూ చేయడం హాస్యాస్పదమని అన్నారు.

ఓట్ల లెక్కింపు ఏర్పాట్లపై ఎన్నికల ప్రధాన కార్యదర్శి ద్వివేది, డీజీపీ ఠాకూర్‌తో రివ్యూ చేసే అధికారం….ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఎక్కుడుందని ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్‌ ప్రశ్నించారు. కౌంటింగ్ ఏర్పాట్లపై సీఎస్‌ ఎందుకు తల దూర్చుతున్నారన్న ఆయన…ప్రజాసమస్యలపై సీఎం సమీక్ష చేస్తే తప్పు లేదన్నారు. 

సీఎం, సీఎస్‌లకు సమీక్ష అధికారాలెలా ఉన్నా.. ఈ సమస్యకు ఫుల్‌ స్టాప్‌ పడాలంటే.. ఎన్నికల ఫలితాలు విడుదలయ్యే వరకు ఆగాల్సిందేనని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.