గుడివాడలో అవినాష్‌: కీలకంగా ఉన్నదెవరూ?

  • Published By: vamsi ,Published On : March 10, 2019 / 05:05 AM IST
గుడివాడలో అవినాష్‌: కీలకంగా ఉన్నదెవరూ?

Updated On : March 10, 2019 / 5:05 AM IST

గుడివాడ అసెంబ్లీ టిక్కెట్‌ను తెలుగుదేశం ఇప్పటికే దివంగత దేవినేని నెహ్రూ కుమారుడు దేవినేని అవినాష్‌కు కేటాయించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి రావి వెంకటేశ్వరరావు, ఆప్కాబ్‌ చైర్మన్‌ పిన్నమనేని వెంకటేశ్వరరావు, మున్సి పల్‌ చైర్మన్‌ యలవర్తి శ్రీనివాసరావు, అర్బన్‌ బ్యాంకు చైర్మన్‌ పిన్నమనేని బాబ్జీలను కలసి మద్దతు ఇవ్వాలంటూ అవినాష్ కోరారు. సామాజిక వర్గాల వారీగా నాయకులను కలుస్తూ ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో గుడివాడ నియోజకవర్గంలో ముఖ్యనేతగా ఉన్న మాజీ మంత్రి కఠారి ఈశ్వరకుమార్‌ను కూడా దేవినేని అవినాష్‌ కలసి మద్దతు కోరారు. దేవినేని నెహ్రూకు మంచి మిత్రుడు అయిన కఠారి ఈశ్వరకుమార్‌ తీసుకునే నిర్ణయం రాబోయే ఎన్నికల్లో కీలకం కానుంది. 
ఇదిలా ఉంటే జనసేన తరపున నియోజకవర్గ ఇన్‌చార్జి బూరగడ్డ శ్రీకాంత్‌, ముస్లిం మైనార్టీ నాయకుడు అబ్దుల్‌ వహీద్‌ పేర్లు వినిపిస్తున్నాయి. కాపు సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉండే గుడివాడ నియోజకవర్గంలో వారి ప్రభావం రెండు పార్టీలపై ఖచ్చితంగా ఉంటుంది. అలాగే కాంగ్రెస్ సాంప్రదాయ ఓటు బ్యాంకింగ్ కూడా నియోజకవర్గంలో ఉండగా.. వారు ఎటువైపు మొగ్గుచూపుతారు అనేది ఆసక్తికరంగా ఉంది. వారు కాంగ్రెస్‌కే ఓటు వేస్తే రాబోయే ఎన్నికల్లో ఎవరికి నష్టం అనే చర్చ జరుగుతుంది. మరోవైపు తెలుగుదేశం టిక్కెట్ దేవినేని అవినాష్‌కు దక్కడంపై నియోజకవర్గంలోని పార్టీ శ్రేణులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నాయి. గుడివాడ అసెంబ్లీ టికెట్‌ రావి వెంకటేశ్వరరావుకే ఇవ్వాలని నియోజకవర్గ టీడీపీ కార్యవర్గ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. రావికి టిక్కెట్ దక్కని విషయమై నందివాడ, గుడివాడ, గుడ్లవల్లేరు పార్టీ నేతలు సమావేశమై అసమ్మతి స్వరం వినిపించారు.